Share News

Deputy Tahsildar: మణిదీప్‌ గాయబ్‌

ABN , Publish Date - Aug 27 , 2025 | 06:44 AM

డ్రగ్స్‌ ముఠా, రేవ్‌ పార్టీల నిర్వహణలో కీలక వ్యక్తి రాజమహేంద్రి డిప్యూటీ తహశీల్దార్‌ (డీటీ) మణిదీప్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తనకేమీ సంబంధం లేదని...

Deputy Tahsildar: మణిదీప్‌ గాయబ్‌

  • అజ్ఞాతంలోకి రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్‌

  • డ్రగ్స్‌ గురించి తనకేమీ తెలియదని తొలుత కబుర్లు..లీవ్‌ లెటర్‌ పంపి.. ఫోన్‌ స్విచాఫ్‌

రాజమహేంద్రవరం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ ముఠా, రేవ్‌ పార్టీల నిర్వహణలో కీలక వ్యక్తి రాజమహేంద్రి డిప్యూటీ తహశీల్దార్‌ (డీటీ) మణిదీప్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తనకేమీ సంబంధం లేదని, తాను ఆఫీసు వదలి ఎక్కడకూ పోలేదని సోమవారం స్పష్టంచేసిన డీటీ.. మంగళవారం ఆఫీసుకు సెలవుపెట్టాడు. తన తల్లికి ఆరోగ్యం బాగోని కారణంగా నాలుగు రోజులు సెలవు కావాలని లెటర్‌ రాసి పంపాడు. తర్వాత ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు. దీంతో అతడు అమాయకుడని, ఈ కేసుతో సంబంధం లేదని చెప్పిన అధికారులు, ఉద్యోగులు ముక్కున వేలేసుకున్నారు. అతడి వ్యవహారాలపై తేల్చాలని కోరుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి అభిషేక్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో రాజేశ్వరి నిలయం సర్వీసు అపార్ట్‌మెంట్‌లో రేవ్‌ పార్టీపై సోమవారం ఈగల్‌ టీమ్‌, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టవడం.. ఇందులో మణిదీప్‌ పేరు బయటకు రావడం తెలిసిందే. అతడు ప్రస్తుతం ధవళేశ్వరంలోని పోలవరం భూసేకరణ పరిపాలనా కార్యాలయంలో చింతూర్‌ డివిజన్‌లోని వీఆర్‌ పురం యూనిట్‌ స్పెషల్‌ డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ భూసేకరణ పనులు చూడాల్సి ఉండగా.. అక్కడకు వెళ్లకుండా కోర్టు కేసులపై రాజమండ్రిలోనే ఎక్కువగా తిరుగుతున్నాడని ఓ అధికారి వెల్లడించారు.

Updated Date - Aug 27 , 2025 | 06:46 AM