Rayachoti Protests: జిల్లా మార్పు వార్తలపై భగ్గుమన్న రాయచోటి
ABN , Publish Date - Dec 29 , 2025 | 04:03 AM
జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లా పూర్తిగా రద్దు అవుతుందనన్న వార్తలు, సంకేతాలతో అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి భగ్గుమంది.
సీఎంను కలిసిన మంత్రి మండిపల్లి
రాయచోటి/అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లా పూర్తిగా రద్దు అవుతుందనన్న వార్తలు, సంకేతాలతో అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి భగ్గుమంది. ఆదివారం ఇక్కడ జిల్లా సాధన సమితి, పలు ప్రజాసంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేసి.. రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలుపుతారని.. రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేస్తారన్న అన్ని ప్రసార సాధనాల్లో వార్తలు రావడంతో శనివారం సాయంత్రం నుంచే రాయచోటిలో ప్రజా సంఘాలు, ప్రజలు రోడ్డెక్కారు. జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు స్పందించారు. జిల్లా సాధన సమితి గౌరవాఽధ్యక్షుడు డాక్టర్ బయారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాను ముక్కలు చేస్తామంటే సహించబోమని, పూర్తిగా రద్దు చేస్తామంటే ఒప్పుకోమని, సోమవారం నుంచి ఆందోళన కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం పునరాలోచించుకునే వరకు తమ పోరాటం ఆగదన్నారు. అవసరమైతే ఆమరణ దీక్షకు పూనుకుంటామని ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నమయ్య జిల్లాకు చెందిన రవాణా మంత్రి, రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సాయంత్రం ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. అన్నమయ్య జిల్లాను కొనసాగించాలని ఆయన్ను కోరినట్లు తెలిసింది. అలాగే రాయచోటినే జిల్లా కేంద్రంగా కొనసాగించాలని విజ్ఞప్తిచేశారు.