Share News

SIT Investigation: కల్తీ నెయ్యేనని తెలిసీ ఎలా అనుమతించారు

ABN , Publish Date - Nov 12 , 2025 | 05:57 AM

తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అవుతోందని తెలిసి కూడా ఎలా అనుమతించారు... కనీసం నెయ్యి ఎక్కడి నుంచీ ఎవరు సరఫరా చేస్తున్నారనేది కూడా పట్టించుకోలేదా....

 SIT Investigation: కల్తీ నెయ్యేనని తెలిసీ ఎలా అనుమతించారు

  • శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలీదా?.. ఒక్కో ట్యాంకర్‌కు ఎంత కమీషన్‌ ముట్టింది?

  • గతంలో పనిచేసినప్పుడూ ఇలాగే చేశారా?.. ధర్మారెడ్డిపై సిట్‌ ప్రశ్నల వర్షం

తిరుపతి/తిరుపతి(నేరవిభాగం), నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అవుతోందని తెలిసి కూడా ఎలా అనుమతించారు? కనీసం నెయ్యి ఎక్కడి నుంచీ ఎవరు సరఫరా చేస్తున్నారనేది కూడా పట్టించుకోలేదా? కల్తీ నెయ్యి సరఫరాలో ఒకో ట్యాంకర్‌కు కమీషన్‌ ఎంత ముట్టింది..’ అంటూ టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ప్రశ్నల వర్షం కురిపించింది. గత ప్రభుత్వంలో టీటీడీని కనుసైగతో శాసించిన ఆయన ఎట్టకేలకు కల్తీ నెయ్యి కేసులో మంగళవారం విచారణకు హాజరయ్యారు. పనిచేసిన ఐదేళ్లూ దేవస్థానంలో అధికారులను, ఉద్యోగులను గడగడలాడించిన ఆయన.. సిట్‌ కార్యాలయానికి వచ్చిన తీరు ఆసక్తికరంగా ఉంది. తననెవరూ గుర్తుపట్టకుండా.. తమిళనాడు రిజిస్ట్రేషన్‌ కలిగిన వాహనంలో వచ్చారు. తలకు టోపీ, ముఖానికి మాస్కు, నల్ల కళ్లద్దాలు ధరించారు. తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్సు ఆవరణలోని సిట్‌ కార్యాలయంలోకి వెళ్లిన ఆయన్ను అక్కడున్న అధికారులు తొలుత గుర్తించలేకపోయారు. ఎవరు మీరని ప్రశ్నించగా.. టోపీ, మాస్కు, కళ్లద్దాలు తొలగించి తాను ధర్మారెడ్డినని చెప్పారు. దీంతో అధికారులు ఆయనను సీబీఐ డీఐజీ చాంబర్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఉదయం 10.42 గంటలకు సిట్‌ కార్యాలయంలోకి వెళ్లిన ధర్మారెడ్డిని మధ్యాహ్నం 2 గంటల వరకూ విశాఖ సీబీఐ డీఐజీ మురళి రాంబా విచారించారు. మధ్యాహ్నం 2.05 గంటలకు మాజీ ఈవో టోపీ, మాస్కు, నల్లకళ్లద్దాలు లేకుండా మామూలుగానే బయటకు వచ్చారు. తిరిగి 3 గంటలకు సిట్‌ కార్యాలయంలోకి వెళ్లారు. రాత్రి 9.15 గంటల వరకూ విచారణ సాగింది. బుధవారం కూడా ఆయన్ను ప్రశ్నించే అవకాశముందని సిట్‌ వర్గాలు వెల్లడించాయి.


లోతుగా విచారణ...

విశ్వసనీయ సమాచారం మేరకు.. సిట్‌ అధికారులు ధర్మారెడ్డిని లోతుగా విచారించారు. కొన్ని అంశాల్లో ఆయన పాత్రపై సూటిగా ప్రశ్నించారు. కోట్లాది మంది భక్తులు పవిత్రంగా స్వీకరించే శ్రీవారి లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అవుతోందని ఎపుడు గుర్తించారనే ప్రశ్నతో మొదలుపెట్టారు. ‘కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని తెలిసినా లడ్డూల తయారీకి ఎలా అనుమతించారు? కల్తీ విషయం తెలియక ముందు ఎన్ని ట్యాంకర్లు అనుమతించారు? తెలిశాక ఎన్ని అనుమతించారు? బాధ్యత కలిగిన ఈవో పోస్టులో ఉండి ఈ వ్యవహారాన్ని ఎందుకు పట్టించుకోలేదు? భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలియదా? కల్తీ నెయ్యి అనుమతించేందుకు ఎలా ధైర్యం చేశారు? టీటీడీలో గతంలో పనిచేసినప్పుడు కూడా ఇలాగే చేశారా? కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి ఒక్కో ట్యాంకర్‌కు కమీషన్‌ ఎంత ముట్టింది’ అని ప్రశ్నించారు. టీటీడీలో నెయ్యి నాణ్యత నిర్ధారించే సదుపాయం లేనప్పుడు ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా అని అడిగారు. భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌ నుంచి బహుమానాలుగా ఏమి ముట్టాయని కూడా ప్రశ్నించారు. ‘టీటీడీ చీఫ్‌ మీరే కదా? ఏ చిన్న తప్పు జరిగినా మీదే కదా బాధ్యత? ఒకవేళ కిందిస్థాయి ఉద్యోగులు తప్పు చేశారని అనుకున్నా మీరెలా ఊరుకున్నారు?’ అని అడుగగా.. ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్లతో నెయ్యి సరఫరాను అనుమతించాల్సి వచ్చిందని, ఆ విషయంలో తన తప్పేమీ లేదని చెప్పినట్టు తెలిసింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశమేదీ తనకు లేదని సమాధానమిచ్చినట్టు తెలిసింది.


సిట్‌ ముందుకు భోలేబాబా యజమానులు

ఇంకోవైపు.. కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితులైన పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌ను కూడా మంగళవారం సిట్‌ అధికారులు విచారించారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం భగవాన్‌పూర్‌లోని మెస్సర్స్‌ భోలేబాబా డెయిరీ యజమానులైన వీరిద్దరూ కల్తీ నెయ్యి కేసులో ఏ-3, ఏ-4గా ఉన్న సంగతి తెలిసిందే. భోలేబాబా డెయిరీ నుంచీ వీరు సరఫరా చేసిన నెయ్యి నాసిరకంగా ఉందని, కల్తీని గుర్తించిన టీటీడీ ఈ డెయిరీ నెయ్యిని తిరస్కరించి బ్లాక్‌ లిస్టులో పెట్టడంతో.. వీరిద్దరూ తిరుపతి జిల్లాలోని వైష్ణవి డెయిరీ డైరెక్టర్లుగా చేరి ఆ డెయిరీ ద్వారా తాము తయారు చేయించే కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేస్తూ వచ్చారు. వైష్ణవి డెయిరీకి తోడుగా తమిళనాడు దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీని కూడా ముగ్గులోకి దింపారు. ఆ డెయిరీ పంపిన ట్యాంకర్ల ద్వారానే కల్తీ నెయ్యి వ్యవహారం గుట్టు రట్టయింది. ఈ కేసులో తొలుత అరెస్టయిన ఈ ఇద్దరూ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. వీరిద్దరికీ నకిలీ నెయ్యి తయారీ కోసం అవసరమైన రసాయనాలను సరఫరా చేసిన ఢిల్లీ వాసి అజయ్‌కుమార్‌ సుగంధ్‌ను సిట్‌ ఈ కేసులో 16వ నిందితుడిగా గుర్తించి ఇటీవల అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో వారిద్దరికీ నోటీసులు జారీ చేసి.. మంగళవారం పిలిపించి విచారణ జరిపింది. టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈనెల 14 లేదా 15వ తేదీన విచారణకు హాజరవుతానని సిట్‌కు ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.


చిన్నఅప్పన్న కస్టడీ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా ఆయన్ను కస్టడీలో విచారించేందుకు అనుమతి కోరుతూ సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై నెల్లూరు ఏసీబీ కోర్టు మంగళవారం విచారణ జరిపింది. సిట్‌ తరఫున ఏపీపీ జయశేఖర్‌, చిన్న అప్పన్న తరపున న్యాయవాది యుగంధర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు న్యాయాధికారి ప్రకటించారు. 14వ తేదీన తీర్పు వెల్లడించే అవకాశముంది. కాగా.. చిన్న అప్పన్నకు బెయిల్‌ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ జరగనుంది.

శ్రీవారి ప్రసాదాన్ని అవమానించారు: కిరణ్‌ రాయల్‌

టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అవమానించారని కిరణ్‌ రాయల్‌ ఆరోపించారు. కల్తీ నెయ్యి కేసు విచారణకు హాజరైన ఆయనకు ఒక భక్తుడిగా శ్రీవారి లడ్డూను అందజేసేందుకు ప్రయత్నించానని.. దానిని చూడగానే ఆయన పారిపోయారని ఎద్దేవా చేశారు.


ధర్మారెడ్డికి శ్రీవారి లడ్డూ తినిపించబోయిన జనసేన నేత

మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ధర్మారెడ్డి సిట్‌ కార్యాలయం నుంచి వెలుపలికి రాగా జనసేన నేత కిరణ్‌ రాయల్‌ ఆయనకు శ్రీవారి లడ్డూను తినిపించే ప్రయత్నం చేశారు. సిట్‌ కార్యాలయం నుంచి వెలుపలికి వచ్చిన ధర్మారెడ్డి వాహనమెక్కి వెళ్తూ మీడియా ప్రతినిధులను చూసి ఆపించి కిందకు దిగారు. వారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా.. అంతకు ముందే వచ్చి వేచి చూస్తున్న కిరణ్‌ రాయల్‌ ఆయన వద్దకు వెళ్లి తమ కూటమి ప్రభుత్వంలో శ్రీవారి ప్రసాదాల రుచి, నాణ్యత ఎలా ఉందో చూడండంటూ శ్రీవారి లడ్డూను తినిపించేందుకు నోటి వద్ద పెట్టారు. అయితే ధర్మారెడ్డి ఆయన చేతిని నెట్టేసి.. మీడియాతో మాట్లాడకుండానే తిరిగి వాహనం ఎక్కి వెళ్ళిపోయారు.

Untitled-7 copy.jpg

Updated Date - Nov 12 , 2025 | 06:00 AM