ఆర్‌ఏపీతో భరోసా!
ABN , Publish Date - Aug 27 , 2025 | 01:33 AM
రాజధానిలో భూమిలేని పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఆర్‌డీఏ సిద్ధమైంది. రీసెటిల్‌మెంట్ యాక్షన్ ప్లాన్(ఆర్‌ఏపీ)కు శ్రీకారం చుట్టింది. కూలీల సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు విద్య, వైద్యం, ఉపాధి కల్పనను మెరుగు పరచడంపై ప్రధానంగా దృష్టి సారించనుంది. దీనికి అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది.
- రాజధానిలో భూమిలేని పేదల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
- రీసెటిల్‌మెంట్ యాక్షన్ ప్లాన్‌కు సీఆర్‌డీఏ శ్రీకారం
- సొంతిల్లు, విద్య, వైద్యం, ఉపాధి కల్పనను మెరుగుపరిచేలా ప్రణాళిక
రాజధానిలో భూమిలేని పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఆర్‌డీఏ సిద్ధమైంది. రీసెటిల్‌మెంట్ యాక్షన్ ప్లాన్(ఆర్‌ఏపీ)కు శ్రీకారం చుట్టింది. కూలీల సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు విద్య, వైద్యం, ఉపాధి కల్పనను మెరుగు పరచడంపై ప్రధానంగా దృష్టి సారించనుంది. దీనికి అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
రాజధాని అమరావతిలో భూమి లేని పేదల కోసం రీసెటిల్‌మెంట్ యాక్షన్ ప్లాన్ (ఆర్‌ఏపీ)కి సీఆర్‌డీఏ శ్రీకారం చుట్టింది. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఏఐయూడీపీ) కార్యక్రమంలో అంతర్భాగంగా రీసెటిల్‌మెంట్ పాలసీని రూపొందించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో భూమి లేని పేదల అభ్యున్నతి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రీసెటిల్‌మెంట్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం రాజధానిలో భూమిలేని పేదలను హౌస్‌హోల్డ్ సర్వే ద్వారా గుర్తిస్తారు. 2015వ సంవత్సరం, ఆ తర్వాత వార్షిక కౌలు వంటి వాటిని కూడా సమీక్షిస్తారు. రాజధాని అమరావతి అభివృద్ధి ప్రణాళికలలో భూములు ఉండటం వల్ల రాజధానిలో అంతర్భాగంగా ఉన్న 24 గ్రామాల పరిధిలో భూమిలేని పేదలు తమ జీవనోపాధిని కోల్పోయే అవకాశం ఉంది. రాజధాని గ్రామాల భూమిలేని పేదలకు ప్రధాన ఆదాయ వనరును కోల్పోవటం జరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రీసెటిల్‌మెంట్ యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నారు.
ఇప్పటి వరకు ప్రభుత్వ తోడ్పాటు
రాజధాని అమరావతిలో మార్చి, 2015లో నిర్వహించిన సోషియో ఎకనమిక్ సర్వే తదనంతరం 2018 నాటికి అప్‌డేట్ చేసిన ప్రకారం 21,530 మంది భూమిలేని పేదలు ఉన్నారు. అనూహ్యంగా ఫిబ్రవరి 1, 2025 నాటికి భూమిలేని పేదలు 17,164గా తేలారు. వీరిలో 857 భూమిలేని కుటుంబాలు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను అందుకుంటున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ వంటి కార్యక్రమాలు కూడా భూమిలేని పేదలకు ఉపాధి అవకాశాలను కల్పించాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున భూమిలేని పేదల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. పదేళ్లపాటు నెలకు రూ.2,500 చొప్పున పెన్షన్ అందిస్తోంది. ఆ తర్వాత రూ. 5 వేలకు పెంచటం జరిగింది. 2015-16లో రూ.58.41 కోట్ల పెన్షన్లు ఇవ్వగా, 2024 - 25 నాటికి రూ.94.51 కోట్ల మేర పెన్షన్లు ఇచ్చారు. ఈ పదేళ్ల కాలంలో రూ.631.51 కోట్లను పెన్షన్‌గా ఇవ్వటం జరిగింది. ఇల్లులేని వారి కోసం గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టింది. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో భాగంగా రాజధాని అమరావతిలోని అనంతవరం, దొండపాడు, తుళ్లూరు, ఐనవోలు, మందడం, నిడమర్రు, నవులూరు, పెనుమాక గ్రామాల్లో 44.5 ఎకరాల విస్తీర్ణంలో 5,024 ఫ్లాట్లతో కూడిన గృహ నిర్మాణాన్ని తలపెట్టింది. ఏడాది మొత్తం ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటానికి వీలుగా రూ. 25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను కూడా అందిస్తున్నారు. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ద్వారా వారి జీవనోపాధికి బాటలు వేస్తోంది. ఉచిత విద్య, వైద్యం వంటి సదుపాయాలను కూడా కల్పిస్తోంది.
బడ్జెట్‌లో కేటాయింపులు
2025-26 ఆర్థిక సంవత్సరానికి భూమిలేని రాజధాని పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.120.16 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఒక్క పెన్షన్లకే రూ.114 కోట్లు, సోషియో ఎకనమిక్ సర్వేకు రూ. 50లక్షలు, సోషల్ ఆడిట్‌కు రూ.15 లక్షలు, ఎన్‌జీవో నియామకానికి రూ.39 లక్షలు, స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్స్‌కు రూ.10 లక్షలు, ఎన్‌ఏసీ సపోర్ట్‌కు రూ.5 కోట్లు, జాబ్ మేళాల నిర్వహణకు రూ.2 లక్షలు చొప్పున బడ్జెట్ కేటాయింపులు చేశారు. భూమిలేని కార్మికుల డేటా కోసం సెప్టెంబరు 25 నాటికి సర్వే చేయాలని నిర్ణయించారు. చదువుకున్న పిల్లలకు స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇవ్వటం కోసం సంస్థల ఎంపికను అక్టోబరు, 2025 నాటికి పూర్తి చేయాలని, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారి కోసం సోషియో ఎకనమిక్ స్టడీని అక్టోబరు 2025కి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రతి నెలా జాబ్ వేళాలు నిర్వహించాలని, ప్రతి త్రైమాసికానికి ఒక సారి కమ్యూనిటీ కోఆర్డినేషన్ మీటింగ్స్ నిర్వహించాలని, ప్రతి వారం గ్రీవెన్స్ డేలను పెట్టి అర్జీలను స్వీకరించాలని నిర్ణయించారు.