Share News

BJP State President Madhav: రాయలసీమ అభివృద్ధికి తొలి ప్రాధాన్యం

ABN , Publish Date - Jul 31 , 2025 | 06:19 AM

రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం. సీమ అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

BJP State President Madhav: రాయలసీమ అభివృద్ధికి తొలి ప్రాధాన్యం

  • యువత ఉద్యోగ, ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి

  • అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే బెంగళూరు వరకూ విస్తరణ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, జూలై 30(ఆంధ్రజ్యోతి): ‘రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం. సీమ అభివృద్ధికి తొలి ప్రాఽధాన్యం ఇస్తాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ‘సారథ్యం’ పేరుతో ఆయన రాయలసీమలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం అనంతపురానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సాగునీటి, వ్యవసాయ ప్రాజెక్టులు చేపట్టి రాయలసీమ రూపురేఖలను మార్చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కియ వంటి మరిన్ని పరిశ్రమలను తీసుకువచ్చేందుకు బీజేపీ కృషి చేస్తుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఉమ్మ డి, విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రులను అందించిన ఘనత రాయలసీమదే. చారిత్రాత్మక కట్టడాలు, నిర్మాణాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రసాదం, స్వదేశీ దర్శిని పథకాల ద్వారా అభివృద్ధి చేస్తాం. అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వేను బెంగళూరు వరకు విస్తరిస్తాం. దీంతో కోస్తాంధ్రకు, బెంగళూరుకు రవాణా సదుపాయం మరింత మెరుగవుతుంది. అనంతలో భారీ స్టేడియం నిర్మించి, క్రీడారంగాన్ని ప్రోత్సాహిస్తాం. కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ పట్ల ప్రత్యేక మక్కువ ఉంది. అభివృద్ధి చేసి ఆచరణలో పెడతాం. అనంతలో రైతులు అధికంగా పండించే పంటలకు అనువుగా ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. కేంద్రం ప్రవేశపెట్టిన 168 పథకాలను ప్రజలకు చేరువ చేసి, అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వాములను చేస్తాం. కూటమి ప్రభుత్వంలో చిన్నచిన్న అభిప్రాయ భేదాలున్నా సరిచేసుకుంటూ ముందుకు సాగుతాం’ అని అన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 06:20 AM