Amaravati: రూ.104 కోట్లతో క్వాంటమ్ హబ్ భవనం
ABN , Publish Date - Oct 09 , 2025 | 04:31 AM
అమరావతిలో రూ. 104 కోట్లతో క్వాంటమ్ హబ్ భవనాన్ని నిర్మించేందుకు ఆమోదం లభించింది.
అమరావతిలో నిర్మాణానికి ఆమోదం
24న రాష్ట్రానికి ఫ్యూజీ టెక్ ప్రతినిధులు
పెట్టుబడులపై పరిశ్రమల శాఖతో చర్చలు
అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): అమరావతిలో రూ. 104 కోట్లతో క్వాంటమ్ హబ్ భవనాన్ని నిర్మించేందుకు ఆమోదం లభించింది. ఈ మేరకు వెలగపూడి సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ నిధులు భరిస్తే.. సీఆర్‌డీఏ భవనాన్ని నిర్మిస్తుంది. రెండేళ్లలో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి సీఆర్‌డీఏ అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరిలో ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వస్తుంది. క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం పూర్తయ్యేంత వరకూ ఆ కంప్యూటర్‌ను విట్ వర్సిటీ ప్రాంగణంలో ఉంచుతారు.
పెట్టుబడులకు ఫ్యూజీ టెక్ ఆసక్తి
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన ఫ్యూజీ టెక్ ఆసక్తి చూపుతోంది. ఎస్కలేటర్లు, ఎలివేటర్లు, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మ్ వంటి రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన ఆ సంస్థ ప్రతినిధులు ఈనెల 24న రాష్ట్రానికి రానున్నారు. ఐటీ, పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరపనున్నారు. కాగా, విశాఖలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్‌ను ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ ఆమోద ముద్ర వేసింది. దీనికి శుక్రవారం జరగనున్న క్యాబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేసిన వెంటనే.. భూ కేటాయింపులతో సహా ఇతర ప్రోత్సాహకాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తూ ఉత్తర్వులను ఇవ్వనుంది. అదేవిధంగా.. రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటర్‌ను తయారు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక ఐటీ నిపుణులను ప్రోత్సహించేందుకు.. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌రంగ నిపుణులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇచ్చేలా పాలసీని కూడా ఐటీ శాఖ క్యాబినెట్ ముందు ఉంచనుంది. ఈ పాలసీని కూడా ఈనెల 10న విడుదల చేయనున్నారు.