High Court: రవికుమార్ అప్పీల్‌కు సుమోటో వ్యాజ్యం జతచేయండి
ABN , Publish Date - Nov 14 , 2025 | 06:04 AM
తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ, లోక్‌అదాలత్‌లో కేసు రాజీ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించడంతో పాటు తన ఆస్తులపై ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను...
ఒకే అంశంపై రెండు వేర్వేరు ధర్మాసనాలు విచారణ జరపాల్సిన అవసరం లేదు
పరకామణిలో చోరీ, లోక్ అదాలత్‌లో రాజీపై రిజిస్ట్రీకి హైకోర్టు ధర్మాసనం ఆదేశం
అమరావతి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ, లోక్‌అదాలత్‌లో కేసు రాజీ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించడంతో పాటు తన ఆస్తులపై ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు సీవీ రవికుమార్ దాఖలుచేసిన అప్పీల్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఇదే వ్యవహారానికి సంబంధించి లోక్ అదాలత్ అవార్డు చట్టబద్ధతను తేల్చేందుకు నమోదైన సుమోటో వ్యాజ్యాన్ని మరో ధర్మాసనం విచారణ జరుపుతోందని ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఒకే అంశంపై రెండు వేర్వేరు ధర్మాసనాలు విచారణ జరపాల్సిన అవసరం లేదని, లోక్ అదాలత్ అవార్డు చట్టబద్ధతను తేల్చేందుకు నమోదైన సుమోటో వ్యాజ్యాన్ని ప్రస్తుత అప్పీల్‌కు జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో చోరీకి సంబంధించిన కేసును టీటీడీ బోర్డు తీర్మానం, ఈవో అనుమతి లేకుండానే 2023 సెప్టెంబరు 9న లోక్ అదాలత్ వద్ద ఏవీఎస్‌వో వై.సతీశ్‌కుమార్, నిందితుడు రవికుమార్‌తో రాజీ చేసుకున్న వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీఐడీని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇటీవల ఆదేశాలిచ్చారు.
రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల స్థిర-చర ఆస్తులతో పాటు బ్యాంకు ఖాతాలను పరిశీలించాలని, వారి ఆదాయానికి తగ్గట్లే ఈ ఆస్తులు ఆర్జించారా..? అనే కోణంలో లోతైన దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు రవికుమార్ తాజాగా ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. తాను టీటీడీ ఉద్యోగిని కానని, పెద్ద జీయర్‌మఠంలో క్లర్క్‌గా పనిచేస్తున్నాని అందులో పేర్కొన్నారు. ప్రైవేటు మఠంలో పనిచేస్తున్న తాను పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం పరిధిలోకి రానన్నారు. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.