రాఘవేంద్రా.. కష్టాలు కనవా..!
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:47 PM
తుంగభద్రకు వరద పోటెత్తింది. గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలు ద్వారా వరద నీటిని ఎత్తిపోసి నిల్వ చేసి ఉంటారు..?
తుంగభద్ర నుంచి 333 టీఎంసీలు దిగువకు వదిలేశారు
గురురాఘవేంద్ర లిఫ్టులు ఉన్నా ఎత్తిపోయలేని దైన్యం
విద్యుత పంపులు, కాపర్ వైరు దోచుకెళ్లిన దుండగులు
నిరుపయోగంగా నాలుగు ఎత్తిపోతల పథకాలు
నిర్వహణ, మరమ్మతులకు రూ.17.05 కోట్లు ప్రతిపాదనలు
నిధులు ఇవ్వని ప్రభుత్వం
కర్నూలు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): తుంగభద్రకు వరద పోటెత్తింది. గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలు ద్వారా వరద నీటిని ఎత్తిపోసి నిల్వ చేసి ఉంటారు..? మెట్ట పొలాలకు సాగునీటికి కష్టాలు ఉండవు..? పల్లెసీమలు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి..! అనుకుంటే మాత్రం పొరపాటే. కళ్ల ఎదుటే తుంగభద్ర పరవళ్లు తొక్కినా ఎత్తిపోసుకోలేని ధైన్యపరిస్థితి ఉంది. కారణం.. వివిధ ఎత్తిపోతల పథకాల పంపులు, విద్యుత ట్రాన్సఫార్మర్లు, ప్యానల్ బోర్డులు ధ్వంసం చేసి కాపర్‌వైరు, పవర్ ఆయిల్ దోచుకెళ్లారు. వాటికి ఇంతవరకూ మరమ్మతులు చేయలేదు. ఏడేళ్లుగా ఆపరేషన అండ్ మెయింటెనెన్స (ఓ అండ్ ఎం) కోసం నిధులు ఇవ్వడం లేదు. మరమ్మతులు, నిర్వహణకు రూ.17 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపితే వివిధ కొర్రీలు పెట్టి రెండుసార్లు వెనక్కి పంపించారు. ఈ ఏడాది సుంకేసుల బ్యారేజీ నంచి 333 టీఎంసీలు తుంగభద్ర వరద దిగువకు వదిలేశారు. గత వైసీపీ ప్రభుత్వం తరహాలోనే కూటమి ప్రభుత్వం కూడా గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలపై నిర్లక్ష్యం కరువు రైతులను కన్నీటిపాలు చేస్తుంది. గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాల దుస్థితిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో వివిధ గ్రామాలకు తుంగభద్ర జలాలు ఎత్తిపోసి ఎల్లెల్సీ చివరి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. ఆయా నియోజకవర్గాల్లో 66,815 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం. పులికనుమ, పులకుర్తి ఎత్తిపోతల పథకాలు 15 ఏళ్లు కాంట్రాక్ట్ సంస్థ నిర్వహణలో ఉన్నాయి. మూగలదొడ్డి, బలసదొడ్డి, పులచింత, మాధవరం, చిలకలడోణ, సోగనూరు, దుద్ది లిఫ్టులు జలవనరుల శాఖ, కృష్ణదొడ్డి, రేమట, మునగాల, కంబదహాల్, చింతమానుపల్లె ఎత్తిపోతల పథకాలు ఏపీ స్టేట్ ఇరిగేషన డెవల్‌పమెంట్ కార్పొరేషన (ఏపీఎ్‌సఐడీసీ) పర్యవేక్షణలో ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వీటి నిర్వహణకు ఐదేళ్లు ఒక్కపైసా ఇవ్వలేదు. ఆపరేటర్లు, కాపల సిబ్బంది (వాచ అండ్ వార్డు) కూడా లేరు. దోపిడి దొంగలు పలు లిఫ్టుల పంప్‌హౌ్‌సలో పంపులు, ట్రాన్సఫార్మర్లు ధ్వంసం చేసి కాపర్ వైరు, అయిల్ దోచుకెళ్లారు.
ఫ నిధులు ఇవ్వలేక కొర్రీలు
కూటమి ప్రభుత్వం రావడంతో గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాల నిర్వహణ కష్టాలు తీరుతాయని రైతులు ఆశించారు. 15 నెలలు గడిచినా ఆ దిశగా చర్యలు శూన్యం. శాశ్వత మరమ్మతులు, ఆపరేషన అండ్ మెయింటెనెన్స (ఓ అండ్ ఎం) కోసం రూ.17.05 కోట్లు ఇవ్వాలని 2024 నవంబరు 1న రాష్ట్ర జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపించారు. మరమ్మతులు, ఓ అండ్ ఎం ప్రతిపాదనలు వేరువేరుగా పంపించాలని కొర్రీ పెట్టి వెనక్కి పంపించారు. రాష్ట్ర అధికారుల సూచన మేరకు 2024-25 ఎస్‌ఎ్‌సఆర్ రేట్లతో ఈ ఏడాది ఏప్రిల్‌లో మరోసారి ప్రతిపాదనలు పంపారు. తాజాగా జూలై నుంచి అమలులోకి వచ్చిన 2025-26 ఎస్‌ఎ్‌సఆర్ రేట్ల ప్రకారం ప్రతిపాదనలు పంపాలని కొర్రీ పెట్టి మళ్లీ వెనక్కి పంపించారు. నిధులు ఇవ్వకుండా కావాలనే కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నూతన ఎస్‌ఎ్‌సఆర్ రేట్ల ప్రకారం మూడో పర్యాయం ప్రతిపాదనలు పంపించేందుకు ఇంజనీర్లు కసరత్తు చేస్తున్నారు. అప్పుడైనా నిధులు ఇస్తారా..? మరో కొర్రీ పెట్టి వెనక్కి నెట్టేస్తారా..? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఫ మరి మరమ్మతులు ఎప్పుడు?
మూగలదొడ్డి, మాధవరం స్టేజ్-1, స్టేజ్-2, బసలదొడ్డి స్టేజ్-1, చిలకలడోణ స్టేజ్-1, స్టేజ్-2, సోగనూరు స్టేజ్-1, పులచింత స్టేజ్-1, స్టేజ్-2 ఎత్తిపోతల పథకాలు పంప్‌హౌస్ దగ్గర 1000 కేవీ విద్యుత ట్రాన్సఫార్మర్లు ఽధ్వంసం చేశారు. మాధవరం స్టేజ్-1 లిఫ్ట్‌లో హెచటీ, ఎల్‌టీ ప్యానల్ బోర్డులు, స్టార్టర్లు, బలసదొడ్డి స్టేజ్-1 పంప్ హౌస్‌లో ప్యానల్ బోర్డులు ధ్వంసం చేసి విలువైన కాపర్ వైర్, కాయిన్స, పవర్ ఆయిల్ దోచుకెళ్లారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కడపకు చెందిన ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ సంస్థ ఎండీ శివశంకర్‌రెడ్డి ధ్వంసం చేసిన ట్రాన్సఫార్మర్లు పరిశీలించి వాటిని మరమ్మతులు చేయడం సాధ్యపడదని, కొత్త ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చారు. పలు ఎత్తిపోతల పథకాలు సింగిల్ ట్రాన్సఫార్మర్లతో తాత్కాలికంగా రన చేసే అవకాశం ఉన్నా, మాధవరం స్టేజ్-1, 2, బసలదొడ్డి స్టేజ్-2, చికలడోన స్టేజ్-1, స్టేజ్-2, పులచింత స్టేజ్-2 ఎత్తిపోతల పథకాలు పూర్తిగా పడకేశాయి. వాటి శాశ్వత మరమ్మతులు ఎప్పుడు చేస్తారు..? అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఫ వివిధ ఎత్తిపోతల పథకాలు మరమ్మతులు, నిర్వహణ ప్రతిపాదనలు (రూ.కోట్లల్లో):
------------------------------------------
ఎత్తిపోతల పథకం అంచనా
(రూ.కోట్లలో)
------------------------------------------
మూగలదొడ్డి 1.53
బసలదొడ్డి 2.66
పులచింత 3.93
మాధవరం 2.14
చిలకలడోణ 2.25
సోగనూరు 3.64
దుద్ది 0.89
------------------------------------------
మొత్తం 17.05
------------------------------------------
ఫ ప్రతిపాదనలు పంపుతున్నాం
- బాలచంద్రారెడ్డి, ఇరిగేషన సర్కిల్ ఎస్‌ఈ, కర్నూలు
గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలు మరమ్మతులు, నిర్వహణ కోసం ప్రభుత్వానికి రూ.17 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. 2025-26 ఎస్‌ఎ్‌సఆర్ రేట్ల ప్రకారం మళ్లీ ప్రతిపాదనలు పంపాలని సూచనలతో ఫైలు వెనక్కి పంపించారు. పంపులు తాజాగా రేట్లకు కొటేషన తీసుకొని ప్రభుత్వం సూచనల మేరకు నూతన ఎస్‌ఎ్‌సఆర్ రేట్లకు ప్రతిపాదనలు తయారు చేసి త్వరలోనే ప్రభుత్వానికి పంపుతాం. నిధులు రాగానే మరమ్మతులు చేపడుతాం.