Rains Expected: ద్రోణి ప్రభావంతో వర్షాలు
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:51 AM
నైరుతి బంగాళాఖాతం నుంచి తమిళనాడు మీదుగా కేరళ వరకూ ఉపరితలద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో బంగాళాఖాతం..
నేడూ అక్కడక్కడ వానలు
విశాఖపట్నం/అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతం నుంచి తమిళనాడు మీదుగా కేరళ వరకూ ఉపరితలద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తున్నందున బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిశాయి. మిగిలినచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా బి.చెర్లోపల్లిలో 6.6, శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంటలో 4.5, నెల్లూరు జిల్లా కండలేరులో 4, విజయవాడ తూర్పులో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, నెల్లూరులో 34.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తరకోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కాగా, రాష్ట్రంలో గురువారం అక్కడక్కడ అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.