CID Sunil Kumar: రఘురామ టార్చర్ కేసులో కదలిక!
ABN , Publish Date - Nov 27 , 2025 | 05:30 AM
నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణరాజును లాక్‌పలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఎట్టకేలకు కదలిక వచ్చింది...
ఏ-1 సునీల్‌కుమార్‌కు నోటీసులు
4న గుంటూరు సీసీఎస్ కార్యాలయానికి రావాలని వాట్సాప్ సందేశం
నేడు స్వయంగా అందజేయనున్న పోలీసులు
గుంటూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణరాజును లాక్‌పలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. కేసులో ప్రధాన నిందితుడైన నాటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌కు బుధవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. డిసెంబరు 4న గుంటూరు సీసీఎస్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని వాట్సా్‌పలో పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు. గురువారం వారు స్వయంగా వాటిని అందజేయనున్నారు. ఈ కేసులో ఐపీఎస్ అధికారులతో పాటు మాజీ సీఎం జగన్ తదితరులు నిందితులుగా ఉండడంతో కేసు విచారణను అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం అప్పట్లోనే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన విజయనగరం ఎస్పీగా ఉన్నారు. 2021 మే 14న హైదరాబాద్‌లో జన్మదినం జరుపుకొంటున్న రఘురామరాజును సీఐడీ పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఆరోజు రాత్రి ఆయనపై సీఐడీ కార్యాలయంలో గుండెలపై కూర్చుని, లాఠీలతో కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని,.. గుండె ఆపరేషన్ చేయించుకున్నానని, మందులు వేసుకోవాలని ప్రాధేయపడినా వినిపించుకోకుండా తనను తీవ్రంగా హింసించి హత్యాయత్నం చేశారని రఘురామ ఆ తర్వాతి రోజు కోర్టులో మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. దెబ్బలకు వాచిపోయి ఉన్న అరికాళ్లను మేజిస్ట్రేట్‌కు చూపారు. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని న్యాయాధికారి ఆదేశించారు. ఆయన శరీరంపై దెబ్బల్లేవని నాటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి నివేదిక ఇచ్చారు. ఆమె భర్త రవికుమార్ వైసీపీ నాయకుడు కావడంతో ఆమెను నాటి ప్రభుత్వ పెద్దలు ప్రభావితం చేసి తప్పుడు నివేదిక ఇప్పించారని రఘురామఆరోపించారు. దీనిపై ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు తలుపులు తట్టడంతో చివరకు హైదరాబాద్‌లోని మిలిటరీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఆయన ఒంటిపై గాయాలు ఉన్నాయని వైద్యులు కోర్టుకు నివేదిక ఇచ్చారు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్లో రఘురామ ఫిర్యాదు చేయడంతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నాటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌ను ఏ-1గా, నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎ్‌సఆర్ ఆంజనేయులును ఏ-2గా, నాటి సీఎం జగన్‌ను ఏ-3గా, అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను ఏ-4గా, అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని ఏ-5గా చేర్చారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ను నియమించారు. కేసు విచారణలో భాగంగా విజయ్ పాల్‌ను విచారించి, అరెస్టు చేశారు. అలాగే రఘురామపై కస్టడీలో దాడి చేసిన తులసిబాబును అరెస్టు చేశారు. రఘురామకు చిత్రహింసల సమయంలో నాటి సీఐడీ డీఐజీగా ఉన్న సునీల్‌నాయక్ ఆ తర్వాత తన సొంత క్యాడర్ రాష్ట్రమైన బిహార్‌కు వెళ్లిపోయారు. ఈ ఏడాది మార్చిలో ఆయనకూ పోలీసులు నోటీసులు జారీచేయగా.. ఆయన అక్కడి కోర్టు నుంచి మినహాయింపు ఆదేశాలు పొందారు.