రెండురోజుల పాటు వర్షాలు
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:00 AM
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అప్రమత్తం చేసిన అధికారులు
నంద్యాల ఎడ్యుకేషన, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కర్నూలు, నంద్యాల జిల్లాల్లో బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం కారణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో మూడురోజుల పాటు(13,14,15 తేదీల్లో), నంద్యాల జిల్లాలో రెండురోజుల పాటు(బుధ,గురు) మోస్తరు నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో కుందూ, తెలుగుగంగ, కేసీ కెనాల్‌కు జలవనరుల శాఖ అధికారులు నీటి ప్రవాహాన్ని తగ్గించారు. కుందూకు సంతజూటూరు పికప్ ఆనకట్ట నుంచి 12వేల క్యూసెక్కులు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నామని, వర్షాల ప్రభావంతో కుందూ నదికి నీటి ఉధృతి పెరిగిందని కేసీ ఈఈ ప్రతాప్ తెలిపారు. అలాగే అన్ని కాల్వలకు నీటి విడుదలను తగ్గించామన్నారు.
అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ రాజకుమారి
భారీ వర్షాల నేపథ్యంలో నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. అధికారులు నదీతీర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని, మట్టిమిద్దెలు, శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారిని గుర్తించి సురక్షిత ప్రాంతానికి చేర్చాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా ఉండాలన్నారు.