Minister Nadendla Manohar: ఇకపై నెలంతా రేషన్
ABN , Publish Date - Sep 01 , 2025 | 05:50 AM
రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్! చౌకధరల దుకాణాల పనివేళలపై పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఉచిత బియ్యం
15 రోజుల కాలపరిమితిని ఎత్తేస్తున్నాం..
అన్ని రోజులూ దుకాణాలు తెరిచి ఉంచేలా నిర్ణయం
వచ్చే నెల నుంచి సబ్సిడీపై గోధుమ పిండి: మంత్రి నాదెండ్ల మనోహర్
తెనాలి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్! చౌకధరల దుకాణాల పనివేళలపై పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఉచిత బియ్యం, ఇతర సరుకులను లబ్ధిదారులు ఇకపై ఎప్పుడైనా తీసుకోవచ్చని, ఇందుకోసం రేషన్ షాపులు నెలంతా తెరిచి ఉంచేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 15 రోజులలోపే తీసుకోవాలనే కాలపరిమితిని తీసేస్తున్నట్లు చెప్పారు. రేషన్ దుకాణాలు 365 రోజులూ తెరిచే ఉంటాయని, ప్రజలు తీరిక ఉన్న సమయంలోనో లేదా అవసరమైనప్పుడే సరుకులు తెచ్చుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలో స్మార్ట్ రేషన్ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆదివారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి మంత్రి మనోహర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు నెలలో 15 రోజులలోపు మాత్రమే రేషన్ తీసుకునే అవకాశం ఉండేదని, ఆ సమయంలో తీసుకోనివారు తర్వాత తీసుకునే అవకాశం లేక.. ఆ నెల సరుకులు కోల్పోయే పరిస్థితి తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇక నుంచి నెలలో ఎప్పుడైనా రేషన్ తీసుకునేలా మార్పులు చేసినట్లు చెప్పారు. కందిపప్పు, వంట నూనె సబ్సిడీపై అవసరమున్న ప్రాంతాల్లో ప్రస్తుతం అందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారుల అభ్యర్థన మేరకు వచ్చే నెల నుంచి రాగులతో పాటు గోధుమ పిండిని కూడా సబ్సిడీపై ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. సెప్టెంబరు 15 లోగా రాష్ట్రంలోని 1.46 కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను ఇంటింటికీ వెళ్లి అందించే కార్యక్రమాన్ని పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రేషన్ కోసం వెళ్లినప్పుడు నిరీక్షించాల్సిన పనిలేకుండా కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తక్కువ సమయంలో తేలికగా రేషన్ తీసుకునే వెసులుబాటు లభిస్తుందన్నారు.
మార్కెట్ ధర కంటే తక్కువకు..
రాష్ట్రంలోని 29వేల రేషన్ దుకాణాలను నెలంతా తెరచి ఉంచటం వల్ల డీలర్లకు కూడా ఆదాయం పెంచే ఆలోచన చేస్తున్నట్లు మనోహర్ చెప్పారు. నెస్లే, కోకోకోలా వంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. నేరుగా కంపెనీల నుంచి సరుకులు కొనుగోలు చేసి, మార్కెట్ ధర కంటే తక్కువకు వినియోగదారులకు అందేలా చూడాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల నుంచి ఆయా సంస్థలు, సహకార సంఘాల ద్వారా ఆర్గానిక్ సరుకులను కూడా రేషన్ దుకాణాల్లో అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రేషన్ విషయంలో సమస్యలు, సందేహాలున్నా 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్‌చేసి సహాయం పొందవచ్చని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ ఎండీయూ వాహనాలను రద్దు చేశాక చాలా వరకు రేషన్ మాఫియా కోరలు తెగిపోయాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకతతో లబ్ధిదారులకు సరుకులు అందేలా చూస్తోందన్నారు. విపక్ష నేతల విష ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పి కొట్టాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.