వర్షం.. ఎంతో నష్టం
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:12 AM
వర్షం తగ్గినా కాలనీల్లో వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాంజల చెరువు నిండి పొర్లడంతో పక్కనే ఉన్న ఎల్‌ఐజీ, ఎంఐజీ, ఎన్‌జీవోస్ కాలనీ రోడ్లన్నీ జలమయ్యయి.
ఆదోనిలో తగ్గని వరద నీరు
పత్తికొండ, ఆస్పరి మండల పొలాల్లో వర్షపునీరు
దేవనకొండలో కూలిన మట్టిమిద్దె
ఆదోని టౌన్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): వర్షం తగ్గినా కాలనీల్లో వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాంజల చెరువు నిండి పొర్లడంతో పక్కనే ఉన్న ఎల్‌ఐజీ, ఎంఐజీ, ఎన్‌జీవోస్ కాలనీ రోడ్లన్నీ జలమయ్యయి. కాలువ ఏదో రోడ్డేదో అర్థం కావడం లేదు. మున్సిపల్ కమిషనర్ కృష్ణ, హెల్త్ ఆఫీసర్ డా. సందీప్ కుమార్ సిబ్బందితో కలిసి కొన్ని చోట్ల ప్రమాద సూచికగా ఏరుపు జెండాలను ఏర్పాటు చేశారు. వరద నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.
చిన్నహుల్తి, పెద్దహుల్తి గ్రామాల్లో నీట మునిగిన పంటలు
పత్తికొండ టౌన్: రెండు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారు. పెద్దహుల్తి, చిన్నహుల్తి గ్రామాలకు ఆనుకుని హంద్రీవంక ఉంది. ఎగువన కురిసిన వర్షాలతో వందక పొంగి పొలాల్లోకి నీరు చేరింది. దీంతో కంది, సజ్జ తదితర పంటలన్నీ దెబ్బతిన్నాయి. పెద్దహుల్తి గ్రామానికి చెందిన రైతులు హుల్తెప్ప, మహానంది తమకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.
నష్టపరిహారం కోసం ఎదురుచూపులు
ఆస్పరి: ఎడతెరిపిలేని వర్షాలతో ఖరీఫ్ పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. మండలంలో సుమారు 20 వేల ఎకరాలకు పైగా ఆయా పంటలు సాగుచేశారు. తేమశాతం అధికం కావడంతో పత్తి, మిరప, చిక్కుడుకాయ, వంకాయ, చోళకాయ కుళ్లిపోతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్సాలకు పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తాను 5 ఎకరాల్లో మిరప, చిక్కుడుకాయ సాగుచేశానని పంటలు నీటమునగడంతో నష్టపోయానని ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆస్పరికి చెందిన రైతు మహానంది కోరారు.
కూలిన మట్టిమిద్దె
దేవనకొండ: శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి కోటకొండ గ్రామంలో మట్టి మిద్దె కూలింది. బాధితుడు చాకలి వీధికి చెందిన గిడ్డయ్య తెలపిన మేరకు.. అర్ధరాత్రి ఇంట్లో భార్య నాగమ్మతో కలిసి నిద్రిస్తుండగా కూలిపోయే ముందు వచ్చే శబ్ధాలు వచ్చాయి. దీంతో పరుగు పరుగున ఇద్దరు బయటకు వచ్చారు. అంతలోనే మిద్దె కూలిపోయింది. ప్రాణనష్టం తప్పడంతో ఊపిరి పీల్చుకు న్నారు. గిడ్డయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.