Share News

Minister Nadendla Manohar: రేషన్‌ అక్రమ రవాణాకు చెక్‌

ABN , Publish Date - Oct 14 , 2025 | 06:31 AM

రాష్ట్రంలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. సోమవారం ఉదయం సర్య్కూట్‌ హౌస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Minister Nadendla Manohar: రేషన్‌ అక్రమ రవాణాకు చెక్‌

  • అక్కడికక్కడే నిర్ధారణ కోసం 700 ర్యాపిడ్‌ మొబైల్‌ కిట్లు

  • కాకినాడ ‘దోషులను’ వదిలేది లేదు

  • పోర్టుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు: మనోహర్‌

విశాఖపట్నం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. సోమవారం ఉదయం సర్య్కూట్‌ హౌస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పట్టుకున్న బియ్యాన్ని అక్కడికక్కడే పరీక్షించేందుకు జిల్లాలకు 700 ర్యాపిడ్‌ మొబైల్‌ కిట్లు సరఫరా చేశాం. ప్రభుత్వం సరఫరా చేసే ఫోర్టిఫైడ్‌ బియ్యమైతే కిట్‌లోని రసాయన ద్రావకాలను చల్లితే ఎరుపు రంగులోకి మారిపోతాయి. బయట మార్కెట్‌లో విక్రయించే బియ్యం అయితే రంగు మారకుండా ఉంటాయి. గతంలో అయితే బియ్యాన్ని పట్టుకున్న తరువాత పరీక్షలకు ల్యాబ్‌కు పంపి, ఆ రిపోర్టు వచ్చేంత వరకూ ఆగాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా రెండు రసాయన ద్రావకాలతో కిట్లు రూపొందించాం. దీనివల్ల అక్రమ రవాణా చేసే బియ్యాన్ని అక్కడక్కడే నిర్ధారించి సీజ్‌ చేసే అవకాశం వచ్చింది. గతేడాది కాకినాడ పోర్టులో బియ్యం పట్టుకుని కేసులు నమోదు చేశాం. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా నియమించిన సిట్‌ బృందానికి ఇతరత్రా పనులు అప్పగించడం వల్ల దర్యాప్తులో స్వల్ప జాప్యం జరిగింది. ఈ వ్యవహారంలో దోషులను వదిలేది లేదు. కాకినాడ పోర్టులో మూడు చెక్‌ పోస్టులు ఏర్పాటుచేసి బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెంచాం. అదే మాదిరిగా విశాఖపట్నం పోర్టు పరిధిలో ఏర్పాటు చేసిన మూడు చెక్‌ పోస్టులు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో రూ.245 కోట్ల విలువైన 5.65 లక్షల క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌ చేశాం. బహిరంగ మార్కెట్లలో కొనుగోలు చేసిన బియ్యంలో కెర్నల్స్‌ కలిపి విదేశాలకు ఎగుమతి చేస్తామంటే అనుమతించేది లేదు. క్యూఆర్‌ కోడ్‌ కలిగిన స్మార్ట్‌ రైస్‌ కార్డుల పంపిణీ 89 శాతం పూర్తయింది’ అని మంత్రి తెలిపారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ సౌరబ్‌గౌర్‌ మాట్లాడుతూ, ర్యాపిడ్‌ మొబైల్‌ కిట్‌ ద్వారా రేషన్‌ బియ్యాన్ని సులువుగా గుర్తించవచ్చునన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 06:32 AM