ఆత్మకూరులో వర్ష బీభత్సం
ABN , Publish Date - Oct 29 , 2025 | 11:46 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో సంభవించిన మొంథా తుఫాన ఆత్మకూరు ప్రాంతంలో బీభత్సం సృష్టించింది.
మార్కెట్ యార్డులో భారీగా వరద
ఆత్మకూరు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో సంభవించిన మొంథా తుఫాన ఆత్మకూరు ప్రాంతంలో బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షంతో 139.6మిమీల వర్షాపాతం నమోదైంది. దీంతో ఆత్మకూరు పట్టణంలోని సాయిబాబానగర్, ఏకలవ్యానగర్, గరీబ్‌నగర్, ఇందిరానగర్, లక్ష్మీనగర్, ఎస్పీజీపాలెం, ఏబీఎం పాలెం తదితర కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మార్కెట్ యార్డు ప్రాంగణంలోకి భారీగా వరదనీరు నిలిచిపోయింది. అక్కడే ఉన్న డీసీఎంఎస్ కార్యాలయంలోకి వర్షపునీరు చేరింది. గుండ్లకమ్మవాగు ఉప్పొంగి ప్రవహించింది. కర్నూలు - గుంటూరు జాతీయ రహదారిపై వర్షపునీరు నిలిచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తాయి. ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, తహసీల్దార్ రత్నరాధిక, మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు, అర్బన సీఐ రాము, ఎస్‌ఐ నారాయణరెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తూ.. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. భారీ వర్షాలతో నిరాశ్రయులైన వారికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి భోజన, తాగునీటి సదుపాయాన్ని కల్పించారు. ఇదిలావుంటే 2020 సెప్టెంబరు 13న ఆత్మకూరులో 247.8మిమీల వర్షం కురిసింది. ఆ తర్వాత ఇంతటి భారీ వర్షం ఇటీవల కాలంలో కురవలేదు.