12,600 Vehicles Reach Tirumala Hill: తిరుమలకు 12,600 వాహనాలు!
ABN , Publish Date - Dec 26 , 2025 | 04:43 AM
టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బుధవారం రికార్డు స్థాయిలో వాహనాలు తిరుమల కొండెక్కాయి. వేకువజాము 3 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు 12,600 వాహనాలు కొండపైకి చేరుకున్నాయి.
24న రికార్డు స్థాయిలో కొండపైకి రాక
తిరుమల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బుధవారం రికార్డు స్థాయిలో వాహనాలు తిరుమల కొండెక్కాయి. వేకువజాము 3 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు 12,600 వాహనాలు కొండపైకి చేరుకున్నాయి. టీటీడీ చరిత్రలోనే ఈ సంఖ్య రికార్డు కావడం గమనార్హం. వీటిలో ఫోర్ వీలర్స్ 10,272, ద్విచక్ర వాహనాలు 995, ఆర్టీసీ బస్సులు వెయ్యి, టీటీడీ వాహనాలు 93, సిక్స్ వీలర్స్ 84, ప్రభుత్వ వాహనాలు 152 ఉన్నాయి. ఇక, గురువారం కూడా ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయానికే 9వేల వాహనాలు తిరుమల చేరుకున్నాయి. ఉదయం 5 గంటల నుంచే అలిపిరి చెక్‌పాయింట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వేగవంతంగా తనిఖీలు నిర్వహించి తిరుమలకు అనుమతించడంతో మధ్యాహ్నం 1గంట తర్వాత సాధారణ పరిస్థితి నెలకొంది. కొవిడ్ తర్వాత తిరుమలకు సొంత వాహనాలు, స్వగ్రామాల నుంచే ట్యాక్సీల ద్వారా వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో రెండు మూడేళ్లుగా తిరుమలలోను.. అలిపిరి తనిఖీ కేంద్రం నిత్యం వాహనాల రద్దీ ఉంటోంది. అలిపిరి చెక్‌పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు అర కిలోమీటరుపైగానే వాహనాలు నిలిచిపోతున్నాయి. కాగా, తిరుమలలో గురువారం కూడా రద్దీ కొనసాగింది. సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.