Pension Issues: ఐఏఎస్‌లు-ప్రభుత్వ పెద్దలకు మధ్య క్విడ్ ప్రోకో
ABN , Publish Date - Sep 30 , 2025 | 06:05 AM
ఐఏఎస్ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మధ్య క్విడ్ ప్రోకో జరుగుతోందేమోనని ఏపీసీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు...
వైసీపీ సర్కారు విధానాలే అనుసరిస్తున్న కూటమి
ఏపీసీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆరోపణ
విజయవాడ(గాంధీనగర్), సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఐఏఎస్ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మధ్య క్విడ్ ప్రోకో జరుగుతోందేమోనని ఏపీసీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్, కె. రాజేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వ విధానాలనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరిస్తోందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా జారీ చేసిన మెమో 57ను.. అప్పటి సర్కారు పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు ఐఏఎస్ అధికారులకు అమలు చేశారని తెలిపారు. అదే జీవో పరిధిలోకి వచ్చి, పాత పెన్షన్‌కు అర్హులైన 11 వేల మంది రాష్ట్ర ఉద్యోగులను విస్మరించారని ఆరోపించారు. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం జీవో 1793 జారీ చేసి, రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న అఖిల భారత సర్వీసెస్ ఉద్యోగులకు మాత్రమే నెలవారి మ్యాచింగ్ గ్రాంట్‌ను 10 నుంచి 14 శాతానికి పెంచిందని విమర్శించారు. సీపీఎస్ రద్దుపై అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నా స్పందించని గత, ప్రస్తుత ప్రభుత్వాలు కేవలం అఖిల భారత సర్వీసెస్ అధికారులకుపై ప్రేమ చూపేందుకు ‘క్విడ్ ప్రోకో’నే కారణమనే అభిప్రాయం ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోందని తెలిపారు.