Banana Exports: అరటిపై బాదుడు
ABN , Publish Date - Dec 07 , 2025 | 05:01 AM
ఓ వైపు అరటికి ధర లేక రైతులు అల్లాడుతుంటే.. మరోవైపు అరటి ఎగుమతిదారులపై రైల్వేశాఖ అదనపు చార్జీలు బాదుతోంది. దీంతో పరోక్షంగా ఈ భారమంతా రైతులపైనే పడుతోంది.
ఎగుమతిదారులపై రైల్వే అదనపు భారం
ఖాళీ కంటైనర్లకు కూడా అంతే చార్జీలు వసూలు
దూరాభారం వల్ల ఏపీకి రాని ఉత్తరాది వ్యాపారులు
సీమ అరటికి ధర తగ్గడానికి ప్రధాన కారణం ఇదే
హాల్టేజ్ చార్జీలు రద్దు చేయాలన్న డిమాండ్
లేదా 50శాతం రాయితీ ఇవ్వాలని కేంద్రానికి ఉద్యానశాఖ లేఖ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఓ వైపు అరటికి ధర లేక రైతులు అల్లాడుతుంటే.. మరోవైపు అరటి ఎగుమతిదారులపై రైల్వేశాఖ అదనపు చార్జీలు బాదుతోంది. దీంతో పరోక్షంగా ఈ భారమంతా రైతులపైనే పడుతోంది. అరటి సహా అన్ని రకాల పండ్ల రవాణాకు రైళ్లలో రీఫర్ కంటైనర్ (శీతలీకరణ) పేరుతో రైల్వే శాఖ భారీగా చార్జీలు విధిస్తోంది. సరుకు తీసుకెళ్లడానికి వచ్చే ఖాళీ కంటైనర్లపైనా చార్జీలు వసూలు చేస్తోంది. ఒక్కో రైలుకు 40 ఏసీ కంటైనర్లు (బోగీలు) ఉంటే.. ఢిల్లీ, ముంబైకి రూ.1.20 లక్షల రైల్వేశాఖ చార్జీ వేస్తోంది. సాధారణంగా లోడ్ తీసుకెళ్లేటప్పుడు చార్జీలు వసూలు చేయడం సహజం. కానీ రైల్వే శాఖ సరుకు తీసుకెళ్లడానికి ఖాళీగా వచ్చిన కంటైనర్లకు కూడా హాల్టేజ్ చార్జీలు వసూలు చేస్తోంది. దీంతో పండ్ల ఉత్పత్తులు కొనుగోలు చేసి, రవాణా చేసే ఎగుమతిదారులు ఈ అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ కారణంగా ట్రేడర్లు రైతులకు ధర పెంచలేకపోతున్నారన్న వాదన ఉంది. ఎగుమతిదారులకు రైల్వే చార్జీల భారం తగ్గితే.. ఆ మేరకు రైతులకు మంచి ధర ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు.
భారంగా మారిన రైలు రవాణా..
వాస్తవంగా లారీల ద్వారా అనంతపురం, కడప జిల్లాల నుంచి ఢిల్లీ, ముంబై మార్కెట్లకు పండ్ల రవాణాకు రూ.90 వేలు ఖర్చవుతుంటే.. రైల్వే కంటైనర్లలో రూ.1.10 లక్షలు అవుతోంది. పైగా ఖాళీగా వచ్చే రైలుకు కూడా సరుకు చార్జీలు వసూలు చేస్తుండటంతో ట్రేడర్లకు ఖర్చులు రెట్టింపవుతున్నాయి. ఈ కారణంగా గతేడాది 70 శాతం పండ్ల ఉత్పత్తులు రోడ్డు మార్గానే ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అయ్యాయి. ఈ ఏడాది దాదాపు లక్షన్నర టన్నుల అరటి, ఇతర పండ్ల ఉత్పత్తులు మరో 50 వేల టన్నులు ఎగుమతి చేయాలని ఉద్యానశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రైల్వే చార్జీల భారంతో ట్రేడర్లు ఏపీకి రాకపోవడంతో రాయలసీమలో అరటి ధర తగ్గిపోయింది. ఈ ఏడాది మహారాష్ట్రలో అరటి సాగు, ఉత్పత్తి పెరగడంతో ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు ఏపీకి రాకుండా అక్కడి నుంచే కొనుగోలు చేశారు. దీంతో నెల రోజులుగా రాయలసీమలో అరటి కొనుగోళ్లు సాగక.. ధర పడిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోయారు.
రైల్వే అదనపు చార్జీలు ఎగుమతిదారులే భరించాల్సి వస్తుండటంతో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కన్నా చాలా దూరంలో ఉన్న ఏపీకి ట్రేడర్లు రాలేకపోతున్నారు. పంట ఉత్పత్తుల రవాణాకే ప్రత్యేకించి కేంద్రం ఏర్పాటు చేసిన కిసాన్ రైళ్లు ప్రారంభించిన 2020 ఆగస్టు నుంచే ఈ అదనపు చార్జీల భారం ఉండగా, గత వైసీపీ ప్రభుత్వం దీనిపై కేంద్రంతో చర్చించలేదని సమాచారం. కిసాన్ రైల్ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 116 సర్వీసుల ద్వారా 34 వేల టన్నుల పండ్ల ఉత్పత్తులను ఏపీ నుంచి రవాణా చేశారని అధికారులు చెప్తున్నారు. కానీ.. రాయలసీమ నుంచి రైళ్లలో పండ్ల రవాణా భారం కావడంతో ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు ఏపీకి రావడం లేదు. ఈ నేపథ్యంలో రాయలసీమ నుంచి అరటి, ఇతర పండ్ల ఉత్పత్తులను రవాణా చేసే రైళ్లలో అదనపు చార్జీలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఉద్యానశాఖ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఖాళీ కంటైనర్ల హాల్టేజ్ చార్జీలను మాఫీ చేయాలని కోరింది. తాజాగా గుజరాత్ నుంచి గ్రానైట్ రవాణా చేసే విషయంలో ఖాళీ కంటైనర్లకు 50 శాతం చార్జీలు తగ్గించిన రైల్వే శాఖ.. రైతులు ఎంతో కష్టపడి పండించే పండ్ల ఉత్పత్తుల రవాణా విషయంలో అదనపు చార్జీలు వసూలు చేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
80 శాతం ఉత్తరాది రాష్ట్రాలకే..
కాగా.. ఏపీలో అరటి 1.30 లక్షల హెక్టార్లలో పండిస్తున్నారు. 87.10 లక్షల టన్నుల పంట ఉత్పత్తి అవుతోంది. దేశంలోనే అరటి ఎగుమతిదారుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. రాయలసీమలో పండే అరటిలో 80 శాతం ఉత్తరాది రాష్ట్రాలకు, 18 శాతం లోకల్ మార్కెట్‌లో అమ్ముడవుతోంది. ఒక్కో ఏసీ కంటైనర్‌లో 20 టన్నుల సరుకు నింపుతారు. ఇలా ఒక్కో రైలు ద్వారా 800 టన్నులు రవాణా జరుగుతుంది. గతేడాది ఏపీ నుంచి 7 రైళ్లలో పండ్ల ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.