Share News

Life Threat: భరత్‌రామ్‌ నుంచి ప్రాణహాని ఉంది

ABN , Publish Date - Nov 14 , 2025 | 06:22 AM

వైసీపీ నాయకుడు, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ భరత్‌రామ్‌, అతని ప్రధాన అనుచరుడు పీతా రామకృష్ణ నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన అనుచరుడు రామశర్మ ఆరోపించారు.

Life Threat: భరత్‌రామ్‌ నుంచి ప్రాణహాని ఉంది

  • మాజీ ఎంపీ చీకటి దందాలకు నేనే సాక్ష్యం

  • నా కుటుంబానికి రక్షణ కల్పించండి: రామశర్మ

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుడు, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ భరత్‌రామ్‌, అతని ప్రధాన అనుచరుడు పీతా రామకృష్ణ నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన అనుచరుడు రామశర్మ ఆరోపించారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఆయన రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. భరత్‌రామ్‌ చీకటి దందాలకు తానే సాక్ష్యం కాబట్టి తనను చంపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఏం జరిగినా భరత్‌రామ్‌, పీతా రామకృష్ణ కారణమన్నారు. ‘భరత్‌ కోసం నేను చాలా చేశాను. టీడీపీ నాయకుడు యిన్నమూరి దీపును బెదిరించి వైసీపీలోకి వచ్చేలా చేశాం. టీఎన్‌టీయూసీ, ఏపీ పేపర్‌ మిల్లు యూనియన్‌ నాయకుడు చిట్టూరి ప్రవీణ్‌ చౌదరిని వైసీపీలోకి తీసుకెళ్లాం. రెడ్‌ గ్రావెల్‌ మైనింగ్‌, ఇసుక ర్యాంప్‌, బుర్రిలంక ఇసుక ర్యాంప్‌నకు సంబంధించి నెలవారీ మామూళ్లు సుమారు రూ.5 కోట్ల వరకు భరత్‌కు ఇచ్చాను. వైవీ.సుబ్బారెడ్డి, మిఽథున్‌ రెడ్డి వంటి వారు పర్యటనకు వస్తే ఖర్చులన్నీ భరత్‌ నా చేతే పెట్టించేవారు. ఆయన వల్లే అప్పులపాలై అజ్ఞాతంలోకి వెళ్లిపోయాను. పీతా రామకృష్ణకు డబ్బులు బాకీ ఉండడంతో.. నా తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్నారు. రామకృష్ణ ఫోన్‌ చేసి డబ్బులివ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. దీనిపై రాజమహేంద్రవరం ప్రకాశ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా రామకృష్ణ తీరు మారలేదు’ అని తెలిపారు.

Updated Date - Nov 14 , 2025 | 06:23 AM