ఎనక్లోజర్‌లోని దుప్పిలపై రేస్ కుక్కల దాడి
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:37 PM
నల్లమలలో మరో విషాదం చోటుచేసుకుంది. పులుల ఆహారం కోసం తీసుకొచ్చిన దుప్పిలను రేస్ కుక్కలు మట్టుపెట్టాయి.
ఆరు దుప్పిలు హతం
మరో 17 దుప్పిల మాయం?
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
ఆత్మకూరు, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): నల్లమలలో మరో విషాదం చోటుచేసుకుంది. పులుల ఆహారం కోసం తీసుకొచ్చిన దుప్పిలను రేస్ కుక్కలు మట్టుపెట్టాయి. ఇందులో అటవీ అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల కాలంలో నల్లమలలో పులి ఆహారమైన గడ్డితినే జంతువుల (హెర్బీవోర్స్) సంఖ్య తగ్గుముఖం పట్టడంతో వాటి సంఖ్యను సమతుల్యం చేసేందుకు అటవీశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈక్రమంలోనే ఇతర ప్రాంతాల నుంచి హెర్బీవోర్స్‌ను నల్లమలకు రప్పించి పులి ఆహారానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇటీవల శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం పరిసర ప్రాంతాల్లో సంరక్షణలో ఉన్న 23 దుప్పిలను నల్లమలకు తీసుకొచ్చారు. వాటిని ఆత్మకూరు అటవీ డివిజన పరిధిలోని బైర్లూటి రేంజ్‌లో గల సుద్దకుంట పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణుల ఆవాసంలోని ఎనక్లోజర్‌లో ఉంచారు. కానీ ఎనక్లోజర్‌లో ఊహించని విషాదం చోటు చేసుకోవడంతో అటవీ అధికారులు సైతం కలవరపాటుకు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు.
రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఎనక్లోజర్
బైర్లూటి రేంజ్ పరిధిలో తొలిసారిగా రెండున్నర ఎకరాల్లో రూ.12లక్షల వ్యయంతో దుప్పిల కోసం ప్రత్యేకమైన ఎనక్లోజర్‌ను ఏర్పాటు చేశారు. ఆరు అడుగుల ఎత్తులో ఇనుప ఫెన్షింగ్‌తో పాటు అవి బయటకు కనిపించకుండా గ్రీన మెష్‌తో కప్పి ఉంచారు. లోపలకు వచ్చేందుకు.. బయటకు వెళ్లేందుకు ద్వారాలను ఏర్పాటు చేశారు. అదేక్రమంలో ఎనక్లోజర్‌లో అడవి తలపించే ప్రాంతంతో పాటు సహజ సిద్దమైన నీటి వనరులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఎనక్లోజర్‌లో సుమారు మూడు వారాల పాటు దుప్పిలను బంధించి అవి అడవిలో సహజసిద్ధంగా జీవనం సాగించే విధంగా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎనక్లోజర్‌లో ఉన్న దుప్పిలు అడవిలో జీవించగలుతాయన్న నమ్మకం కలిగినప్పుడు వాటిని అడవుల్లో వదిలేస్తారు.
ఆరోజు రాత్రి ఏం జరిగిందంటే..
ఈ నెల 8వ తేది రాత్రి ఎనక్లోజర్‌లో దుప్పిలు ఉన్నట్లు గుర్తించిన రేస్ కుక్కలు ఇనుప ఫెన్షింగ్ ఎక్కి మరీ అందులోకి ప్రవేశించి దాడి చేశాయి. వాటి అరుపులను గమనించిన అక్కడున్న సిబ్బంది అప్పటికప్పుడు ఎనక్లోజర్ ద్వారాలను తెరచడంతో మరికొన్ని దుప్పిలు అక్కడి నుంచి తప్పించుకున్నాయి. కాగా ఆ సమయంలో ఓ చిరుతపులి ఓ దుప్పిని ఎత్తుకెళ్లినట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి ఆరు దుప్పిలు హతమైనట్లు అటవీ అధికారులు గుర్తించి వాటి కళేబరాలకు వెటర్నరీ డాక్టర్లచే పోస్టుమార్టం చేసి వాటిని ఎనక్లోజర్ సమీపంలో దహనం చేశారు. అయితే రేస్ కుక్కలు ఉన్న ప్రదేశంలో దుప్పిలకు రక్షణ లేకుండా ఎనక్లోజర్‌ను ఏర్పాటు చేయడం, అది కూడా తక్కువ ఎత్తులో ఇనుప ఫెన్షింగ్ ఉంచడంపై విమర్శలు ఉన్నాయి.
ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు
- అబ్దుల్ రవూఫ్, డిప్యూటీ డైరెక్టర్, ఆత్మకూరు
నాగార్జునసాగర్-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పరిధిలో ఇప్పటికే పలు డివిజన్లలో ఎనక్లోజర్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యతలో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాము. అదేక్రమంలో ఎనక్లోజర్ ఇనుపు ఫెన్షింగ్ ఎత్తును పెంచడంతో పాటు అందులోకి ఇతర వన్యప్రాణులు ప్రవేశించకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశాము. బైర్లూటి రేంజ్ పరిధిలో నల్లకాల్వ సమీపంలో మరో ఎనక్లోజర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాము. దీనిని 8 అడుగుల ఎత్తు వరకు ఇనుప ఫెన్షింగ్‌తో తయారు చేస్తున్నాము.