MP R. Krishnaiah: బీసీ బిల్లు కోసం జాతీయ ఉద్యమం
ABN , Publish Date - Nov 03 , 2025 | 06:01 AM
బీసీలకు రాజ్యాధికారం, జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే పార్లమెంట్‌లో బీసీ బిల్లు ఆమోదం ద్వారానే సాధ్యమని, దాని కోసం....
పార్లమెంట్‌లో బిల్లు ఆమోదానికి సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలి
ఎంపీ ఆర్. కృష్ణయ్య
కర్నూలు, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): బీసీలకు రాజ్యాధికారం, జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే పార్లమెంట్‌లో బీసీ బిల్లు ఆమోదం ద్వారానే సాధ్యమని, దాని కోసం జాతీయస్థాయి ఉద్యమాన్ని నిర్మిస్తామని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఆదివారం ఆయన కర్నూలులో స్థానిక ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలసి విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకొని ప్రతినిధుల బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లి చర్చలు జరిపితే, పార్లమెంట్‌లో బీసీ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. త్వరలోనే పార్టీలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలను కలుపుకొని చంద్రబాబును కలుస్తామని, బీసీ బిల్లు అమోదం కోసం కృషి చేయాలని కోరుతామని తెలిపారు. ‘ప్రధాని మోదీ స్వయానా బీసీ.. ఆయన హయాంలోనే బీసీలకు న్యాయం జరుగుతుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఎన్ని పోరాటాలు చేసినా, పాలకులను అర్థించినా ఏ ఒక్కరూ స్పందించలేదని, ప్రధాని మోదీని అడగగానే కులగణన, రాజ్యంగబద్ధమైన బీసీ కమిషన్, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు సమ్మతి తెలిపారని పేర్కొన్నారు. బీసీ బిల్లు కోసం తెలంగాణ రాష్ట్ర బంద్ చేశామని, అన్ని రాష్ట్రాల్లో అదే తరహా ఉద్యమాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలన్నారు. బీసీ రక్షణ చట్టం కూడా పార్లమెంట్‌లో ఆమోదం పొందాలని, ఆ దిశగా చంద్రబాబు కృషి చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. అనంతరం కురుబ కులస్తుల కార్తీక వనభోజనం కార్యక్రమంలో పాల్గొన్నారు.