Weather: ఇటు వాన, అటు ఎండ
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:43 AM
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం పిడుగులతో వర్షాలు కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశా పరిసరాల్లో...
రాయలసీమ, ఉత్తర కోస్తాలో వర్షాలు
దక్షిణ కోస్తాలో పలుచోట్ల భానుడు భగభగ
నేడు కోస్తాలో భారీ వర్షాలు
విశాఖపట్నం/అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం పిడుగులతో వర్షాలు కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. మరోవైపు కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ పిడుగులు, ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నంద్యాల జిల్లా ముత్యాలపాడులో 7.75, ఆళ్లగడ్డలో 6.72, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 6.1, ఎలమంచిలిలో 6, తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్లలో 4.95, అనకాపల్లి జిల్లా చోడవరంలో 4.82 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ కోస్తాలో బాపట్ల నుంచి నెల్లూరు జిల్లా వరకూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. నెల్లూరు జిల్లా కావలిలో 39.8 డిగ్రీలు, నెల్లూరులో 39.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరులో సెప్టెంబరు నెలకు సంబంధించి ఇదే ఆల్‌టైమ్ రికార్డుగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గురువారం ఉత్తరకోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.