వర్షాలు.. వరదలు
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:23 AM
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షానికి జిల్లాలోని ఉప నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో సగటున 13.7 సెంటీ మీటర్ల వర్షం పడింది.
- ఉధృతంగా మునేరు, కట్టలేరు, వైరా ఉప నదులు
- పొంగి ప్రవహిస్తున్న ఏనుగుగడ్డ వాగు, పులివాగు, కొండవాగు
- బుడమేరుకు 3,600 క్యూసెక్కుల వరద
- అనేక గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు
- వరి పంట వర్షార్పణం.. మినుముకు భారీ నష్టం
- ఆర్‌అండ్‌బీ రోడ్లు, ఎన్‌హెచ్ - 30పైకి వరద నీరు
- విజయవాడలోనూ భారీ వర్షం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/ఇబ్రహీంపట్నం/కంచికచర్ల):
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షానికి జిల్లాలోని ఉప నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో సగటున 13.7 సెంటీ మీటర్ల వర్షం పడింది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కట్టలేరు, వైరా, మునేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా కట్టలేరు ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. నందిగామ మండలం కూడలి, వీరులపాడు మండలం పల్లెంపల్లి దగ్గర కట్టలేరు మున్నేరులో కలుస్తుంది. వరంగల్ జిల్లా నుంచి వైరా ఏరు ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడ కురుస్తున్న వర్షాల కారణంగా వైరా ఏరు కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఉధృతిగా కొనసాగుతోంది. ఈ వైరా ఏరు జిల్లాలో కీసర దగ్గర మున్నేరులో కలుస్తుంది. కీసర నుంచి కట్టలేరు ఒక్కటిగా కృష్ణానదిలో కలుస్తోంది. జిల్లాలోని వాయువ్య, ఉత్తర ప్రాంతాలలో వాగులు, వంకలు ప్రవహిస్తుండటం వల్ల బుడమేరుకు స్వల్పంగా వరద పెరిగింది. గురువారం నాటికి 3,500 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తోంది. విజయవాడ నగరంలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షం కురిసింది.
ముంపులో వరి పొలాలు
జీ.కొండూరు, చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు, తిరువూరు, ఇబ్రహీంపట్నం, ఏ.కొండూరు గంపలగూడెం మండలాల పరిధిలో భారీ వర్షం కురిసింది. నందిగామ, తిరువూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో వేలాది ఎకరాల వరి పంట ముంపునకు గురైంది. ఈ నెలలో కురిసిన వర్షాలకు వరి పంట చాలా చోట్ల రంగు మారింది. మళ్లీ ముంపులో చిక్కుకోవటంతో అన్నదాత ఆవేదన అంతా ఇంతా కాకుండా ఉంది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటే.. నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో మినుము పంటకు భారీగా నష్టం వాటిల్లింది. గంపలగూడెం, జీ కొండూరు మండలాల పరిధిలో వరి పంట ముంపులో చిక్కుకుంది. భారీ వర్షాలతో ఏనుగుగడ్డ వాగు ఉధృతి కారణంగా ఇబ్రహీంపట్నం మండలంలో వరి పంటకు నష్టం ఏర్పడింది.
రోడ్లపైకి వరద నీరు
జిల్లాలో కురిసిన వర్షాలకు ఆర్‌అండ్‌బీ రహదారులపై వరద కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వైరా ఏరు కారణంగా మధిర వెళ్లే రోడ్డులో కూడలి దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి. నల్లవాగు కారణంగా నందిగామ నుంచి చందర్లపాడు సమీప ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఏనుగుగడ్డ వాగు కారణంగా పెద్దాపురం నుంచి గూడెం మాధవరం గ్రామాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. రెడ్డిగూడెం నుంచి ఓబుళాపురానికి వెళ్లే రోడ్డుపై వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు ఆగిపోయాయి. మైలవరం పట్టణంలో బాలయోగి నగర్ - సూరిబాబు పేట మధ్య వర్షపు నీటి ఉధృతి కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. తిరువూరు - గంపలగూడెం గ్రామాల మధ్య చింతలపాడు వద్ద ఉన్న లో లెవల్ చప్టాపై వరద ప్రవాహం ఉధృతం కావడంతో బుధవారం రాత్రి రాకపోకలు నిలిచిపోయాయి. మైలవరం అయ్యప్పనగర్ దగ్గర విజయవాడ - ఛత్తీస్‌గఢ్ మార్గంలో స్వల్పంగా వరద నీరు రోడ్డు మీద నుంచి ప్రవహిస్తోంది. ఉమ్మడిదేవరపల్లి - నెమలి గ్రామాల మధ్య అనురాధ వాగు ఉప్పొంగింది. ఊటుకూరు - కొణిజర్ల మధ్య నల్లవాగు ఉధృతికి ఆయా గ్రామాల మధ్య రాకపోఉలు నిలిచిపోయాయి. విస్సన్నపేట ఎన్టీఆర్ కాలనీలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. వాగులు పొంగుతుండటంతో చందర్లపాడు - పాటెంపాడు మధ్య, గుడిమెట్ల - లక్ష్మీపురం గ్రామాల మధ్య, ముప్పాళ్ల - తుర్లపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కంచికచర్ల నుంచి చెవిటికల్లు మార్గంలో పలు వాగులు ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ప్రవహిస్తుండటంతో చెవిటికల్లు, కునికినపాడు, మున్నలూరు, మోగులూరు తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఎన్‌ఎస్‌పీ మేజర్ కాలువ కట్టకు గండి :
తిరువూరు ఎన్‌ఎస్‌పీ మేజర్ కాలువ కట్టకు గండి పడింది. అయితే దాని వల్ల పెద్ద ప్రమాదం ఏం జరగలేదు. అధికారులు స్పందించి వెంటనే గండిని ఇసుక బస్తాలతో పూడ్పించారు. పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు.