స్వర్ణ పల్లకీలో రాఘవేంద్రుడు
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:00 AM
రాఘవేంద్ర స్వామి స్వర్ణపల్లకిలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కిక్కిరిసింది.

మంత్రాలయం, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి స్వర్ణపల్లకిలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కిక్కిరిసింది. రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి పొందిన గురువారం శుభదినాన్ని పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్ణ పల్లకీలో రాఘవరాయుడి బృందావన ప్రతిమను అధిష్టించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. భక్తులు గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మాధవరం, నాగలదిన్నె, ఎమ్మిగనూరు రోడ్లు వాహనాలతో నిండిపోయాయి.
రాఘవరాయుడికి స్వర్ణ కవచ సమర్పణ
వేద పండితుల మంత్రోచ్ఛారణాలు, మంగళవాయిద్యాల మధ్య రాఘవ్రేంద స్వామి మూల బృందావనానికి బంగారు కవచం సమర్పణ సేవ వైభవంగా నిర్వహించారు. రాఘవేంద్రస్వామి సజీవసమాధి పొందిన గురువారం శుభదినాన్ని పురస్కరించుకొని పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. బంగారు, వెండి, పట్టు వస్ర్తాలు, బెంగుళూరు నుంచి తెచ్చిన ప్రత్యేక పుష్పాలు, బంగారు కవచంతో అలంకరించారు.
మఠానికి విరాళం
రాఘవేంద్రస్వామి మఠానికి బెంగళూరుకు చెందిన ధనరాజ్ రూ. లక్ష, ఎంబీ నాగరాజు అనేభక్తులు రూ. రెండు లక్షలు దైనందిక సేవకు విరాళంగా ఇచ్చినట్లు మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజరు వెంకటేష్ జోషి, సురేష్ కోణాపూర్ తెలిపారు. గురువారం వేర్వేరు సమయాల్లో కుటుంబ సమేతంగా రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని నగదు రూపంలో విరాళం ఇచ్చినట్లు తెలిపారు. విరాళం ఇచ్చిన దాతల కుటుంబానికి పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు రాఘవేంద్ర స్వామి మెమెంటో ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జేపీ స్వామి, నరసింహ దేశాయ్, గిరిధర్, శ్రీపాధ ఆచార్ పాల్గొన్నారు.