Share News

జిల్లా అంతటా వర్షం

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:22 AM

మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో సోమ వారం ఉదయం నుంచే వర్షం ప్రారంభమైంది. మంగళవారం రాత్రికి తీరం దాటుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను గమనం ఆధారంగా వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో పర్యటించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేసింది. జిల్లాలోని పునరావాస కేంద్రాలను జిల్లా ప్రత్యేక అధికారి అమ్రపాలి పరిశీలించారు. వసతులపై బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

జిల్లా అంతటా వర్షం

- దూసుకొస్తున్న మొంథా తుఫాన్‌

- ఉదయం నుంచి కురుస్తున్న వర్షం

- నేటి రాత్రికి తీరం దాటుతుందని అంచనా

- తుఫాన్‌ గమనం ఆధారంగా తీవ్రత పెరిగే అవకాశం

- జిల్లాలో 180 పునరావాస కేంద్రాలు

- కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం మండలాల్లో 400 మంది వరకు తరలింపు

- క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్‌, జేసీ, ఎస్పీ

- పునరావాస కేంద్రాలను పరిశీలించిన జిల్లా ప్రత్యేక అధికారి అమ్రపాలి

మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో సోమ వారం ఉదయం నుంచే వర్షం ప్రారంభమైంది. మంగళవారం రాత్రికి తీరం దాటుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను గమనం ఆధారంగా వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో పర్యటించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేసింది. జిల్లాలోని పునరావాస కేంద్రాలను జిల్లా ప్రత్యేక అధికారి అమ్రపాలి పరిశీలించారు. వసతులపై బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

మొంథా తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల సోమవారం ఉదయం నుంచి తేలికపాటి జల్లులు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఏ క్షణంలో వర్షం పెరుగుతుందోననే భయం జిల్లా ప్రజలను వెంటాడుతోంది. తుఫాన్‌ ప్రభావంతో మంగినపూడి బీచ్‌, హంసలదీవి బీచ్‌ల వద్ద సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఈ బీచ్‌లలోకి ఎవ్వరినీ పోలీసులు అనుమతించడం లేదు. మచిలీపట్నం, కోడూరు మెరైన్‌ పోలీసులతో బీచ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం తదితర మండలాల్లో 400 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. జిల్లాలో 180 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజలను అక్కడకు తరలించే ఏర్పాట్లలో రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం నిమగ్నమైంది.

క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటన

తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్‌ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, నందివాడ, పామర్రు మండలాల్లో పర్యటించారు. ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశాల్లో వారు మాట్లాడారు. తుఫాన్‌ కారణంగా ఏర్పడే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఒర్లగొందితిప్పలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. బంటుమిల్లి, పెడన తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లను పరిశీలించి అఽధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బంటుమిల్లి మండలం ముంజులూరులో ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు

అందరూ అప్రమత్తగా ఉండాలి: కలెక్టర్‌ బాలాజీ

జిల్లాలో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ బాలాజీ హెచ్చరించారు. ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రావద్దన్నారు. జిల్లాలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకునేలా అధికారులను అప్రమత్తం చేశామన్నారు. పూరిళ్లు, పెంకుల ఇళ్లు, పాత గృహాల్లో నివాసం ఉండే వారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని చెప్పారు. కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో ఎన్ని విద్యుత స్తంభాలు, ఎంతమేర విద్యుత వైర్లు, కాంట్రాక్టర్‌ మనుషులను అందుబాటులో ఉంచారు అనే అంశాలపై కలెక్టర్‌ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బలమైన గాలులకు ఆయా ప్రాంతాల్లో రహదారులపై చెట్లు విరిగి పడిపోతే, వెంటనే వాటిని తొలగించి, రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. నాగాయలంక సొర్లగొంది, మోపిదేవి మండలం బీసీ గురుకుల పాఠశాలలో, కోడూరు మండలం వి-కొత్తపాలెంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలను జేసీ ఎం.నవీన్‌ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఎప్పటికపుడు పూర్తిస్థాయి సమాచారాన్ని జిల్లా అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు.

కరకట్టలపై నిఘా

సముద్రతీరం వెంబడి కరకట్టలు, కాల్వగట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు తెలిపారు. భారీ వర్షాల కారణంగా కాజ్‌వేల వద్ద నీటి ప్రవాహం అధికమైతే అక్కడ రాకపోకలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులతో సమన్వయం చేసుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు మంగళవారం ఉదయంలోగా తరలించ డానికి ప్రణాళికను రూపొందించామని వివరించారు.

ప్రత్యేక అధికారి పరిశీలన

మొంథా తుఫాన్‌ నేపథ్యంలో సహాయ చర్యల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం నియమించిన జిల్లా ప్రత్యేక అఽధికారి అమ్రపాలి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. గిలకలదిండి, గనాలదిబ్బ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలను పరిశీలించారు. జిల్లాలో తుఫాన్‌ విపత్తును ఎదుర్కొనేందుకు చేసిన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అన్నదాతల్లో ఆందోళన

మొంథా తుఫాన్‌ కారణంగా కోస్తాతీరం వెంబడి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తుఫాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయనే హెచ్చరికలతో అన్నదాతలు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 1.60 లక్షల హెక్టార్లలో వరి సాగు జరిగింది. పెడన, మచిలీపట్నం, గూడూరు, పామర్రు మండలాల్లో వెదజల్లే పద్ధతిన వరినాట్లు వేసిన పొలాలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. రెండు, మూడు రోజుల పాటు వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తే వరి నేలకొరిగి నీటిలో నాని పంట దెబ్బతింటుందని రైతులు చెబుతున్నారు. కంకిపాడు, తోట్లవల్లూరు, ఉయ్యూరుతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో 1.20 లక్షల హెక్టార్లలో వరి పంట పాలు పోసుకునే దశలో ఉంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే వరి పంట నేలవాలి పోతుందని, అధిక వర్షాల కారణంగా పంట నీటిలోనే రోజుల తరబడి ఉండిపోతే నష్టపోతామని అన్నదాతలు భయపడుతున్నారు. ఏటా పంట కోత సమయంలో ఏదో ఒక విపత్తు రైతులను నష్ట పరుస్తోందని కన్నీరు పెడుతున్నారు.

Updated Date - Oct 28 , 2025 | 12:22 AM