Raj Kasireddy: ఆ 11 కోట్లతో నాకు సంబంధం లేదు
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:28 AM
శంషాబాద్ మండలం కాచారంలోని ఫాంహౌస్ నుంచి సిట్ స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి.
బెయిల్‌ను అడ్డుకునేందుకు సిట్ ప్రయత్నం
ఏసీబీ కోర్టులో రాజ్ కసిరెడ్డి అఫిడవిట్
విజయవాడ, జూలై 30(ఆంధ్రజ్యోతి): శంషాబాద్ మండలం కాచారంలోని ఫాంహౌస్ నుంచి సిట్ స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన అఫిడవిట్‌ను ఆయన తరఫు న్యాయవాది బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. మద్యం కుంభకోణంలో సిట్ ఏప్రిల్ 22న తనను అరెస్టు చేసిందని, అప్పటి నుంచి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నానని.. తనకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు సిట్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఎక్కడెక్కడో పట్టుకున్న డబ్బును తనకు లింక్ చేసి కట్టుకథలు అల్లుతోందన్నారు. తీగల బాలిరెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్లు తనవేనని సిట్ నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. బాలిరెడ్డికి ఆయన కుమారుడు విజయేందర్ రెడ్డికి అనేక వ్యాపారాలు ఉన్నాయని, ఇంజనీరింగ్ కాలేజీలు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆస్పత్రులు నడుపుతూ కోట్లాది రూపాయల లావాదేవీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆరేట్ ఆస్పత్రుల్లో తన భార్యకు చాలా స్వల్ప షేర్ ఉందని, అది తప్ప ‘తీగల’తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని రాజ్ కసిరెడ్డి స్పష్టం చేశారు.