Quantum Computing: వడివడిగా క్వాంటమ్ బాట
ABN , Publish Date - Jun 30 , 2025 | 02:50 AM
జాతీయ స్థాయిలో ప్రప్రథమంగా రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి నుంచి మెరుపు వేగంతో కూడిన సాంకేతిక నైపుణ్యం.. క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోనికి రానున్నాయి.
జనవరి నుంచి క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు
అమరావతిలో టెక్ వ్యాలీ పార్కులోనే లక్షల మందికి ఉద్యోగావకాశాలు
ఇతర రాష్ట్రాలూ సేవలు వినియోగించుకునే వెసులుబాటు
అనేక రంగాల్లో విస్తృతంగా సేవలు.. నేడు సీఎం అధ్యక్షతన వర్క్‌షాప్
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో ప్రప్రథమంగా రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి నుంచి మెరుపు వేగంతో కూడిన సాంకేతిక నైపుణ్యం.. క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోనికి రానున్నాయి. ఇప్పటిదాకా క్లాసిక్ కంప్యూటింగ్ పేరిట సంప్రదాయ కంప్యూటర్ సిస్టమ్ ప్రొగ్రామింగ్ మొత్తం.. మేథమెటిక్స్‌పైనే ఆధారపడి ఉంటోంది. అందువల్ల సమస్యలను పరిష్కరించే మేధస్సు వేగం కొంత మేరకే ఉంటోంది. కానీ వర్తమాన కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంలో మేథమెటిక్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ, బయాలజీల కలయికతో కూడిన క్వాంటమ్ కంప్యూటింగ్ కాంతి వేగంతో పోటీ పడుతుంది. లక్షల మందిలో ఒకరిని లక్ష్యంగా చేసుకుని సమాచారం కోరితే క్షణాల్లో అందించే మేధ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రత్యేక. వచ్చే ఏడాది జనవరి నుంచి లక్షల మంది అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ టెక్ పార్కు నుంచి పనిచేసేందుకు ఆస్కారం ఉంది. ఈ వ్యాలీ రాష్ట్రానికే పరిమితం కాకుండా పలు రాష్ర్టాలూ, ప్రాంతాలు, ప్రభుత్వరంగ సంస్థలు వాడుకునే వీలుంది. ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో ప్రత్యేక వర్క్‌షాపు జరగనుంది. ఇందులో క్వాంటమ్ కంప్యూటింగ్‌ను సాంకేతికంగా అభివృద్ధి చేసే సంస్థలు, వినియోగించేవారు, విద్యార్థులు, మేధావులు, ప్రభుత్వరంగానికి చెందిన వారు పాల్గొంటారు. క్వాంటమ్ వ్యాలీపై డిక్లరేషన్‌ను ప్రకటిస్తారు.
అనేక రంగాలకు విస్తృతంగా సేవలు
స్టార్ట్‌పల నుంచి భారీ పరిశ్రమల దాకా, వైద్యరంగం నుంచి సేవారంగం వరకూ, వ్యవసాయం నుంచి వాణిజ్యం దాకా.. అన్ని రంగాల్లోనూ క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు విస్తృతం కానున్నాయి. ఫార్మసీ రంగంలో ఔషధాల నమూనాల కలయికపైనా క్వాంటమ్ కంప్యూటింగ్ స్పష్టమైన సమాధానాలు ఇవ్వగలుగుతుంది. దీనివల్ల ఫార్మారంగంలో క్వాంటమ్ కంప్యూటింగ్‌ను ఉపయోగించి రసాయనాల మిశ్రమాలనూ తయారు చేయనున్నారు. జాతీయ స్థాయిలో ఇప్పటికే పలు ఔషధ తయారీ సంస్థల క్వాంటమ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి. భారీ ఉత్పత్తి సంస్థలు కూడా మావన రహిత తయారీని క్వాంటమ్ కంప్యూటింగ్‌ను ఉపయోగించి చేపడుతున్నాయి. ఒక మనిషి ఆలోచనకూ, లక్ష మంది ఒకేసారి ఆలోచించిస్తే వేగంలో ఎంత తేడా ఉంటుందో .. ప్రస్తుత సంప్రదాయ క్లాసిక్ కంప్యూటింగ్‌కూ, క్వాంటమ్ కంప్యూటింగ్‌కూ అంతే తేడా ఉంటుందనని ఐటీరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. జాతీయ స్థాయిలో క్వాంటమ్ మిషన్ లక్ష్యాలు ఏర్పడ్డాయి. దానికి అనుగుణంగా రాష్ట్రంలోనూ మార్గదర్శకాలను రాష్ట్ర ఐటీశాఖ రూపొందించింది. లాజిస్టిక్, స్పేస్, ఔషధ రంగం, విద్య, వైద్యం, ఆర్థిక, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ కీలకంగా మారింది.
2029 నాటికి ఐబీఎం సంస్థ ‘స్టార్లింగ్’ పేరిట భారీ క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. బ్యాంకులు లక్షలాది మంది ఖాతాదారుల ఆర్థిక లావాదేవీలు క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా నిర్వహించనుండగా, ఇతర వాణిజ్య సంస్థలూ తమ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోనున్నాయి. లాజిస్టిక్స్, సప్లయ్‌చైన్, మాన్యుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, రోబోటిక్స్ లాంటి రంగాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు ఎంతో అవసరం. కొన్ని సంవత్సరాల పాటు శ్రమించి సాధించాల్సిన ఫలితాలు.. ఈ సాంకేతిక విధానం ద్వారా కొద్ది గంటల్లోనే పూర్తిచేసే వెసులుబాటు కలుగుతుంది. రిస్క్ ఎనాలిసిస్, క్లయిమేట్ ఛేంజ్, క్రిస్టోగ్రఫీ ఆప్ట్‌మైజేషన్ వంటి వాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ పరిజ్ఞానం ఒక సులువైన సాధానంగా మారుతుంది. భవిష్యత్తులో ఐఐటీలు, వర్సిటీలు, పరిశోధనాల సంస్థలు ప్రస్తుత క్లాసిక్ క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ వదిలేసి.. క్వాంటమ్ కంప్యూటింగ్‌లోని మారాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు చెబతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న తరుణంలో ఇప్పటిదాకా క్లాసిక్ కంప్యూటింగ్ కోర్సులు చేసిన వారు, క్లాసిక్ కంప్యూటింగ్‌పై ఆధారపడ్డవారి భవిష్యత్తుకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.