Share News

పునర్నిర్మాణం

ABN , Publish Date - Jun 12 , 2025 | 01:13 AM

కూటమి ప్రభుత్వం రాగానే ఉమ్మడి కృష్ణాజిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమై.. వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుల పునరుద్ధరణకు నడుం బిగించింది. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది. మల్లవల్లిలో అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీని పునఃప్రారంభింపజేయడం, తద్వారా 600 మందికి ఉద్యోగాలు కల్పించడంతోనే తొలి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విజయవాడ మెట్రో ప్రాజెక్టు, అమరావతి నూతన రైల్వే లైన్‌, జెట్‌ సిటీ పునరుద్ధరణతో అభివృద్ధి వైపు అడుగులు వేసింది. కేంద్రాన్ని ఒప్పించి జాతీయ రహదారి ప్రాజెక్టుల సాకారం దిశగా కృషి చేసింది. ఎన్‌డీబీ రోడ్ల విస్తరణ, మల్లవల్లి పారిశ్రామిక వాడకు పూర్వ వైభవం వంటి అనేక లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

పునర్నిర్మాణం

- అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న కూటమి పాలనకు నేటితో ఏడాది

- అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ ప్రారంభం.. 600 మందికి ఉద్యోగాలు

- అమరావతి రైల్వే లైన్‌, విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు కదలిక

- జక్కంపూడి జెట్‌ సిటీ పునర్నిర్మాణానికి అడుగులు.. మల్లవల్లికి మహర్దశ

- పుంజుకున్న విమానయానం.. శరవేగంగా నూతన టెర్మినల్‌ పనులు

- ఓఆర్‌ఆర్‌, విజయవాడ - ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్‌ హైవేతో రవాణా సౌలభ్యం

- ఉమ్మడి కృష్ణాజిల్లా అభివృద్ధే లక్ష్యంగా మరిన్ని ప్రణాళికలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

కూటమి ప్రభుత్వం రాగానే ఉమ్మడి కృష్ణాజిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమై.. వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుల పునరుద్ధరణకు నడుం బిగించింది. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది. మల్లవల్లిలో అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీని పునఃప్రారంభింపజేయడం, తద్వారా 600 మందికి ఉద్యోగాలు కల్పించడంతోనే తొలి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విజయవాడ మెట్రో ప్రాజెక్టు, అమరావతి నూతన రైల్వే లైన్‌, జెట్‌ సిటీ పునరుద్ధరణతో అభివృద్ధి వైపు అడుగులు వేసింది. కేంద్రాన్ని ఒప్పించి జాతీయ రహదారి ప్రాజెక్టుల సాకారం దిశగా కృషి చేసింది. ఎన్‌డీబీ రోడ్ల విస్తరణ, మల్లవల్లి పారిశ్రామిక వాడకు పూర్వ వైభవం వంటి అనేక లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

పట్టుబట్టి అశోక్‌ లేల్యాండ్‌ ప్రారంభం

అధికారంలోకి వస్తే మల్లవల్లిలోని అశోక్‌ లేల్యాండ్‌ ప్లాంట్‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. అన్నట్టుగానే ఆ హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది.అధికారంలోకి రాగానే అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి, వారి ఇబ్బందులు ఏమిటో తెలుసుకుంది. ఎలక్ర్టిక్‌ బస్సులకు గతంలో బాడీ బిల్డింగ్‌ చేయాలన్న ఒప్పందం నడిచినా.. కరోనా అనంతరం తలెత్తిన ఆర్థిక మాంద్యం తదితర కారణాలతో ఉత్పాదకత తగ్గటం, బాడీ బిల్డింగ్‌కు ఇంత దూరం రావటం వయబిలిటీగా లేదని ఆ సంస్థ భావించింది. దీంతో ఎలక్ర్టికల్‌ బస్సులతో పాటు సాధారణ డీజిల్‌ బస్సులకు కూడా ఇక్కడే బస్‌ బాడీ బిల్డింగ్‌ చేసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో అశోక్‌ లేల్యాండ్‌ యాజమాన్యం వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టింది. మొత్తం 75 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాంట్స్‌ను సన్నద్ధం చేసింది. బస్సుల బాడీ బిల్డింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దిన తర్వాత ఉత్పాదకతను ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ చేతుల మీదుగా అశోక్‌ లేల్యాండ్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్లాంట్‌ ద్వారా స్థానికంగా ఉన్న 600 మందికి ఉద్యోగాలు లభించాయి. మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో అతి పెద్ద భారీ పరిశ్రమగా అశోక్‌ లేల్యాండ్‌ ఉత్పత్తి సాగిస్తోంది. ఈ ప్లాంట్‌ మళ్లీ ప్రారంభం కావడానికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విశేషమైన కృషి జరిపారు.

విజయవాడ మెట్రో పరుగులు!

వైసీపీ ప్రభుత్వంలో తొక్కిపట్టిన విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం రాగానే కదలిక వచ్చింది. విజయవాడ మెట్రో ప్రాజెక్టును మొదటి దశలో గన్నవరం నుంచి రామవరప్పాడు రింగ్‌, ఏలూరు రోడ్డు మీదుగా పీఎన్‌బీఎస్‌ వరకు, పెనమలూరు సెంటర్‌ నుంచి బందరు రోడ్డు మీదుగా పీఎన్‌బీఎస్‌ వరకు మొత్తంగా 38.4 కిలోమీటర్ల పొడవున రెండు కారిడార్లను నిర్మించటానికి అడుగులు పడ్డాయి. ప్రభుత్వం డీపీఆర్‌ను ఆమోదించటంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌ (సీఎంపీ) కోసం కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ దిశగా అడుగులు వేసింది. ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లా యంత్రాంగాల స్థాయిలో ఏపీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి ఇప్పటికే చర్చలు జరిపారు. భూ సేకరణ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. మెట్రో ప్రాజెక్టుకు నూరుశాతం నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. భాగస్వామ్య విధానంలో చేద్దామని కేంద్రం ప్రతిపాదించింది. దీంతో ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు ప్రస్తుతం రుణ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. దాదాపుగా టెండర్ల దశకు చేరుకుంటోంది.

నిడమానూరు డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ సాకారం

కూటమి ప్రభుత్వం రాగానే కేంద్రం విజయవాడకు అతిపెద్ద ఫ్లై ఓవర్‌ను మంజూరు చేస్తూ శుభవార్త వినిపించింది. రూ.600 కోట్ల వ్యయంతో ఎన్‌హెచ్‌ - 16 మీద ఆరు వరసల విధానంలో నిర్మించేందుకు డీపీఆర్‌ కూడా పూర్తయింది. టెండర్లు పిలిచే దశలో.. ఇదే మార్గంలో మెట్రో కారిడార్‌ కూడా వస్తుండటంతో ఈ సమస్యను ఎలా అధిగమించాలన్న దానిపై ఎన్‌హెచ్‌, ఏపీఎంఆర్‌సీలు భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా ఫ్లై ఓవర్‌ మీద మెట్రో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించేలా.. నిడమానూరు జంక్షన్‌ నుంచి రామవరప్పాడు రింగ్‌ రోడ్డు వరకు 4.5 కిలోమీటర్ల మేర డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మించేందుకు అడుగులు పడ్డాయి. డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌కు సంబంధించి మెట్రో అధికారులు రూ.1000 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు వేసి మోర్తుకు పంపించారు. మోర్తు నుంచి ఆమోదం రాగానే.. దీని పనులు మెట్రో కారిడార్‌ - 1లో భాగంగా ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులే చేపడతారు.

జెట్‌ సిటీకి పునర్వైభవం దిశగా అడుగులు

జక్కంపూడి ఎకనమిక్‌ టౌన్‌షిప్‌ (జెట్‌) సిటీని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పని, నివాసం ఒకేచోట అన్న విధానంలో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 15 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 6,755 ఇళ్ల నిర్మాణ పనులతో పాటు, ఫ్యాక్టరీ ఫ్లాటెడ్‌ కాంప్లెక్స్‌-1 పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక జెట్‌ సిటీకి పునర్వైభవం దిశగా అడుగులు పడ్డాయి. ఫ్యాక్టరీ ఫ్లాటెడ్‌ కాంప్లెక్స్‌ను పూర్తి చేయటానికి అపెడ్కో, ఏపీఐఐసీలకు సంయుక్తంగా బాధ్యతలను అప్పగించింది.

ఎన్‌డీబీ రోడ్లకు శ్రీకారం

వైసీపీ ప్రభుత్వ హయాంలో నేషనల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) నిధులతో తలపెట్టి అర్ధంతరంగా వదిలేసిన ఆర్‌అండ్‌బీ రోడ్ల విస్తరణ పనులను పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం రాగానే చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాలో మొత్తం 13 ఆర్‌అండ్‌బీ రోడ్లను రెండు వరసలుగా విస్తరించేందుకు రూ.245 కోట్ల వ్యయంతో శ్రీకారం చుట్టగా, కేవలం మూడూ రోడ్లనే అప్పట్లో చేపట్టడం జరిగింది. మిగిలిన 10 రోడ్ల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. కూటమి ప్రభుత్వం రాగానే.. ఎన్‌డీబీ పనులపై దృష్టి సారించటంతో ఉమ్మడి జిల్లాలో 10 ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులను ప్రారంభించారు. కాంట్రాక్టు సంస్థతో క్షేత్ర స్థాయిలో పనులు చేయిస్తోంది.

పెరిగిన విమాన సర్వీసులు

విజయవాడ విమానాశ్రయం కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ కళకళలాడుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సాధించిన మిలియన్‌ మార్క్‌ ప్రయాణికుల రాకపోకలు మళ్లీ ఇప్పుడు సాధ్యమైంది. ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నైలకు రద్దైన విమానాలను పునరుద్ధరించటంతో పాటు అదనంగా మరిన్ని విమానాలను నడుపుతున్నారు. ప్రస్తుతం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 52 విమానాల రాకపోకలు సాగుతుండటం విశేషం. విదేశీ విమానాలకు కూడా ప్రయత్నాలు జరగుతున్నాయి. విమానాశ్రయంలో సాగుతున్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులను కూడా వేగవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంది.

అమరావతి రైల్వేలైన్‌ పనులు

వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన అమరావతి నూతన రైల్వే లైన్‌ ప్రాజెక్టు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక తెరమీదకు వచ్చింది. ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో భూసేకరణకు నోటిఫికేషన్లను కూడా వెలువరించింది. ఖమ్మంజిల్లా ఎర్రుపాలెం మీదుగా ఎన్టీఆర్‌ జిల్లా పరిటాల.. గుంటూరు జిల్లా అమరావతి మీదుగా నంబూరు వరకు నూతన అమరావతి రైల్వే లైన్‌ను నిర్మించనున్నారు. భూ సేకరణ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.

ఓఆర్‌ఆర్‌పై ఆశలు

అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)ను కేంద్రం చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ఓఆర్‌ఆర్‌ను చేపట్టేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇటీవలే స్వల్పంగా అలైన్‌మెంట్‌లో కేంద్రం ఆదేశాల మేరకు మార్పులు జరిగాయి. రోడ్డు 70 మీటర్లా.. 140 మీటర్లా అన్న దానిపై అధికారిక ఆదేశాలు రాగానే.. శరవేగంగా ఈ రోడ్డు పనులు పూర్తి కానున్నాయి. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ఓఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ సింహభాగం వెళుతోంది. ఓఆర్‌ఆర్‌కు భూ సేకరణ అధికారులను కూడా నియమించారు.

విజయవాడ - ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే

విజయవాడ - నాగపూర్‌ ఎకనమిక్‌ కారిడార్‌లో భాగంగా విజయవాడ - ఖమ్మం మధ్య తలపెట్టనున్న నాలుగు వరసల గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి. మూడేళ్ల ఎదురు చూపులు ఫలించాయి. కూటమి ప్రభుత్వం రాగానే భూ సేకరణ అంశంపై దృష్టి సారించటంతో 86శాతంపైగా భూములను అప్పగించటం జరిగింది. ఎన్‌హెచ్‌కు స్వాధీనం చేసిన భూముల్లో పనులు మొదలయ్యాయి.

పరిశ్రమలకు ఊతం

కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో పరిశ్రమలు ప్రారంభించలేదన్న పేరుతో 376 యూనిట్ల భూ కేటాయింపులను రద్దు చేయటం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి మరో అవకాశాన్ని కల్పిస్తూ భూ కేటాయింపులను పునరుద్ధరించింది. పరిశ్రమలకు ఊతం ఇచ్చింది.

Updated Date - Jun 12 , 2025 | 01:14 AM