శరవేగంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:14 PM
అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా ఆధునిక వసతులతో అరకులోయ నూతన రైల్వే స్టేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
అందుబాటులోకి రానున్న స్టేషన్ నూతన భవనం, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు
వచ్చే వేసవి నాటికి పూర్తి చేయాలని లక్ష్యం
అరకులోయ, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా ఆధునిక వసతులతో అరకులోయ నూతన రైల్వే స్టేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేయడంతో జీప్లస్ టూ నూతన రైల్వే స్టేషన్ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు సాగుతున్నాయి. వచ్చే వేసవి నాటికి నూతన రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబరు నాటికే పనులు పూర్తి కావలసి ఉన్నప్పటికీ నిధుల విడుదలలో కాస్త జాప్యం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే వేసవికి అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
జోరుగా పాసింజర్ హాల్ట్ పనులు
అరకులోయలో రిక్వెస్ట్ స్టేజీ వద్ద శాశ్వత ప్రాతిపదికన పాసింజర్ హాల్ట్ పనులు జోరుగా సాగుతున్నాయి. అరకు ఎంపీ డాక్టర్ తనుజారాణి ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర రైల్వే మంత్రిని పలుమార్లు కలిసి పాసింజర్ హాల్ట్ ఏర్పాటుకు సుమారు రూ.2.5 కోట్లు మంజూరు చేయించారు. అక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు కూడా వచ్చే వేసవి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.