Share News

Rajat Bhargava: ఒత్తిళ్లకు తలొగ్గాం

ABN , Publish Date - Jul 12 , 2025 | 04:06 AM

జగన్‌ మోహన్ రెడ్డి పాలనలో జరిగిన భారీ లిక్కర్‌ స్కామ్‌లో శుక్రవారం నాడు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రజత్‌ భార్గవను సిట్‌ అధికారులు విచారించారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ రూపకల్పనకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా వచ్చే సమయనికే పాలసీ రూపొందించారని సిట్ అధికారులకు భార్గవ తెలిపారు.

Rajat Bhargava: ఒత్తిళ్లకు తలొగ్గాం

  • కొన్ని పొరపాట్లు జరగడం వాస్తవమే

  • ఎక్సైజ్‌ పాలసీ నేను రూపొందించలేదు

  • అమలు చేశా.. అంతే: రజత్‌ భార్గవ

  • ఉల్లంఘనలపై సిట్‌ ముందు మౌనం

  • పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేత

  • రాజ్‌ కసిరెడ్డి వ్యవహారంపైనా మౌనముద్ర

అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ రూపకల్పనకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా వచ్చే సమయనికే పాలసీ రూపొందించారు. నేను అమలు చేశా.. అంతే’ అంట రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రజత్‌ భార్గవ సిట్‌ అధికారులకు చెప్పారు. జగన్‌ పాలనలో జరిగిన భారీ లిక్కర్‌ స్కామ్‌లో శుక్రవారం సిట్‌ అధికారులు ఆయన్ను విచారించారు. మద్యం పాలసీ రూపొందించడం నుంచి మద్యం సరఫరా, కమీషన్ల ఖరారు, వసూలు చేయడం, ఆర్డర్‌ ఫర్‌ సేల్‌ అమలు చేయకపోవడం... ఇలా అడుగడుగునా ఉల్లంఘనలు జరుగుతుంటే ఎందుకు నిలువరించలేదంటూ సిట్‌ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.


మద్యం మాఫియ విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతూ, జనాన్ని దోచుకొంటుంటే ఎందుకు చోద్యం చూశారని ప్రశ్నించగా... ఆయన నీళ్లు నమిలినట్లు తెలిసింది. లిక్కర్‌ స్కామ్‌లో ప్రధాన నిందితుడైన రాజ్‌ కసిరెడ్డి(ఏ-1) మొత్తం అబ్కారీ శాఖను శాసిస్తుంటే.. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిగా కనీసం అభ్యంతరం చెప్పలేదెందుకన్న ప్రశ్నకు.. మౌనం వహించినట్లు సమాచారం. లిక్కర్‌ పాలసీ రూపకల్పన ఎలా జరిగింది? డిస్టిలరీస్‌ కూడా లేని వారికి మద్యం సరఫరా ఆర్డర్లు ఎలా ఇచ్చారు? ధరల నియంత్రణ లేకపోవడానికి కారణమేంటి? కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంలో నిబంధనల ఉల్లంఘనను ఎందుకు పట్టించుకోలేదు? సత్యప్రసాద్‌ అనే ఎక్సైజ్‌ అధికారికి మొత్తం అప్పగించాలని చెప్పిందెవరు? ఏ కొత్త బ్రాండ్‌ మార్కెట్లోకి వచ్చినా మొదటి నెలలో పదివేల బాక్సులకు మించి ఆర్డర్‌ ఇవ్వరాదన్న నిబంధనను ఆదాన్‌కు ఎందుకు వర్తింపజేయలేదు? మొదటి నెలలోనే 1.80 లక్షల కేసుల మద్యం ఆర్డర్లు ఇవ్వడం వెనుక గల కారణాలేంటి? రిటైల్‌ అవుట్‌లెట్ల నుంచి పెట్టాల్సిన ఆర్డర్లు రాజ్‌ కసిరెడ్డి ఆదేశాలతో సత్యప్రసాద్‌ ద్వారా డిపో మేనేజర్లు పెడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎవరి సిఫారసు మేరకు అనూషను ఎంఐఎస్‌ విభాగంలో నియమించారు? అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కోసం స్పెషల్‌ మెమో ఇవ్వాల్సిన అవసరం ఏమ్చొంది? ఎవరు ఒత్తిడి చేశారు? అంటూ సిట్‌ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది.


అనూష ఆర్డర్ల జాబితా సైఫ్‌ అహ్మద్‌కు పంపితే రాజ్‌ కసిరెడ్డికి వివరాలు పంపి ముడుపులు సేకరించిన వైనంపై రజత్‌ భార్గవను విచారించినట్లు సమాచారం. పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేసినట్టు తెలుస్తోంది. రాజ్‌ కసిరెడ్డి వ్యవహారంలో నిస్సహాయత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆర్డర్‌ ఫర్‌ సేల్స్‌ తీవ్ర ఉల్లంఘన జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదు? మద్యం ఉత్పత్తి, సరఫరాదారులు ఇచ్చిన ముడుపులు ఎవరెవరికి ఇచ్చారు? ఎవరెవరు ఎంత తీసుకున్నారు? అని సిట్‌ అధికారులు ప్రశ్నించగా.. తనకు ఏమీ తెలియదని బదులిచ్చారు. విధాన పరమైన నిర్ణయల్లో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని, అప్పట్లో ఒత్తిళ్లకు లొంగాల్సి వచ్చిందని రజత్‌ భార్గవ చెప్పినట్లు సమాచారం.

Updated Date - Jul 12 , 2025 | 11:13 AM