Phone Theft: మొబైల్ కొట్టేసి.. ఫోన్ పేలో దోచేసి..
ABN , Publish Date - Nov 11 , 2025 | 04:56 AM
నేను రైల్వే పోలీసును మాట్లాడుతున్నా.. మేం ఒక దొంగను పట్టుకున్నాం.. వాడి నుంచి మీ ఫోన్ రికవరీ చేశాం.. ఈ ఫోన్ మీదే అయితే లాక్ చెప్పండి. అలాగే ఆధార్ వివరాలు కూడా పంపిస్తే..
రైల్వేస్టేషన్లో చార్జింగ్ పెట్టిన ఫోన్లు మాయం
బాధితులు ఫోన్ చేయగానే రైల్వే పోలీస్‌నంటూ నాటకం
ఫోన్ లాక్, ఆధార్ వివరాలు కావాలని బురిడీ
ఆధార్ వివరాలివ్వగానే కొత్త సిమ్‌తో లాగిన్
ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఖాతాలో సొమ్ము ఖాళీ
విజయవాడ రైల్వే పోలీసులకు చిక్కిన కిలాడీ దొంగలు
9 లక్షల విలువ చేసే 45 సెల్‌ఫోన్లు స్వాధీనం
అమరావతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ‘నేను రైల్వే పోలీసును మాట్లాడుతున్నా.. మేం ఒక దొంగను పట్టుకున్నాం.. వాడి నుంచి మీ ఫోన్ రికవరీ చేశాం.. ఈ ఫోన్ మీదే అయితే లాక్ చెప్పండి. అలాగే ఆధార్ వివరాలు కూడా పంపిస్తే.. సరిచూసుకుని దీన్ని మీకు అందజేస్తాం...’ రైల్వేస్టేషన్లలో సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు ఆ ఫోన్ కాజేసిన దొంగ చెప్పే మాయ మాటలివి..! అవతలి వ్యక్తి నిజంగానే రైల్వే పోలీసు అని నమ్మిన బాధితులు తమ ఫోన్ లాక్, ఆధార్ వివరాలు ఇవ్వగానే... ఫోన్ పే, గూగుల్ పే ద్వారా బ్యాంకు ఖాతాలో ఉన్నదంతా ఊడ్చేస్తాడు. ఆ తర్వాత ఆ ఫోన్‌ను కూడా అమ్మేసుకుని క్యాష్ చేసుకుంటాడు. కొన్ని నెలలుగా సాగుతున్న కిలాడీ దొంగ చేతివాటానికి విజయవాడ రైల్వే పోలీసులు ఎట్టకేలకు సంకెళ్లు వేశారు. రూ.9 లక్షల విలువ చేసే 45 సెల్ ఫోన్లను రికవరీ చేసి.. మరో ఇద్దరు తోడు దొంగల్ని కూడా జైలుకు పంపారు. ఆ వివరాలను విజయవాడ రైల్వే పోలీసులు వివరించారు.
పది ఫిర్యాదులు.. 45 ఫోన్ల రికవరీ..
విజయవాడ రైల్వే పోలీసులకు ఇటీవల వరుసగా సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితుల నుంచి పది ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై నిఘాపెట్టిన రైల్వే పోలీసు అధికారి వెంకటరమణ బృందానికి ఎట్టకేలకు కిలాడి దొంగ బంగారు రాంబాబు (21) పట్టుబడ్డాడు. తమదైన శైలిలో విచారించడంతో తనకు గుర్తున్న 45 నేరాలను అంగీకరించాడు. ఆయనకు సహకరించిన బురడగంటి నవీన్ (23)తో పాటు దొంగలించిన మొబైళ్లు విక్రయించి వాటా తీసుకున్న ఆటో డ్రైవర్ వంకూరి ప్రకాశ్ (38)ను సైతం అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ మరిన్ని చోరీలు చేసిందని, ఇంకా విచారించాల్సి ఉందని రైల్వే పోలీసులు చెబుతున్నారు. కాగా, విజయవాడ రైల్వే పోలీసులు పది కేసుల దర్యాప్తులో దొంగల్ని అరెస్టు చేయగా 45 సెల్ ఫోన్లు రికవరీ అయ్యాయి. మిగతా 35 ఫోన్లకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు లేక పోవడంతో పోగొగ్టుకున్న వ్యక్తులు తగిన ఆధారాలతో (బిల్లు, ఖాళీ బాక్స్) తమను సంప్రదించాలని రైల్వే పోలీసులు సూచించారు. రైల్వే పోలీసుల పేరుతో ఎవరైనా వివరాలు అడిగితే ఫోన్లో వెల్లడించొద్దని, జీఆర్‌పీ స్టేషన్‌కు వచ్చి నేరుగా ఆధారాలు అందజేసి ఫోన్లు తీసుకెళ్లాలని చెప్పారు. కాగా, సెల్‌ఫోన్లతో పాటు అందులో ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కాజేసిన సొమ్ము లక్షల్లోనే ఉందని, బాధితులంతా వచ్చి చెప్పిన తర్వాతే ఎన్ని లక్షలు కాజేశారో తెలుస్తుందని అన్నారు.
ఫోన్ చార్జింగ్ పెడుతున్నట్టు నటిస్తూ..
విజయవాడ రైల్వేస్టేషన్లో సెల్ ఫోన్లు ఎక్కువగా దొంగతనం అవుతున్నాయంటూ ప్రయాణికులతో పాటు రైల్వే సిబ్బంది నుంచి ఇటీవల వరుస ఫిర్యాదులు వచ్చాయి. రైల్వే డీఐజీ సత్యయేసుబాబు.. రైల్వే పోలీసు అధికారి వెంకటరమణ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విజయవాడ రైల్వే స్టేషన్లో సెల్‌ఫోన్లు కొట్టేస్తున్న బంగారు రాంబాబు అనే దొంగ పట్టుబడ్డాడు. విచారణలో తాను ఫోన్లు ఎలా దొంగిలించేవాడో పోలీసులకు వివరించాడు. తన ఫోన్ చార్జింగ్ పెట్టేందుకు తీసుకొచ్చినట్లు నటిస్తూనే అక్కడ ఇతర ప్రయాణికులు చార్జింగ్ పెట్టుకున్న ఫోన్లను లేపేసేవాడు. అలా కొట్టేసిన ఫోన్లను స్విచాఫ్ చేయకుండా బాధితుల నుంచి ఫోన్ వచ్చేదాకా ఎదురు చూసేవాడు. వారు ఇతరుల ఫోన్ తీసుకుని కాల్ చేయగానే ఆ దొంగ లిఫ్ట్ చేసేవాడు. అవతలి వ్యక్తి ఆ ఫోను నాదే అనగానే.. ‘నేను రైల్వే పోలీస్‌ని మాట్లాడుతున్నా ఒక దొంగను పట్టుకున్నాం’ అంటూ తన తెలివి ప్రదర్శించేవాడు. అవతలి వ్యక్తి తనదే మొబైల్ అని నిరూపించేందుకు నంబర్ లాక్, లేదంటే లాక్ ప్యాట్రన్ చెబుతాడు. ఇదే అవకాశంగా ఆధార్ కార్డు కూడా వాట్సాప్‌కు పంపమని అడుగుతాడు. వెంటనే ఆ ఆధార్ ప్రూఫ్‌తో మరోసిమ్ కొనుగోలు చేసేవాడు. ఆ సిమ్‌ను ఫోన్‌లో వేసుకుని వేసుకుని ఫోన్‌పే యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటాడు. అందులో కొత్తగా లాగిన్ అయ్యి.. దగ్గర్లోని ఏటీఎం వద్దకు వెళ్తాడు. అక్కడ డబ్బు డ్రా చేసే వ్యక్తులను ‘మీకు ఫోన్ పే చేస్తా.. నాకు క్యాష్ ఇస్తారా.. ప్లీజ్’ అంటూ రిక్వెస్ట్‌గా అడుగుతాడు. అలా పలుమార్లు పలువురికి ఫోన్ పే పంపి ఖాతాలో ఉన్నదంతా ఖాళీ చేసేస్తాడు. తర్వాత చిన్న చిన్న మొబైల్ షాపులకు వెళ్లి.. ఆ ఫోన్‌ను వచ్చినకాడికి అమ్మేస్తాడు.
