Share News

Medical Tests: రాజ్‌ కసిరెడ్డికి వైద్య పరీక్షలు

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:04 AM

లిక్కర్‌ కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డిని వైద్య పరీక్షల కోసం బుధవారం జైలు అధికారులు విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు.

Medical Tests: రాజ్‌ కసిరెడ్డికి వైద్య పరీక్షలు

  • ఇద్దరు నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై 12న తీర్పు

  • చెవిరెడ్డి ఫిజియోథెరపీ పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు

విజయవాడ, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): లిక్కర్‌ కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డిని వైద్య పరీక్షల కోసం బుధవారం జైలు అధికారులు విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. యూరాలజీ విభాగంలో ఆయనకు అల్ట్రాసౌండ్ స్కాన్‌ చేయగా కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు తేలింది. అయితే అక్కడ ఓపీ లేకపోవడంతో గురువారం తీసుకురావాలని వైద్యులు సూచించారు. తరువాత వైద్య సిబ్బంది ఆయనకు రక్తపరీక్షలు చేశారు. అనంతరం అధికారులు కసిరెడ్డిని జైలుకు తరలించారు. కాగా, లిక్కర్‌ కేసులో నిందితులు కె.ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న అనంతరం తీర్పును 12వ తేదీకి న్యాయాధికారి పి.భాస్కరరావు వాయిదా వేశారు.

చెవిరెడ్డికి చుక్కెదురు

మద్యం కేసులో అరెస్టయి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి కోర్టులో చుక్కెదురైంది. స్విమ్స్‌లో ఫిజియోథెరపి చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అలా అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేస్తూ బుధవారం తీర్పును వెలువరించింది. అయితే వారంలో మూడు రోజులపాటు ఇంటి నుంచి భోజనం తీసుకురావడానికి అనుమతి ఇచ్చింది.

Updated Date - Aug 07 , 2025 | 04:06 AM