Quantum Computer Valley: జనవరికల్లా రెండు క్వాంటమ్ కంప్యూటర్లు
ABN , Publish Date - Sep 17 , 2025 | 04:11 AM
అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రముఖ ఐబీఎం సంస్థ వచ్చే జనవరి కల్లా రెండు క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటు చేయనుందని, 2027 నాటికి మరో మూడు కంప్యూటర్లను...
ఆర్టీజీఎ్‌సకు మెరికల్లాంటి యువ అధికారులు: సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రముఖ ఐబీఎం సంస్థ వచ్చే జనవరి కల్లా రెండు క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటు చేయనుందని, 2027 నాటికి మరో మూడు కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకొస్తుందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్), ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల కార్యదర్శి కాటంనేని భాస్కర్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు రెండో రోజైన మంగళవారం ఆయన అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీని క్వాంటమ్ కంప్యూటింగ్‌కు హబ్‌గా మార్చే దిశగా పనిచేస్తున్నామని, దీనికోసం రెండు దశల రోడ్ మ్యాప్ రూపొందించామని చెప్పారు. 2030 నాటికల్లా అమరావతి క్వాంటమ్ వ్యాలీ నుంచి ఏటా రూ.5వేల కోట్ల మేర క్వాంటమ్ హార్డ్‌వేర్ ఎగుమతులు సాధించడమే తమ లక్ష్యమన్నారు. రూ.1000 కోట్ల ప్రోత్సాహకాలతో క్వాంటమ్ వ్యాలీలో 100 స్టార్ట్‌పలు ఏర్పాటు చేస్తామన్నారు. క్వాంటమ్ వ్యాలీ రాకతో రాష్ట్రంలో నిర్మాణాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. జిల్లాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ రాయబారులు కలెక్టర్లేనని అన్నారు. రాజధానిలో 50 ఎకరాల్లో అమరావతి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం సీఆర్‌డీఏ భూమిని కేటాయించిందని చెప్పారు. భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను కూడా సిద్ధం చేశామన్నారు. ఇక్కడ దాదాపు 90 వేల మంది వరకు పనిచేయవచ్చని చెప్పారు. క్వాంటమ్ వ్యాలీకి ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రఖ్యాత సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. రియల్‌టైమ్ గవర్నెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో భాగమైన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా 2020 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పి.ధాత్రిరెడ్డిని, ఫైబర్‌నెట్ ఎండీగా గీతాంజలి శర్మను, డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా సౌర్యమాన్ పటేల్‌ను నియమించామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వీరంతా మెరికల్లాంటి యువ ఐఏఎస్ అధికారులని ప్రశంసించారు. అమరావతిలో నిర్మించే క్వాంటమ్ వ్యాలీ భవన డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు.