క్రాస్ క్లోవర్ లీఫ్ రహదారి నిర్మాణంపై పునఃపరిశీలన చేయండి
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:52 AM
మచిలీపట్నం- విజయవాడ జాతీయ రహదారి-65, జాతీయ రహదారి-216ను కలుపుతూ మచిలీపట్నం సమీపంలోని ఎస్‌ఎన్ గొల్లపాలెం వద్ద చేపట్టనున్న క్రాస్ క్లోవర్ లీఫ్ రహదారి నిర్మాణంపై పునఃపరిశీలన చేయాలని కోరుతూ పలువురు రైతులు కలెక్టరేట్‌లో జరిగిన మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీకి సోమవారం వినతిపత్రం అందించారు.
- కలెక్టర్ బాలాజీకి రైతుల విజ్ఞప్తి
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
మచిలీపట్నం- విజయవాడ జాతీయ రహదారి-65, జాతీయ రహదారి-216ను కలుపుతూ మచిలీపట్నం సమీపంలోని ఎస్‌ఎన్ గొల్లపాలెం వద్ద చేపట్టనున్న క్రాస్ క్లోవర్ లీఫ్ రహదారి నిర్మాణంపై పునఃపరిశీలన చేయాలని కోరుతూ పలువురు రైతులు కలెక్టరేట్‌లో జరిగిన మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీకి సోమవారం వినతిపత్రం అందించారు. మచిలీపట్నం సమీపంలో జాతీయ రహదారుల విస్తరణకు గతంలో తమ భూములను ఇచ్చినట్టు చెప్పారు. పోర్టు నిర్మాణం నేపథ్యంలో రెండు జాతీయ రహదారులను కలుపుతూ ఎస్‌ఎన్ గొల్లపాలెం సమీపంలో క్రాస్ క్లోవర్ లీఫ్ రహదారి నిర్మాణం చేసేందుకు మోర్త్ అధికారులు నమూనాను తయారు చేశారని తెలిపారు. దీని వల్ల జాతీయ రహదారుల నిర్మాణానికి గతంలో ఇచ్చిన భూమిలో మిగిలిన కొద్దిపాటి భూమిని కూడా పూర్తిస్థాయిలో తాము కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరిగితే నగరం మరింతగా విస్తరిస్తుందనే ముందుచూపుతో జాతీయ రహదారులను విస్తరించేందుకు గూడురు సమీపం నుంచి హర్ష కాలేజీ వరకు ఎలాంటి మలుపులు లేకుండా భూమిని జాతీయ రహదారుల అధికారులు ఇటీవల సర్వే చేశారని తెలిపారు. దీని ప్రకారం కేవలం ఆరు కిలోమీటర్లు దూరం వస్తుందన్నారు. అదే మచిలీపట్నం సమీపంలోని ఎస్‌ఎన్ గొల్లపాలెం సమీపం నుంచి చూస్తే 8.2 కిలోమీటర్ల మేర దూరం ఉందని తెలిపారు. గూడూరు సమీపం నుంచి జాతీయ రహదారి నిర్మాణం జరిగితే రహదారి నిర్మాణం, భూమి కొనుగోలు వ్యయం కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు. బందరు పోర్టు నుంచి సరుకుల ఎగుమతులు, దిగుమతులు జరిగితే వాహనాలు నగరం సమీపంలోకి రాకుండా బయటి నుంచే రాకపోకలు సాగించే అవకాశం కూడా ఉందని వివరించారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ క్రాస్ క్లోవర్ లీఫ్ రహదారి నిర్మాణంపై పునఃపరిశీలన చేయాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్రను కూడా ఇటీవల కలిశామని తెలిపారు. జాతీయ రహదారి విస్తరణకు సంబంధించిన నమూనాలో మార్పులు చేసేందుకు వారు సూచనప్రాయంగా అంగీకరించినట్లు వివరించారు.