Railway Development : ఏపీలో రెండు ఫ్రైట్ కారిడార్లపై సర్వే పూర్తి
ABN , Publish Date - Mar 11 , 2025 | 04:32 AM
ముంబై-హైదరాబాద్ మధ్య హైస్పీడ్ రైల్వే కారిడార్ నిర్మించే విషయంపై జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సర్వే, డీపీఆర్‌లను రూపొందిస్తోందని వెల్లడించింది.

పీపీపీఏసీ పరిశీలనకు బెజవాడ రైల్వేస్టేషన్ ఆధునీకరణ
పీపీపీఏసీ పరిశీలనకు విజయవాడ రైల్వేస్టేషన్ ఆధునీకరణ ప్రతిపాదనలు
ముంబై-హైదరాబాద్ మధ్య హైస్పీడ్ రైల్వే కారిడార్
సీఎం రమేశ్ కమిటీకి తెలిపిన రైల్వే శాఖ
న్యూఢిల్లీ, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ఖరగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు డెడికేటెడ్ ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్, విజయవాడ-నాగపూర్-ఇటార్సీల మధ్య నార్త్-సౌత్ సబ్ కారిడార్‌ల నిర్మాణానికి సర్వే, డీపీఆర్‌లు పూర్తి చేశామని, వాటి అమలుపై పరిశీలన చేస్తున్నామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ముంబై-హైదరాబాద్ మధ్య హైస్పీడ్ రైల్వే కారిడార్ నిర్మించే విషయంపై జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సర్వే, డీపీఆర్‌లను రూపొందిస్తోందని వెల్లడించింది. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ నేతృత్వంలోని రైల్వే స్టాండింగ్ కమిటీ లేవనెత్తిన అంశాలపై రైల్వే శాఖ ఇచ్చిన వివరణలో ఈ విషయాలను తెలిపింది. స్టాండింగ్ కమిటీ నివేదికను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కాగా, విజయవాడ రైల్వేస్టేషన్‌ను ఆధునీకరించే ప్రతిపాదనను పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) పరిశీలనకు పంపామని రైల్వే శాఖ తెలిపింది. రైల్వేస్టేషన్ల అభివృద్ధికి పీపీపీ నమూనానే అమలు చేస్తామని వెల్లడించింది. విజయవాడ రైల్వేస్టేషన్ అభివృద్ధి ప్రతిపాదనలపై నీతిఆయోగ్, ఆర్థిక వ్యవహారాలు, వ్యయ విభాగాలు, న్యాయశాఖ నుంచి సూచనలు స్వీకరించామని తెలిపింది.
సీఎం రమేశ్ కమిటీ పలు ప్రతిపాదనలు
రైల్వే నికర ఆదాయం గత మూడేళ్లలో సాధారణంగా ఉందని, సర్వీసు ఆధారిత ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి.
ఆపరేటింగ్ నిష్పత్తి మెరుగుదలకు వీలుగా ఆదాయం పెంచాలి, వర్కింగ్ వ్యయాలు తగ్గించుకోవాలి, ఖర్చు తగ్గించే టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, ఇంధన వినియోగంలో దుబారాను నివారించాలి, ప్రయాణికుల చార్జిలతో నిమిత్తం లేని ఆదాయ వనరులను పొందే మార్గాలను అన్వేషించాలి.
రోడ్డు ఓవర్ వంతెనలు, రోడ్డు అండర్ వంతెనల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ప్రజా ప్రతినిధులు, స్థానిక అధికారులతో రైల్వే శాఖ చర్చలు జరపాలి.
ఫ్రైట్ కారిడార్ల నిర్మాణంపై నిర్ణయాన్ని వేగవంతం చేయాలి.
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద గుర్తించిన 1,337 రైల్వేస్టేషన్ల అభివృద్ధిని వేగవంతం చేయాలి. ఈ పథకాన్ని వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాలి.
కోచ్‌లు, వ్యాగన్లు, కంటెనర్ల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచాలి. కొత్త ఉత్పాదక సౌకర్యాలను ఏర్పర్చుకోవాలి. అవసరమైతే పీపీపీల ద్వారా అధునాతన కోచ్ నిర్మాణ టెక్నాలజీలను అవలంబించాలి.
దీర్ఘకాలంలో ఆఽఽధునీకరణకు తోడ్పడే రైల్వే పరిశోధనకు సంబంధించి నిధులను ఖర్చు పెట్టకపోవడంపై కమిటీ విస్మయం వ్యక్తం చేసింది.