Share News

సేంద్రియ సాగుకు సమాయత్తం!

ABN , Publish Date - Apr 30 , 2025 | 01:39 AM

రసాయనిక ఎరువులు వినియోగానికి దూరంగా సేంద్రియ పద్ధతిలో పంటల సాగు చేపట్టేలా వ్యవసాయ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని 141 పంచాయతీల్లో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు .59,206 ఎకరాల్లో సాగుకు రైతులను సమాయత్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

సేంద్రియ సాగుకు సమాయత్తం!

- తక్కువ పెట్టుబడి.. నాణ్యమైన దిగుబడే లక్ష్యం

- ఎరువులు, పురుగు మందులు వాడకుండా పంటల సాగు

- జిల్లాలోని 141 పంచాయతీల్లో అమలుకు సన్నాహాలు

- ఈ ఏడాది 59,206 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయానికి కార్యాచరణ

- జూన్‌ నుంచి ప్రయోగాత్మకంగా అమలు

రసాయనిక ఎరువులు వినియోగానికి దూరంగా సేంద్రియ పద్ధతిలో పంటల సాగు చేపట్టేలా వ్యవసాయ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని 141 పంచాయతీల్లో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు .59,206 ఎకరాల్లో సాగుకు రైతులను సమాయత్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లాలో ఈ ఏడాది తొలి విడతగా 141 గ్రామ పంచాయతీల్లో 59,206 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు ప్రణాళికను అధికారులు రూపొందించారు. గత నెల రోజులుగా ఈ అంశంపై ఎంపిక చేసిన గ్రామాల్లో అవగాహనా సదస్సులను వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేస్తే పెట్టుబడి ఖర్చులు తగ్గే విధానం, నాణ్యమైన ఉత్పత్తులకు లభించే అదనపు ఆదాయం, మార్కెటింగ్‌ సౌకర్యాలు తదితర అంశాలను వివరించి ఈ సంవత్సరం ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా సేంద్రియ పద్ధతిలో వరి సాగు చేసేలా రైతులను చైతన్యవంతం చేస్తున్నారు. దీంతో పాటు 890 హెక్టార్లలో ఉద్యాన పంటల సాగును విస్తరింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉద్యాన పంటల సాగులో 100 హెక్టార్లలో పండ్ల జాతి మొక్కల పెంపకం, 50 హెక్టార్లలో కూరగాయలు, పూలసాగు, 690 హెక్టార్లలో వివిధ రకాల తోటలు, 50 హెక్టార్లలో సుగంధ ద్రవ్య మొక్కల సాగుకు ప్రణాళికను రూపొందించారు. వచ్చే నెలలో రైతులు, డ్వాక్రా మహిళలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు. జూన్‌ నుంచి సేంద్రియ వ్యవసాయ ప్రక్రియ ప్రారంభించనున్నారు.

32 రకాల విత్తనాలు చల్లితే..

భూసారాన్ని పెంచేందుకు ఇప్పటి వరకు జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తనాలను మాత్రమే వ్యవసాయశాఖ సిఫార్సు చేసేది. ఈ ఏడాది నుంచి భూసారాన్ని మరింతగా పెంచేందుకు ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా 32 రకాల విత్తనాలను పొలంలో చల్లాలని చెబుతున్నారు. పప్పుజాతి గింజలు, నూనె గింజలు, పూల జాతి, సుగంధ ద్రవ్యాలు, చిరుఽ ధాన్యాలు, పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించి విత్తనాలను ఎకరానికి ఎంత చల్లాలనే అంశంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మినుము, పెసర, బొబ్బర్లు, జనుము, జీలుగ, పిల్లిపెసర, గోధుమలు ఒకకేజీ చొప్పున వేసవి దుక్కుల అనంతరం, తొలకరి సమయంలో చల్లాలి. వీటితో పాటు రాగులు, కొర్రలు, సామలు, మొక్కజొన్న, జొన్నలు అరకిలో చొప్పున పొలంలో వేయాలి. మెంతులు 50 గ్రాములు, ధనియాలు 200 గ్రాములు, తోటకూర, గోంగూర విత్తనాలు 50గ్రాముల చొప్పున చల్లాలి. వంగ, టమాటా, గోరుచిక్కుడు విత్తనాలు 100 గ్రాముల చొప్పున, బెండ, బీర, కాకర, అనప, గుమ్మడి విత్తనాలు 50గ్రాముల చొప్పున, నువ్వులు 150 గ్రాములు, ఆముదం లేదా పొద్దు తిరుగుడు విత్తనాలు 250 గ్రాములు, ఆవాలు 100 గ్రాములు, వేరుశెనగ విత్తనాలు అరకిలో, బంతి విత్తనాలు 100 గ్రాములు మొత్తంగా ఎకరానికి 13.500 కిలోల విత్తనాలను చల్లాలని శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. ఈ విత్తనాల ఖరీదు సుమారు రూ.1200 నుంచి రూ.1300 వరకు ఉంటుంది.

పెరగనున్న భూసారం

32 రకాల విత్తనాలను పొలంలో చల్లితే భూసారం పెరగడంతోపాటు ఆకుకూరలు, ఇతరత్రా పంటలు రైతులు ఇంటి అవసరాల కోసం కూడా వాడుకునే అవకాశం ఉంటుందని ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా అధికారి పార్థసారధి తెలిపారు. తొలకరి వర్షాలకు ఈ విత్తనాలు అన్నీ మొలిచి పొలంలో పెరిగితే జీవ వైవిధ్యం వృద్ధి చెందుతుందని, నేలలో సేంద్రియ కర్భనశాతం పెరుగుతుందని చెప్పారు. పొలంలో పెరిగిన వివిధ మొక్కల వేర్లు భూమిలోని సూక్ష్మజీవులకు ఆశ్రయం ఇస్తాయని, వీటి ద్వారా సాగు చేసే పంటలకు కావాల్సిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయని వివరించారు. భూసారం పెరగడంతో వరి, ఇతరత్రా ఉద్యానపంటలు తెగుళ్లను తట్టుకుని నిలబడతాయని చెప్పారు. నేల గుల్లబారి, వానపాములు వృద్ధి చెందుతాయన్నారు. నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు వేసవిలో ఈ విత్తనాల సాగు చేయడం వలన పశువులకు మేతగాను ఉపయోగపడుతుందని తెలిపారు.

తుఫాన్లు, భారీ వర్షాలను తట్టుకునే సామర్థ్యం

జిల్లాలో ఇప్పటికే కొందరు రైతులు తక్కువ మొత్తంలో తిండి గింజల కోసం సేంద్రియ పద్ధతిలో వరి, ఇతర పంటలను సాగు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన వరిపైరు తుఫాన్లు, భారీ వర్షాలను తట్టుకుని నిలబడే ఉంటోందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. నాగాయలంక మండలం తలగడదీవి గ్రామంలో మిచౌంగ్‌ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన వరి నేలవాలకుండా నిలబడే ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. ఎరువులు అధికంగా వినియోగించిన పొలాలు నేలవాలినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆసే్ట్రలియాకు చెందిన శాస్త్రవేత్త ఫిన్లీ తలగడదీవిలో సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన వరిపైరుపై పరిశోధనలు చేశారని, ఈ పద్ధతిలో సాగు చేసిన వరి పొలంలోని వరి కాండాలు ఇటుకలతో కట్టిన గోడ మాదిరిగా పటిష్టంగా ఉన్నట్లుగా ఆయన నిర్థారించారని జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం డీఎంవో నాగమల్లేశ్వరి తెలిపారు. ఎరువులు అధికంగా వినియోగించిన వరి పొలంలోని వరి కాండాలు బలహీనంగా ఉన్నట్లు ఆసే్ట్రలియా శాస్త్రవేత్త గుర్తించారని ఆమె వివరించారు.

.

Updated Date - Apr 30 , 2025 | 01:39 AM