రేషన్ మాయ!
ABN , Publish Date - Dec 01 , 2025 | 01:09 AM
ఉమ్మడి కృష్ణాజిల్లాలో రేషన్ దందా భారీ స్థాయిలో నడుస్తోంది. మండల స్థాయి స్టాక్ పాయింట్లకు సొంత గోడౌన్లు లేకపోవంతో నాన్ సైంటిఫిక్ గోడౌన్లనే వినియోగిస్తున్నారు. ఇక్కడకు వచ్చే బియ్యం తూకంలో భారీగా తేడాలు ఉంటున్నాయి. తూకం, నాణ్యతా ప్రమాణాలు నిర్ధారణ పరీక్షలను గాలికి వదిలేశారు. ఆయా పాయింట్లలో వేబ్రిడ్జిల జాడ లేకపోవడంతో మిల్లుల నుంచి వచ్చే సరుకు, కాగితాలపై ఉన్న సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఉన్నా సర్దుకోవాల్సిన పరిస్థితి. ఎవరి స్థాయిలో వారు అక్రమాలకు పాల్పడుతూ పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
-మండల స్థాయి స్టాక్ పాయింట్లకు గోడౌన్‌లు కరువు
-బఫర్ గోడౌన్లకు వచ్చే బియ్యం తూకంలో భారీగా తేడాలు
-తూకం, నాణ్యతా ప్రమాణాల నిర్ధారణ పరీక్షలు గాలికి..
-ఎంఎల్‌ఎస్ పాయింట్లలో జాడలేని వేబ్రిడ్జిలు
- వచ్చే సరుకు, కాగితాలపై ఉన్న సంఖ్యకు మధ్య వ్యత్యాసం
- భారీస్థాయిలో పక్కదారి పడుతున్న పేదల బియ్యం
ఉమ్మడి కృష్ణాజిల్లాలో రేషన్ దందా భారీ స్థాయిలో నడుస్తోంది. మండల స్థాయి స్టాక్ పాయింట్లకు సొంత గోడౌన్లు లేకపోవంతో నాన్ సైంటిఫిక్ గోడౌన్లనే వినియోగిస్తున్నారు. ఇక్కడకు వచ్చే బియ్యం తూకంలో భారీగా తేడాలు ఉంటున్నాయి. తూకం, నాణ్యతా ప్రమాణాలు నిర్ధారణ పరీక్షలను గాలికి వదిలేశారు. ఆయా పాయింట్లలో వేబ్రిడ్జిల జాడ లేకపోవడంతో మిల్లుల నుంచి వచ్చే సరుకు, కాగితాలపై ఉన్న సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఉన్నా సర్దుకోవాల్సిన పరిస్థితి. ఎవరి స్థాయిలో వారు అక్రమాలకు పాల్పడుతూ పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఉమ్మడి కృష్ణాజిల్లాలో మండల స్థాయి స్టాక్ (ఎంఎల్‌ఎస్) పాయింట్ల ద్వారా ప్రజలకు అందించాల్సిన బియ్యం పక్కదారి పడుతోంది. చాలా చోట్ల ఎంఎల్‌ఎస్ పాయింట్ల్‌కు సొంత గోడౌన్లు లేవు. నాన్ సైంటిఫిక్ గోడౌన్లలో ఎంఎల్‌ఎస్ పాయింట్లు నడుస్తున్నాయి. బందరులో పేర్ని నాని సతీమణికి చెందిన గోడౌన్‌లో ఇలాగే బియ్యం బస్తాలు మాయం అయ్యాయి. అవి ఎక్కడికి పోయాయన్నది ఇప్పటి వరకు తెలియదు. ఇలాంటివి ఒక ఎత్తు అయితే బఫర్ గోడౌన్లకు వచ్చే బియ్యానికి సరైన తూకం ఉండటం లేదని తెలిసింది. మిల్లర్లతో కుమ్మకైన ఫలితంగా బఫర్ గోడౌన్లకు మిల్లర్లు ఎంత పరిమాణంలో బియ్యం ఇస్తే అంతే దిగుమతి చేసుకుంటున్నారు. రైస్ మిల్లుల నుంచి బఫర్ గోడౌన్లకు వచ్చే బియ్యం బస్తాలు ఒక్కొక్కటి 51 కేజీలను కలిగి ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే కొత్త గోనె సంచి పరిమాణం 580 గ్రాములు ఉంటుంది. ఇది కాకుండా పోషకాలతో కూడిన కెర్నెల్స్‌ను ప్రభుత్వం రైస్ మిల్లర్లకు అందిస్తుంది. ఒక్కో బస్తాకు ఒక కేజీ చొప్పున ప్రభుత్వం ఇచ్చిన కెర్నెల్స్‌ను కలపాల్సి ఉంటుంది. కాబట్టి రైస్ మిల్లరు ఖచ్చితంగా 51 కేజీల పరిమాణంతో ఉన్న బస్తాను ఇవ్వాల్సిందే. బఫర్ గోడౌన్లకు వచ్చిన బియ్యం బస్తాలను ఖచ్చితంగా వేబ్రిడ్జి మీద పెట్టి తూకం తూయాలి. బఫర్ గోడౌన్లలో వేబ్రిడ్జితో తూకం వేయటంతో తేడాలు కనిపిస్తున్నాయి. కానీ, మిల్లర్లతో ఉన్న రహస్య లావాదేవీల కారణంగా తూకాన్ని పక్కన పెట్టి కాగితాల మీద నిర్ణీత పరిమాణంలో సరుకు ఉందని ఎంఎల్‌ఎస్ పాయింట్లకు పంపుతున్నారు.
ఎంఎల్‌ఎస్ పాయింట్లలో కనిపించని వేబ్రిడ్జిలు!
వాస్తవానికి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు వచ్చే బియ్యం ఆ స్థాయిలో ఉండటం లేదన్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. బఫర్ గోడౌన్ల నుంచి ప్రతి నెలా వందలాది టన్నుల బియ్యం ఎంఎల్‌ఎస్ పాయింట్లకు వస్తుంది. ఎంఎల్‌ఎస్ పాయింట్లలో చాలా వరకు వేబ్రిడ్జిలు ఉండటం లేదని సమాచారం. బఫర్ గోడౌన్ల నుంచి కాగితాల మీద ఇంత పరిమాణం ఉందని వస్తున్న బియ్యం బస్తాలను ఎంఎల్‌ఎస్ పాయింట్లలో తూకం వేయటం ద్వారా ఎంత ఉందో నిర్ధారించవచ్చు. కానీ, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో అలాంటిదేమీ జరగటం లేదని తెలిసింది. ఎంఎల్‌ఎస్ పాయింట్లలో వే బ్రిడ్జిలు అనేవి మచ్చుకు కూడా కనిపించడంలేదని సమాచారం. బఫర్ గోడౌన్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో వేబ్రిడ్జిల తూకం ద్వారా వాటి పరిమాణాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తే అసలు ఎలాంటి సమస్యా రాదు. బఫర్ గోడౌన్లకు, ఎంఎల్‌ఎస్ పాయింట్లకు కేంద్రం హ్యాండ్లింగ్ లాస్, ట్రాన్సిస్ట్ లాస్‌లను మాత్రమే నిర్ణయిస్తుంది. హ్యాండ్లింగ్ లాస్ అంటే.. హమాలీలు ఇనుమ హుక్కులతో బస్తాలను దించేటపుడు బియ్యం పోతుంది కాబట్టి దానిని హ్యాండ్లింగ్ లాస్ పరిధిలోకి తీసుకువస్తారు. ట్రాన్సిస్ట్ లాస్ అంటే .. ఇలా వచ్చిన బస్తాలను స్టేజ్ -1, స్టేజ్ -2 రవాణా సందర్భాలలో బియ్యం కారే అవకాశం ఉంటుంది. అందుకే దీనిని ట్రాన్సిస్ట్ లాస్ అంటారు. కాబట్టి ఈ రెండింటిని మాత్రమే నిర్దేశించటం జరిగింది. ఈ రెండూ కలిపితే మహా అయితే ఓ 100, 150 గ్రాములు ఉంటుంది. ఇది కూడా కాదని బస్తాలలో బియ్యం తగ్గిపోతోంది. ఎంఎల్‌ఎస్ పాయింట్లకు వచ్చే బియ్యం బస్తా 51 కేజీలు ఉండాల్సి ఉండగా.. 48, 49 కేజీలు మాత్రమే ఉంటోందని సమాచారం. దీంతో ఎంఎల్‌ఎస్ పాయింట్ల నిర్వాహకులు కూడా తూకం వేయకుండా కాగితాల మీద లెక్కలతో డీలర్లకు అందిస్తున్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్లలో అవినీతి సిబ్బంది కొందరు తమ లాభం కూడా చూసుకుంటున్నారని తెలిసింది. అలాగే ఇంకాస్త ఇక్కడ పక్కదారి పట్టించి, లేని సరుకును ఉన్నట్టుగా చూపిస్తూ డీలర్ల నెత్తిన తరుగును మోపుతున్నారని సమాచారం. ఎంఎల్‌ఎస్ పాయింట్ల ఇన్‌చార్జిలుగా రెవెన్యూ నుంచి చాలా మంది రావటం, వారికి అవగాహన లేకపోవటం వల్ల ఎలా వచ్చిన బియ్యాన్ని అలా తీసుకుని, అదే విధంగా ఇచ్చేస్తున్నారని తెలిసింది. కొన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్లు మరీ దారుణంగా తయారయ్యాయని విమర్శలు ఉన్నాయి. వెయ్యి టన్నుల బియ్యం వస్తే 500 టన్నుల బియ్యం కూడా ఉండని పరిస్థితి నెలకొందని సమాచారం.
ప్రక్షాళన అవసరం!
బఫర్ గోడౌన్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో పారదర్శక విధానాలు తీసుకురావటానికి వీలుగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంఎల్‌ఎస్ పాయింట్లలో టెక్నికల్ స్టాఫ్ అంతా కూడా కాంట్రాక్టు ప్రాతిపదికన వచ్చిన వారే ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా సిబ్బంది ఉండరు. కాటా వేయటంతో పాటు, క్వాలిటీ చెక్ కూడా వీరే చేయాలి. ఇవన్నీ ఎక్కడా పెద్దగా జరుగుతున్న దాఖలాలు లేవని సమాచారం. కాంట్రాక్టు సిబ్బంది బియ్యం బస్తాలన్నింటినీ ఓకే చేయించి లాట్ వేయిస్తారు. ఎలా ఓకే చేస్తున్నారు? లాట్ చేయించే విధానాల మీద తనిఖీలు లేవని తెలిసింది. మిల్లు నుంచి బఫర్ గోడౌన్‌కు వస్తున్న బియ్యం అసలైనవేనా ? బయటి నుంచి వస్తున్నాయా ? అన్న అంశాలు పరిశీలించటం లేదని సమాచారం. క్రమం తప్పకుండా తనిఖీలు ఉంటే గతంలో కైక లూరు ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి వేలాది బియ్యం బస్తాలు, బందరులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి గోడౌన్‌లో భారీ స్థాయిలో బియ్యం బస్తాలు పక్కదారి పట్టేందుకు అవకాశం ఉండేది కాదని విమర్శలు ఉన్నాయి.
గోనె సంచుల వ్యవహారలో మాయ
ప్రతి ఏడాది మిల్లర్లకు ప్రభుత్వం కొత్త గోనె సంచులను ఇస్తుంది. తిరిగి వచ్చేటపుడు మాత్రం ఆ గోనె సంచులు రావడంలేదని తెలిసింది. కుట్లు వేసినవి, మాసికలు ఉన్నవి వస్తున్నాయని సమాచారం. ఏడాదిలోనే గోనె సంచులు ఈ విధంగా దెబ్బతింటాయా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సంచుల బలం తగ్గిపోయి బలహీనంగా మారుతున్నాయి. ఊరికే రంధ్రాలు పడుతున్నాయి. ఈ గోనె సంచుల వ్యవహారాల మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే బఫర్ గోడౌన్లలోకి వచ్చే బియ్యానికి పురుగులు పట్టకుండా గోడౌన్ లోపల పురుగుల మందు పిచికారీ చేస్తారు. కానీ బియ్యంలో పురుగులు వస్తున్నాయన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయన్న అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.