Amaravati: క్వాంటమ్ వ్యాలీ.. వడివడిగా
ABN , Publish Date - Nov 06 , 2025 | 03:57 AM
రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వడివడిగా రూపుదిద్దుకుంటోంది. వచ్చే ఏడాది జనవరి 1న దీని ప్రారంభోత్సవానికి పెద్దఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి.
జనవరి 1న ప్రారంభోత్సవానికి సన్నాహాలు
50 వేల మంది విద్యార్థులకు మౌలిక క్వాంటమ్ నైపుణ్యాల్లో శిక్షణ
వీరిలో 3 వేల మందికి అత్యున్నత శిక్షణ.. 100 మంది ఉన్నత
పరిశోధకుల తయారీ.. శాశ్వత టాలెంట్ హబ్ ఏర్పాటే లక్ష్యం
టీచింగ్ ల్యాబ్‌లపై 108 సంస్థల ప్రతిపాదనలు
197 వర్సిటీల్లో శిక్షణ పొందిన 1,056 మంది ఫ్యాకల్టీ సిద్ధం
అమరావతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వడివడిగా రూపుదిద్దుకుంటోంది. వచ్చే ఏడాది జనవరి 1న దీని ప్రారంభోత్సవానికి పెద్దఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. పరస్పర సహకారం, గ్లోబల్ భాగస్వామ్యం ప్రాతిపదికన పలు అంతర్జాతీయ సాంకేతిక సంస్థలు జాతీయ స్థాయిలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. అంతర్జాతీయ స్థాయిలో తొలి ఐదు క్వాంటమ్ హబ్‌లలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఒకటిగా నిలుస్తుందని తెలిపాయి. రాష్ట్రం సంపూర్ణంగా క్వాంటమ్ సేవలను అందించే కేంద్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తంచేశాయి. సెమీకండక్టర్ల తయారీ, వినియోగం, కృత్రిమ మేధ ఆధారిత సేవలు, భవిష్యత్ తరాలకు ఏఐ/ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, ఆర్‌ఎఫ్ ఇంజనీరింగ్, క్వాంటమ్ మెటీరియల్స్‌లో రాష్ట్ర విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దడమే క్వాంటమ్ వ్యాలీ ఉద్దేశం.
భాగస్వామ్య సంస్థ.. ప్రాజెక్టులివీ..
అమెరికాకు చెందిన విసెర్ సంస్థ అమరావతిలో క్వాంటమ్ ట్యాలెంట్ హబ్‌ను నెలకొల్పుతుంది. 50 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. 100 మంది అత్యున్నత స్థాయి పరిశోధకులను తయారుచేస్తుంది.
ఎన్‌వీఐడీఐఏ సంస్థ ఏఐ, క్వాంటమ్ సిమ్యులేషన్ ప్లాట్‌ఫాంలను సమీకృతం చేస్తుంది. రాజధానిలో హైబ్రిడ్ సూపర్ కంప్యూటింగ్ స్టోరేజ్‌ను నిర్మిస్తుంది.
ఏడబ్ల్యూఎస్ సంస్థ అమరావతి ఏడబ్ల్యూఎస్ యాక్సిలరేటర్‌ను ప్రారంభిస్తుంది. 50వేల మంది యువత, మహిళలకు ఏడబ్ల్యూఎస్ బ్రాకెట్ ద్వారా సర్టిఫికెట్లు జారీచేస్తుంది.
క్వాంట్రోలాక్స్ సంస్థ రూ.25 కోట్లతో ‘విద్యాకర్’ ప్లాట్‌ఫాంను నిర్మిస్తుంది. ఇది ఓపెన్-ఆర్కిటెక్చర్ బెంచ్‌మార్క్ సిస్టమ్.
పీక్యూ స్టేషన్ సంస్థ టెస్ట్‌బెడ్, డెమోల్యాబ్‌లతో కూడిన పోస్ట్-క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ హబ్‌ను నెలకొల్పుతుంది.
ఈ సంస్థల సహకారంతో 50వేల మందికిపైగా విద్యార్థులకు మౌలిక క్వాంటమ్ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం, వీరిలో 3వేల మందికి అత్యున్నత శిక్షణ, గ్లోబల్ పరిశోధన, అభివృద్ధికి 100మంది ఉన్నత పరిశోధకులను సన్నద్ధం చేయడం.. జాతీయ క్వాంటమ్ మిషన్, రాష్ట్ర క్వాంటమ్‌వ్యాలీకి ఉపకరించేలా శాశ్వత క్వాంటమ్ ట్యాలెంట్ హబ్ ఏర్పాటు లక్ష్యమని వెల్లడించాయి. 108 టీచింగ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు 108 సంస్థల నుంచి 134 ప్రతిపాదనలు, ఆల్గోరిథమ్ పరిశోధనకు 55 సంస్థల నుంచి 84 ప్రతిపాదనలు అందాయి. 197 వర్సిటీల్లో శిక్షణపొందిన 1,056మంది ఫ్యాకల్టీ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. 137 కాలేజీల నుంచి 1,127 హ్యాకథాన్ ఆలోచనలు తీసుకున్నారు. ఇందులో 3 వేల మందికిపైగా విద్యార్థులు పాలుపంచుకున్నారు’ అని వివరించాయి. దిమిరా (ఐఐటీ-బోంబే), ఇండ్‌రోబో, రియలిస్టిక్, క్వాంట్రోల్ స్పియర్, క్యూరియం వంటి స్టార్ట్‌పలు భారత తొలి క్వాంటమ్ సప్లయ్-చైన్ జిల్లా కోసం కంట్రోల్ ఎలకా్ట్రనిక్స్, వైరింగ్ వ్యవస్థలు, యాంప్లిఫయర్లను అభివృద్ధి చేస్తున్నాయి. క్యుబిట్స్ నుంచి చిప్‌ల వరకు ప్రతి లేయర్‌ను అమరావతిలో డిజైన్ చేసి తయారుచేస్తాయి. ‘ఒక్క ఏడాదిలోనే భావన నుంచి అమలు స్థాయికి.. విజన్ నుంచి విలువైన భాగస్వామ్యాల వరకు ఏపీ ఎదిగింది’ అని రాష్ట్ర ఐటీ-ఎలకా్ట్రనిక్స్ శాఖ వర్గాలు తెలిపాయి. ‘వ్యవస్థల స్థాపన, పరికరాల తయారీ, విద్యార్థులకు శిక్షణ, టెక్నాలజీ ఎగుమతులు తదుపరి అధ్యాయం. డీఆర్‌డీవోతో భాగస్వామ్యం నుంచి క్వాంటమ్ ఫ్యాబ్ ప్రతిపాదన వరకు.. ఫిజిత్సుతో జాయింట్ వెంచర్, పాస్కల్ సభ అభివృద్ధి నుంచి వైజర్ ప్రారంభం దాకా ప్రతి కార్యాచరణా భారత క్వాంటమ్ ఫౌండేషన్‌కు ఒక్కో ఇటుకరాయిలాంటిది. 2030నాటికి అమరావతి కేవలం క్వాంటమ్ కంప్యూటర్లనే గాక యావత్ పరిశ్రమకే కేంద్రంగా ఆవిర్భవిస్తుంది’ అని పేర్కొన్నాయి. భారత్.. ప్రపంచం కోసం భవిష్యత్‌ను నిర్మించే క్రమంలో ఏపీ నిర్మాణ కేంద్రంగా మారుతుందని తెలిపాయి.