Share News

Rural Education Crisis: చదువు వారికి సాహసమే

ABN , Publish Date - Aug 17 , 2025 | 04:19 AM

రామాంజనేయపురం. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల నుంచి తరలివచ్చిన గిరిజనులతో ఏర్పడిన గ్రామం. ఈ గ్రామం ఏర్పడి నలభై ఏళ్లు దాటింది. అయినా, ఈ ఊరికి బడి లేదు. గత ప్రభుత్వం బిల్డింగ్‌ కట్టి బడి విషయం మరిచిపోయింది.

Rural Education Crisis: చదువు వారికి సాహసమే

  • అడవిలో ఆరు కిలోమీటర్లు నడిచి బడికి..

  • సర్పాలు, జంతువుల భయం మధ్యే నడక

  • ఊళ్లో బడి లేకపోవడంతో రోజూ పొరుగూరుకు

  • వర్షాకాలంలో వెళ్లిరావడానికి అవస్థలు

  • బిల్డింగ్‌ కట్టి పాఠశాలను మరిచిన వైసీపీ

  • 40 ఏళ్లుగా బడి కోసం ఎదురుచూస్తున్న

  • పల్నాడు జిల్లా రామాంజనేయపురం

  • న్యాయం చేయాలని లోకేశ్‌కు విన్నపం

(గుంటూరు సిటీ, బెల్లంకొండ- ఆంధ్రజ్యోతి)

రామాంజనేయపురం. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల నుంచి తరలివచ్చిన గిరిజనులతో ఏర్పడిన గ్రామం. ఈ గ్రామం ఏర్పడి నలభై ఏళ్లు దాటింది. అయినా, ఈ ఊరికి బడి లేదు. గత ప్రభుత్వం బిల్డింగ్‌ కట్టి బడి విషయం మరిచిపోయింది. దీంతో బడిని వెతుక్కొంటూ రామాంజనేయపురం చిన్నారులు ఊరు దాటిపోతున్నారు. బడికి వెళ్లే దారి అడవి మార్గం కావడంతో రోజూ భయం భయంగా నడక సాగించాల్సిన పరిస్థితి! రోజుకు కనీసం ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్లి నడిచి వస్తున్నారు. ఇప్పటికైనా తమ గ్రామానికి పాఠశాలను కేటాయించాలంటూ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ను విద్యార్థులు కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒకప్పుడు రామాంజనేయపురం ఉమ్మడి గుంటూరు జిల్లా (ప్రస్తుతం పల్నాడు)లో కలిసి ఉన్న బెల్లంకొండ మండలంలోనే ఉంది. 300 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారిలో ఎక్కువ మంది గిరిజనులు. పోడు వ్యవసాయం చేసుకునే కుటుంబాలు. పోడు కోసం అడవిలో చెట్లు కొడుతున్నారంటూ చాలాకాలం వీరిపై అటవీ శాఖ అధికారుల వేధింపులు కొనసాగాయి. ఈ క్రమంలో గ్రామంలోకి నక్సల్‌ ఉద్యమం ప్రవేశించింది. నక్సల్‌ రాకతో అటవీ అధికారుల వేధింపులు తగ్గిపోయాయి. అయితే, గ్రామంపై పోలీసుల దాడులు పెరిగాయి. ఈ దాడులు, వేధింపులను తట్టుకోలేక చాలామంది యువకులు నక్సల్‌ ఉద్యమంలో చేరిపోయారు. నక్సల్‌ గ్రామంగా పేరు పడటంతో రామాంజనేయపురం అభివృద్ధికి నోచుకోలేదు. 2004లో ఉమ్మడి ప్రభుత్వానికి, నక్సల్‌కు మధ్య చర్చల సమయంలో.. గ్రామంలోని గిరిజనులకు అధికారులు పట్టాభూములు కేటాయించారు. సదుపాయాలు కూడా మెరుగుపడ్డాయి. ఈ సమయంలోనే పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రజలు అభ్యర్థించారు. కానీ, ఎందుకనో అప్పటినుంచి ఇప్పటిదాకా గ్రామంలో పాఠశాల ఏర్పాటు కాలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు స్కూల్‌ బిల్డింగ్‌ నిర్మించారు. కానీ పాఠశాలను మాత్రం ప్రారంభించలేదు.


కదిలించలేకపోయిన ‘బాలిక ఎన్‌కౌంటర్‌’

రామాంజనేయపురానికి చెందిన నర్సమ్మ అనే 11 ఏళ్ల బాలిక 2004 మార్చి 23న ఎన్‌కౌంటర్‌లో మరణించడం.. అప్పట్లో కలకలం రేపింది. పిల్లలకు బడి సౌకర్యం లేకపోవడంవల్ల చదువులకు దూరమై నక్సల్‌ ఉద్యమంలోకి పోతున్నారని పోలీసులు ఆనాడు పేర్కొన్నారు. ఈ ఘటన జరిగి కూడా 21 ఏళ్లు దాటిపోయింది. కానీ, పోలీసులు ముందుకు తెచ్చిన సమస్యకు మాత్రం పరిష్కారం చూపలేదు. మంత్రి లోకేశ్‌ స్పందిస్తేనే తమ కష్టాలు తీరతాయని కారుమంచి కోటమ్మ ఆవేదనతో చెప్పారు.


మాకు బడి కావాలి

‘‘రోజూ పక్క ఊరికి వెళ్లి రావాలంటే భయం వేస్తుంది. మా ఊరి లోనే బడి పెట్టి చదువు చెప్పాలి. ఒక్కోరోజు ఆటోలు అసలు రావు. అంత దూరం నడవాలంటే కాళ్లు నొప్పులు పుడుతున్నాయి.’’

- మేడా శైలజ,

మూడో తరగతి, రామాంజనేయ పురం

100 మంది పిల్లలు ఉన్నారు

‘‘సామాజిక బాధ్యతలో భాగంగా గ్రామంలో సర్వే నిర్వహించాం. సుమారు 100 మంది వరకు చదువుకునే పిల్లలు ఉన్నారు. గత ప్రభుత్వం బిల్డింగ్‌ నిర్మించింది. కానీ పాఠశాల మంజూరు చేయలేదు. ఈ విషయాన్ని మా యూనియన్‌ తరఫున ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.’’

- మక్కెన శ్రీనివాసరావు,

ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర నేత

Updated Date - Aug 17 , 2025 | 04:21 AM