Share News

Paritala Sunitha: జగన్‌ హెలికాప్టర్‌ దిగకుండా అడ్డుకునే దమ్ము మాకుంది

ABN , Publish Date - Apr 08 , 2025 | 04:53 AM

పాపిరెడ్డిపల్లిలో జగన్ పర్యటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, జగన్‌ను అడ్డుకునే శక్తి మాకుందని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారని, బీసీల పట్ల ప్రేమ ఉందంటే రాప్తాడుకు బీసీ ఇన్‌చార్జిని నియమించాలన్నారు.

Paritala Sunitha: జగన్‌ హెలికాప్టర్‌ దిగకుండా అడ్డుకునే దమ్ము మాకుంది

చంద్రబాబు మాకు అలాంటి సంస్కృతి నేర్పలేదు: సునీత

అనంతపురం, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ‘మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్‌రెడ్డిని పాపిరెడ్డిపల్లికి రానివ్వకుండా అడ్డుకునే దమ్ము, ధైర్యం... రెండూ మాకున్నాయి’ అని అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రామగిరిలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం సమావేశం నిర్వహించారు. అనంతరం సునీత మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్‌ మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటనకు రావడంపై స్పందించారు. ‘మాలో ఉన్నది చంద్రబాబు, టీడీపీ రక్తం. రాప్తాడు నియోజకవర్గంలో జగన్‌ పర్యటనపై మా పార్టీ నాయకులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పరిటాల రవి పులివెందులకు వెళ్లినప్పుడు జగన్‌ కుటుంబం అడ్డుకుంది. అందుకే జగన్‌రెడ్డిని అడ్డుకోవాలనే అభిప్రాయం మా పార్టీ కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది. జగన్‌రెడ్డి ఎక్కిన హెలికాప్టర్‌ని దిగకుండా వెనక్కి పంపే శక్తి మాకు ఉంది. అయితే మా నాయకుడు చంద్రబాబు అలాంటి సంస్కృతిని మాకు నేర్పలేదు. ఒక చావును రాజకీయం చేసేందుకు జగన్‌రెడ్డి వస్తున్నారు. అనుకోకుండా జరిగిన సంఘటనను ఫ్యాక్షన్‌ హత్యగా చిత్రీకరించి, తోపుదుర్తి సోదరులు రాజకీయం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఒక మాజీ సీఎం ఇక్కడకు రావడం సరైంది కాదు. జగన్‌ వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఏదైనా సాయం చేసిపోవాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇక్కడ ప్రజల మధ్య చిచ్చుపెట్టవద్దు. బీసీల మీద జగన్‌కు అంత ప్రేమే ఉంటే రాప్తాడు ఇన్‌చార్జిగా ఒక బీసీని నియమించాలి. దమ్ము, ధైర్యం ఉంటే మంగళవారం పర్యటనలో ఈ ప్రకటన చేయాలి’ అని సునీత అన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 04:53 AM