Share News

తలుపు తట్టిన ‘రేషన్‌’

ABN , Publish Date - Jun 09 , 2025 | 01:12 AM

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కార్డుదారుల ఇంటికే రేషన్‌ తీసుకువెళ్లే బహుత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 1,23,358 మందిని ఎంపిక చేసింది. ఇప్పటికే జూన్‌ నెల కోటాను 90 వేల మందికి డోర్‌ డెలివరీ చేసింది. ఇంటికే రేషన్‌ అంటే ఇదేనంటూ పలువురు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరును ప్రశంసిస్తున్నారు.

తలుపు తట్టిన ‘రేషన్‌’

- ఉమ్మడి కృష్ణాలో ఇంటికే నిత్యావసరాలకు 1,23,358 మంది కార్డుదారుల ఎంపిక

- లేవలేని, కదలలేని, నడవలేని స్థితిలో ఉన్నవారికి ప్రాధాన్యత

- ఇప్పటికే 90 వేల మందికి డోర్‌ డెలివరీ విధానంలో నిత్యావసరాల పంపిణీ

- నిజమైన డోర్‌ డెలివరీ ఇదేనంటున్న లబ్ధిదారులు

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కార్డుదారుల ఇంటికే రేషన్‌ తీసుకువెళ్లే బహుత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 1,23,358 మందిని ఎంపిక చేసింది. ఇప్పటికే జూన్‌ నెల కోటాను 90 వేల మందికి డోర్‌ డెలివరీ చేసింది. ఇంటికే రేషన్‌ అంటే ఇదేనంటూ పలువురు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరును ప్రశంసిస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

నడవలేని, లేవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటికే రేషన్‌ బియ్యం అందించే మహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 1,23,358 మంది ‘ఇంటి వద్దకే రేషన్‌’కు ఎంపికయ్యారు. వీరిలో ఎన్టీఆర్‌ జిల్లాలో 57,469 మంది, కృష్ణా జిల్లాలో 65,889 మంది ఉన్నారు. జూన్‌ నెల కోటాను రేషన్‌ డిపో డీలర్లు వీరి ఇంటికే బియ్యం, పంచదార, కందిపప్పు తదితర నిత్యావసరాలను తీసుకువెళ్లి మరీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు కూడా భాగస్వాములవుతున్నారు. మంచం మీద ఉన్న వ్యక్తి బయోమెట్రిక్‌ తీసుకుని సచివాలయ సిబ్బంది సమక్షంలో ఈ పోస్‌లో నిత్యావసరాల వివరాలు నమోదు చేసి, నిత్యావసరాలను తూకం వేసి ఇస్తున్నారు.

నాడు రోడ్డు చివరనే ఎండీయూ వాహనాలు

గత వైసీపీ ప్రభుత్వం డోర్‌ డెలివరీ అని చెప్పినా ఎండీయూ వాహనాలు ఎప్పుడూ కార్డుదారుల ఇళ్ల వద్దకు వెళ్లలేదు. ఒక రోడ్డులో ఒక చోట ఆపితే ఇళ్ల నుంచి బయటకు వచ్చిన లబ్ధిదారులు ఎండీయూ వాహనం వద్ద పడిగాపులు పడి నిత్యావసరాలను తీసుకునే వారు. దీనికి చెక్‌ పెడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం రేషన్‌ డీలర్‌, సచివాలయ సిబ్బంది నిత్యావసరాలతో లేవలేని, నడవలేని, దీర్ఘకాలిక వ్యాఽధులతో బాధపడుతున్నవారి ఇంటికే నేరుగా వెళ్లి అందజేస్తున్నారు.

ఇప్పటికే 90 వేల మందికి అందజేత

ఉమ్మడి కృష్ణాజిల్లాలో దాదాపు 90 వేల మందికి నిత్యావసరాల పంపిణీ చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా, ఏ.కొండూరు మండలంలో 1,950 కార్డుదారులు, చందర్లపాడులో 3,018 మంది, గంపలగూడెంలో 3,060 మంది, జీ.కొండూరులో 2,278 మంది, ఇబ్రహీంపట్నంలో 2,171 మంది, జగ్గయ్యపేటలో 3,175 మంది, కంచికచర్లలో 2,689 మంది, మైలవరంలో 2,651 మంది, నందిగామలో 3,218, పెనుగంచిప్రోలులో 2,259 మంది, రెడ్డిగూడెంలో 2,213 మంది, తిరువూరులో 2,679, వత్సవాయిలో 2,808, వీరులపాడులో 2,371, విజయవాడ ఏఎస్‌వో కార్యాలయం- 1 పరిధిలో 7,528 మంది, విజయవాడ అర్బన్‌ - 2 కార్యాలయం పరిధిలో 6,855 మంది, విజయవాడ అర్బన్‌ - 3 పరిధిలో 4,207 మంది, విస్సన్నపేట మండలంలో 2,399 మంది కార్డుదారులు లేవలేని, నడవలేని, కదలలేని స్థితిలో, దీర్ఘకాలిక వ్యాధులతో మంచం మీద ఉన్న ఉన్నారు. మొత్తంగా 57,469 మందిలో ఆదివారం నాటికి 42,114 మందికి రేషన్‌ డీలర్లు వారి ఇంటికే వెళ్లి నిత్యావసరాలను పంపిణీ చేశారు. కృష్ణాజిల్లా మొత్తం 65,889 మందిని డోర్‌ డెలివరీకి గుర్తించగా.. ఆదివారం నాటికి 48,751 మందికి డోర్‌ డెలివరీ పూర్తి చేశారు.

Updated Date - Jun 09 , 2025 | 01:12 AM