చౌక దుకాణాల నుంచి రేషన
ABN , Publish Date - May 21 , 2025 | 11:23 PM
తెల్లరేషన కార్డుదారులకు రేషన పంపిణీ విధానాన్ని పాతపద్ధతిలోనే కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఎండీయూ వాహనాల వ్యవస్థ రద్దు
జూన 1 నుంచి అమలు
నంద్యాల నూనెపల్లె, మే 21 (ఆంధ్రజ్యోతి) : తెల్లరేషన కార్డుదారులకు రేషన పంపిణీ విధానాన్ని పాతపద్ధతిలోనే కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మంగళ వారం జరిగిన ఏపీ కేబినెట్ మీట్‌లో నిర్ణయం తీసుకున్నారు. జూన 1నుంచి చౌక దుకాణాల వద్దే రేషన పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే సరుకులు పక్కదారి పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ అయిదేళ్ల హయాంలో చౌకదుకాణాల వ్యవస్థను పక్కనబెట్టి ఇంటింటికీ రేషన పేరుతో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (ఎండీయూ)ను రంగంలోకి దింపింది. రేషన డీలర్ల పొట్టకొట్టి తమ పార్టీ కార్యకర్తలకు ఎండీయూ వాహనాలను కట్టబెట్టింది. ఇంటింటికీ రేషన పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. దీంతో కూటమి ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తిపలుకుతూ పాతపద్ధతినే కొనసాగించనుంది.
జూన 1నుంచి అమలు ః
జిల్లాలో 5,34,234 లక్షల తెల్లరేషన కార్డుదారులు ఉన్నారు. 1204 చౌకదుకాణాల నుంచి ఎండీయూ వాహనాల ఆపరేటర్లు రేషనను తీసుకొని వాహనాల ద్వారా పంపిణీ చేసేవారు. ఎండీయూ వ్యవస్థను రద్దుచేసి ఆహార భద్రతా చట్టం మార్గదర్శకాలను చౌక దుకాణాల వద్దే సరుకులు ఇచ్చేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జూన 1నుంచి రేషన దుకాణాలకు వెళ్లి బియ్యం, తదితర పదార్థాలను లబ్ధిదారులు తీసుకోనున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు డోర్ డెలివరీ చేయనున్నారు.
రూ.24.57 కోట్లు వృథా ః
జిల్లాలో 351ఎండీయూ వాహనాలు ఉన్నాయి. ఒక్కొక్క వాహనాన్ని రూ.7లక్షల చొప్పున కొనుగోలు చేశారు. అందులో కొంత ఆపరేటర్ వాటా కాగా మిగిలింది బ్యాంకు ద్వారా రుణం ఇప్పించారు. ప్రతినెలా ఒక్కో ఆపరేటర్‌కు రూ.20వేల చొప్పున వేతనం చెల్లించారు. వాహనాలకు రూ.24.57 కోట్లు వెచ్చించారు. ఇంటింటికీ రేషన అనే పేరేగాని వీధుల్లో, వీధి చివరలో ఎక్కడబడితే అక్కడ ఎండీయూ వాహనాలు నిలిపి లబ్ధిదారులకు సరుకులు అందించారు. ప్రతి ఇంటికీ వాహనాలు వెళ్లిన దాఖలాలు ఎక్కడా లేవు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా చౌక దుకాణాల ద్వారా కార్డుదారులకు 95శాతం రేషన సరుకులు పంపిణీ చేయగా, ఎండీయూ వ్యవస్థ వచ్చాక అది 80శాతానికి పడిపోయింది. జిల్లాలో ప్రతినెలా సుమారు 30వేల నుంచి 50వేల వరకు కార్డుదారులకు సరుకులు అందడం లేదు. వైసీపీ కార్యకర్తలైన ఎండీయూ ఆపరేటర్లు ఇష్టారీతిన వ్యవహరించడంతోపాటు ప్రతినెలా 1నుంచి 17వ తేదీవరకే సరుకులు ఇచ్చేవారు. దీంతో చాలామందికి సరుకులు అందకుండా పోయాయి.