Share News

ఇంటివద్దకే రేషన

ABN , Publish Date - Jun 25 , 2025 | 11:48 PM

రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది.

   ఇంటివద్దకే రేషన
సివిల్‌ సప్లై గోదాములో రేషన నిల్వలు (ఫైల్‌)

వృద్ధులు, దివ్యాంగులకు తీపి కబురు

నేటి నుంచి 30వ తేదీ వరకు పంపిణీ

పౌరసరఫరాల శాఖ నిర్ణయం

నంద్యాల నూనెపల్లె, జూన 25 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. జూలై నెలకు సంబంధించి బియ్యం, నిత్యావసర సరుకులను ఈనెల 26వ తేదీ నుంచి ఐదు రోజులపాటు డీలర్లు ఇంటివద్దకే వచ్చి అందించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. జూన 1వ తేదీ నుంచి ఎండీయూ వాహనాలను రద్దుచేశారు. కార్డుదారులకు చౌకధరల దుకాణాల వద్దనే సరుకులు అందజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఇంటివద్దకే సరుకులు సరఫరా చేశారు. ప్రతినెలా 1వ తేదీనుంచి 15వ తేదీవరకు దుకాణాల వద్ద కార్డుదారులకు సరుకులు ఇస్తున్నారు. పైగా దుకాణాలకు వచ్చినవారు అక్కడే నిరీక్షిస్తున్న కారణంగా అదే సమయంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దకు వెళ్లి సరుకులు ఇవ్వడం సమస్యగా మారింది. దీంతో జూలైకి సంబంధించి ఐదు రోజులు ముందుగానే (ప్రతి నెలా 26వ తేదీనుంచి) ఇంటివద్దకే సరుకులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు డీలర్లకు సమాచారం అందించారు.

దుకాణాలకు చేరిన సరుకులు..

నూతన రేషన విధానాన్ని పక్కాగా అమలు చేసే విషయంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందుల్లేకుండా ఇప్పటికే పౌర సరఫరాల గోడౌన్లనుంచి జిల్లావ్యాప్తంగా ఉన్న 1204రేషన దుకాణాలకు చేర్చారు. జిల్లాలో 5,34,234 రేషన కార్డుదారులున్నారు. వీరిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించి 53,222 కార్డుదారులు ఉన్నారు. జూన నెలలో 80శాతం వరకు రేషనను ఇంటివద్దకే వెళ్లి పంపిణీ చేశారు. ఈ నెలలో 90శాతానికిపైగా కుటుంబాలకు సరుకులు ఇంటివద్దనే అందించేలా ప్రణాళిక రూపొందించారు. గత నెల మాదిరిగానే ఈ నెలలో బియ్యం, చక్కెర మాత్రమే ఇవ్వనున్నారు. కందిపప్పు పంపిణీ లేనట్లే. మిగతా కార్డుదారులకు మాత్రం ప్రతినెలా 1వ తేదీనుంచి 15వ తేదీ వరకు సరుకులు పంపిణీ చేయనున్నారు.

Updated Date - Jun 25 , 2025 | 11:48 PM