CID Investigation: వేగంగా పరకామణి కేసు దర్యాప్తు
ABN , Publish Date - Nov 25 , 2025 | 05:37 AM
తిరుమల పరకామణి చోరీ కేసు విచారణ వేగంగా సాగుతోంది. సోమవారం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సీఐడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి పలువురిని విచారించారు.
తిరుపతిలో సీఐడీ అధికారుల విచారణ
నాటి విజిలెన్స్ అధికారి, ఏవీఎస్వో.. రవికుమార్ బంధువుల హాజరు
రవికుమార్ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తిరుమల పరకామణి చోరీ కేసు విచారణ వేగంగా సాగుతోంది. సోమవారం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సీఐడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి పలువురిని విచారించారు. పరకామణి చోరీ ఘటన జరిగినప్పుడు తిరుమల విజిలెన్స్ అధికారిగా ఉన్న గిరిధర్‌తో పాటు కీలక నిందితుడు రవికుమార్ బంధువులుగా భావిస్తున్న చెన్నైకి చెందిన ఇద్దరు వ్యక్తులు విచారణకు హాజరయ్యారు. అలాగే అప్పటి ఏవీఎస్వో పద్మనాభం, విజిలెన్స్, పోలీసు అధికారుల డ్రైవర్లుగా పనిచేసిన పన్నెండు మందిని కూడా సీఐడీ అధికారులు విచారించారు. పరకామణి కేసులో ఫిర్యాదుదారు, అప్పటి ఏవీఎస్వో సతీశ్ కుమార్ మరణించడంతో తిరుపతిలో విచారణ తాత్కాలికంగా ఆగిన సంగతి తెలిసిందే. సతీశ్‌కుమార్ మృతికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా అనంతపురం, గుంతకల్లు ప్రాంతాలకు వెళ్లిన సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ తిరిగి తిరుపతి చేరుకోవడంతో విచారణ మళ్లీ మొదలైంది. మరోవైపు టీటీడీ పరకామణి కేసులో కీలక నిందితుడుగా ఉన్న రవికుమార్ ఆదాయానికి మించిన ఆస్తులపై తిరుపతి ఏసీబీ అదనపు ఎస్పీ విమలకుమారి నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. గతంలో టీటీడీకి దానం చేసిన చెన్నైలోని కోట్లాది రూపాయల ప్లాట్లు, తిరుపతి, చంద్రగిరిలో ఉన్న అపార్టుమెంట్లు వంటి వాటితో పాటు ఇంకా ఆస్తులు ఎక్కడ ఉన్నాయి అనే కోణంలో ఏసీబీ అధికారులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.
పలు నగరాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో ప్లాట్లు, విల్లాలు, ఖరీదైన వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. రవికుమార్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల పేర్లమీద ఉన్న ఆస్తుల గురించి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలక రికార్డులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాలు పరిశీలించి పాసుపుస్తకాలు, చెక్ బుక్‌లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కాగా రవికుమార్ ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగుతున్న సీఐడీ అధికారులు కూడా తాజాగా బ్యాంకులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.