Share News

Electric Vehicle Industry: భలే మందు చూపు

ABN , Publish Date - Jul 12 , 2025 | 03:40 AM

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్‌ కసిరెడ్డి ముందు చూపు బయటపడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... అక్రమార్జనను సక్రమం చేయాలన్న అతి తెలివో.. జగన్‌ మరోసారి అధికారంలోకి వచ్చినా, రాకున్నా తన ఆర్థిక భవిష్యత్తు భద్రంగా ఉండాలని కసిరెడ్డి భావించినట్లు తెలుస్తోంది. ఈ మేరు ఏ-1 రాజ్‌ కసిరెడ్డి ఎలక్ట్రిక్‌ కమర్షియల్‌ వాహన పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

Electric Vehicle Industry: భలే మందు చూపు

  • ఆర్థిక భద్రతపై రాజ్‌ కసిరెడ్డి దూరదృష్టి

  • మద్యం ముడుపులతో ఈవీ పరిశ్రమకు సై!

  • డీఆర్‌ఈ వెటార్స్‌ పేరుతో కంపెనీ

  • కీలక స్థానంలో ‘ఐప్యాక్‌ సత్య’ సతీమణి

  • డిజైన్‌, బ్యాటరీకి కేంద్ర అనుమతుల!

  • ఇక... ఉత్పత్తి ప్రారంభించడమే తరువాయి

  • అంతలోనే... జగన్‌ను గద్దెదించిన జనం

  • కూటమి సర్కారు చర్యలతో తలకిందులు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘ఒకసారి అధికారంలోకి వచ్చాం... మళ్లీ మళ్లీ వస్తాం! ఏం చేసినా అడిగేవారే ఉండరు’ అని అనుకున్నారు! మహా మద్యం స్కామ్‌కు తెరలేపారు. వేలకోట్ల ముడుపులు మూటగట్టారు. వచ్చిన సొమ్ముల్లో కొంత ఎన్నికల ఖర్చులకు వాడారు. కొంత దేశాలు దాటించారు. చివరికి... అవే మద్యం డబ్బులతో ఎలక్ట్రిక్‌ వాహనాల పరిశ్రమ పెట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. కానీ... అనుకున్నది ఒకటి! అయ్యిందొకటి! జగన్‌ అడిగినట్లుగా జనం ఆయనకు ‘ఒక్క చాన్స్‌’ మాత్రమే ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే... జగన్‌ హయాంలో జరిగిన మద్యం మాఫియాపై కూపీ లాగడంతో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్‌ కసిరెడ్డి ముందు చూపు బయటపడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... అక్రమార్జనను సక్రమం చేయాలన్న అతి తెలివో.. జగన్‌ మరోసారి అధికారంలోకి వచ్చినా, రాకున్నా తన ఆర్థిక భవిష్యత్తు భద్రంగా ఉండాలన్న జాగ్రత్తో... మరేదైనా కారణముందేమో తెలియదుకానీ, ఏ-1 రాజ్‌ కసిరెడ్డి ఎలక్ట్రిక్‌ కమర్షియల్‌ వాహన పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. రాజ్‌ కసిరెడ్డిని అప్పట్లో జగన్‌ తన ఐటీ సలహాదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. ప్రతి నెలా 60కోట్ల రపాయలకు తగ్గకుండా మద్యం ఆదాయం వచ్చేలా ఆయన అద్భుతమైన ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. అదే సమయంలో తాను ముందు చూపుతో జాగ్రత్తపడ్డాడు. ఎలక్ట్రిక్‌ వాహనాలకు భవిష్యత్తు ఉందని గమనించి ఆ రంగంలోకి ప్రవేశించారు.


ఈవీ ఉత్పత్తి చేసి మార్కెట్లోకి వదిలితే భవిష్యత్తుకు ఢోకా ఉండదని భావించి... తనతోపాటు తన కుటుంబ సభ్యుల పేర్లు కలిసి వచ్చేలా ‘డీఆర్‌ఈ వెటార్స్‌’ పేరుతో ఈవీ కమర్షియల్‌ వాహన ఉత్పత్తికి ఉపక్రమించారు. ప్రతి రోజూ డిస్టిలరీస్‌ నుంచి సేకరించే ముడుపుల్లో కొంత ‘సైడ్‌’ చేశారు. ఆ సొమ్ముతో డీఆర్‌ఈ మోటార్స్‌ను ఏర్పాటు చేసి... వందనా రావత్‌ అనే మహిళను కీలక స్థానంలో నియమించారు. ఆమె ఎవరో కాదు! జగన్‌ రాజకీయ వ్యూహకర్త ‘ఐప్యాక్‌’లో కీలక స్థానంలో ఉన్న సత్య అనే వ్యక్తికి సతీమణి! ఆమెకు ఈవీలపై ఉన్న ఆలోచన ద్వారా మార్కెట్లోకి రాబోతున్న తన ఎలక్ట్రిక్‌ వాహన డిజైన్‌, అందులో వాడే బ్యాటరీ, వాణిజ్య వాహన సామర్థ్యం, ఇతరత్రా ఆటోమొబైల్‌కు సంబంధించిన వ్యవహారాలపై ‘ఆర్‌ అండ్‌ డీ’ కోసం చాలా ఖర్చు చేశారు. ఈవీ కమర్షియల్‌ వాహన బ్యాటరీ, డిజైన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా తీసేసుకున్నారు. ఇక ఉత్పత్తికి ఉపక్రమించి మార్కెట్లోకి తీసుకొచ్చే సమయంలో... అంతా తలకిందులైంది. జగన్‌ ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు దించేయడంతో రాజ్‌ కసిరెడ్డి ప్రణాళికలకు బ్రేకులు పడ్డాయి. మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏప్రిల్‌ చివరి వారంలో అరెస్టైన రాజ్‌ కసిరెడ్డి విజయవాడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా కాలం గడుపుతున్నారు.

Updated Date - Jul 12 , 2025 | 11:26 AM