Share News

AP CM Chandrababu: జనవరిలో అమరావతికి క్వాంటమ్‌ కంప్యూటర్‌

ABN , Publish Date - Sep 28 , 2025 | 04:54 AM

క్వాంటమ్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొదటి క్వాంటమ్‌ మిషన్‌ను ప్రధాని మోదీ తీసుకొచ్చారు. వచ్చే ఏడాది జనవరిలో మొదటి క్యాంటమ్‌ కంప్యూటర్‌ అమరావతికి వస్తుంది అని...

AP CM Chandrababu: జనవరిలో అమరావతికి క్వాంటమ్‌ కంప్యూటర్‌

  • రాష్ట్రంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీ స్పేస్‌, ఎలకా్ట్రనిక్‌ సిటీల నిర్మాణం

  • సాంకేతిక రంగంలో భారత్‌ పరుగులు

  • దేశ దశ, దిశ మార్చిన బీఎ్‌సఎన్‌ఎల్‌

  • సృజనాత్మకతకు మాతృసంస్థగా ఉండాలి

  • 4జీ టవర్ల ప్రారంభోత్సవ సభలో సీఎం చంద్రబాబు

విజయవాడ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘‘క్వాంటమ్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొదటి క్వాంటమ్‌ మిషన్‌ను ప్రధాని మోదీ తీసుకొచ్చారు. వచ్చే ఏడాది జనవరిలో మొదటి క్యాంటమ్‌ కంప్యూటర్‌ అమరావతికి వస్తుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సైబర్‌ సెక్యూరిటీ, సేఫ్టీకి క్వాంటమ్‌ కంప్యూటర్‌ చాలా అవసరమని అన్నారు. బీఎస్ఎన్‌ఎల్‌ రజతోత్సవం సందర్భంగా శనివారం విజయవాడలో 4జీ టవర్లను జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబా బు మాట్లాడుతూ... రాష్ట్రంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీ, స్పేస్‌ సిటీ, ఎలకా్ట్రనిక్‌ సిటీని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. 30 ఏళ్లలో చేసే అభివృద్ధిని రాబోయే పదేళ్లలో చేయబోతున్నామని తెలిపారు. 1995లో తాను సీఎం అయినప్పుడు నాలెడ్జ్‌ ఎకానమీకి ఐటీ వెన్నెముక అని గుర్తించానన్నారు. ఐటీని ప్రోత్సహించడానికి హైటెక్‌ సిటీ నిర్మించానన్నారు. ‘‘ప్రధానిగా వాజ్‌పేయి ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన కమిటీ టెలికంలో నూతన మార్పులకు కారణమైంది. దీనితో బీఎస్ఎన్‌ఎల్‌ శక్తిమంతమైన సంస్థగా తయారైంది. ఐటీ అంటేనే ఇండియా. ప్రపంచంలో భారతీయులు శక్తిమంతులుగా తయారు కావడానికి ఐటీ కారణం. కోవిడ్‌ సమయంలో 100 దేశాలకు భారత్‌ వ్యాక్సిన్‌ సరఫరా చేసింది. మన దేశంలో రూపొందించిన యూపీఐ యాప్‌ను ఫ్రాన్స్‌, సింగపూర్‌ దేశాలు దత్తత తీసుకున్నాయి. ఒకప్పుడు ఇతర దేశాల ఉత్పత్తులను మనం వాడేవాళ్లం.


ఇప్పుడు మన ఉత్పత్తులను ఇతర దేశాలు వాడుకుంటున్నాయి. 1997 మార్చి నాటితో పోలిస్తే రెండు దశాబ్దాల తర్వాత బీఎ్‌సఎన్‌ఎల్‌ వినియోగదారుల సంఖ్య ఒక బిలియన్‌ను దాటింది. హార్డ్‌గా కాకుండా సాఫ్ట్‌గా పనిచేయాలి. ప్రజలు పలు ధ్రువీకరణ పత్రాల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు 737 సేవలను వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా ఇస్తున్నాం. దీనికి కారణం 4జీనే. 4జీ సేవలు 1995 నాటి నా కల. దేశంలో ఏడాదికి 30 కోట్ల ఫోన్లు తయారు చేస్తున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తయారీ 50 శాతం పెరిగింది. ఒకప్పుడు ఇతర దేశాల్లో తయారైన ఫోన్లను వాడేవాళ్లం. త్వరలోనే దేశం మొత్తం మేక్‌ ఇన్‌ ఇండియా ఫోన్లను ఉపయోగించే పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో 22 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. 14.70 లక్షల మందికి ఫోన్లు ఉన్నాయి. వారిలో 14 లక్షల మందికి స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి’’ అని చంద్రబాబు అన్నారు.


ప్రతి పదేళ్లకూ టెక్నాలజీ అప్‌గ్రేడ్‌

‘‘ప్రపంచానికి భారత్‌ టెక్నాలజీని అందజేసే పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది. 4జీ వచ్చిన తర్వాత మిగిలి జీలన్నీ సులువుగా మారాయి. 2010లో 4జీ, 2020లో 5జీ, 2030లో 6జీ.. ఇలా ఏది కావాలన్నా మనవాళ్లు సులువుగా తయారు చేసే పరిస్థితి. 4జీలో మొదట బీఎస్ఎన్‌ఎల్‌ విఫలం కావడంతో 10 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. తర్వాత ఒక లక్ష, ఒక మిలియన్‌ నుంచి ఇప్పుడు 22 మిలియన్ల వినియోగదారులను బీఎస్ఎన్‌ఎల్‌ సంపాదించుకుంది. ప్రతి పదేళ్లకు ఒకసారి టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ అవుతోంది. టెక్నాలజీని అప్‌గ్రేడ్‌ చేయడం వల్ల బీఎస్ఎన్‌ఎల్‌ మనుగడ సాగిస్తోంది. రిలయన్స్‌ ఇన్‌ఫోకం ఆ పని చేయలేకపోవడం వల్ల ఆ సంస్థ మనుగడ సాగించలేకపోయింది. బీఎస్ఎన్‌ఎల్‌ దేశానికి దశ, దిశ నిర్ధేశించే పరిస్థితికి వచ్చింది. అసలు బీఎస్ఎన్‌ఎల్‌ సంస్థ ఉంటుందా అన్న అనుమానం ఒకప్పుడు ఉండేది. ఈ సంస్థ సృజనాత్మకతకు మాతృసంస్థగా తయారు కావాలి. ప్రైవేటు కంపెనీలు ఎప్పుడూ లాభాలు చూసుకుంటాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు సేవ చేస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు, వరదలకు సంబంధించిన సమాచారాన్ని సెన్సార్ల ద్వారా తెలుసుకుని ఏఐ ద్వారా ప్రజలకు సమాచారం ఇస్తున్నాం. స్మార్ట్‌ ఫోన్లలో ఇతర దేశాలు తయారు చేసిన 24 శాతం యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నాం. వాటి ద్వారా 95ు ఆదాయాన్ని వారు తీసుకుని, 5ు మనకు ఇస్తున్నారు. ఈ యాప్‌లను స్వదేశంలో తయారు చేసుకుంటే 100ు డబ్బులు మన వద్దే ఉంటాయి. 2047 నాటికి భారత్‌ ప్రపంచంలో నంబర్‌ వన్‌గా ఉంటుంది’’ అని చంద్రబాబు అన్నారు.


ఫోన్ల తయారీలో భారత్‌ రెండో స్థానం: పెమ్మసాని

‘‘వాజ్‌పేయి ప్రధాని అయ్యే నాటికి బీఎ్‌సఎన్‌ఎల్‌కు ఏటా రూ.6 వేల కోట్ల నికరలాభం ఉండేది. 2.50 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన 2జీ స్కాంల వల్ల బీఎస్ఎన్‌ఎల్‌ సంస్థ కిందికి దిగజారింది. 2014 తర్వాత ప్రణాళికాబద్ధంగా డిజిటల్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌, మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాల వల్ల బీఎస్ఎన్‌ఎల్‌ రూపురేఖలు మారుతున్నాయి. రూ.25 కోట్ల మందికి ఆనాడు బ్రాండ్‌బ్యాండ్‌ కనెక్షన్లు ఉండేవి. ఇప్పుడు 100 కోట్ల మంది బ్రాండ్‌బ్యాండ్‌ ఉపయోగిస్తున్నారు. 2014-15 మధ్య దేశంలో 60 లక్షల ఫోన్లు తయారయ్యేవి. నేడు ఆ సంఖ్య 33 కోట్లకు చేరింది. ఫోన్ల తయారీలో దేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది’’ అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు.


4జీ వెలుగు రేఖ: వివేక్‌బాంజల్‌

‘‘4జీ ప్రజల జీవితాల్లో ఒక వెలుగు రేఖగా ఉం టుంది. స్వదేశీ పరిజ్ఞానంతో ప్రపంచంలో 4జీ టెక్నాలజీని రూపొందించుకున్న దేశాల్లో భారత్‌ది ఐదోస్థానం. 93 వేల టవర్లు దేశంలో ఉన్నాయి. 14 వేల టవర్లు మారుమూల గ్రామాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో 6 వేల 4జీ టవర్లు ఉన్నాయి. 1200 టవర్లు 600 మారుమూల గ్రామాల్లో ఉన్నాయి. స్వర్ణాంధ్ర-2047 కలను సాకారం చేయడానికి బీఎస్ఎన్‌ఎల్‌ రాష్ట్ర సర్కిల్‌ సిద్ధంగా ఉంది’’ అని బీఎస్ఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ వివేక్‌బాంజల్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, బీఎస్ఎన్‌ఎల్‌ సీజీఎం శేషాచలం, సీడాట్‌ సీఈవో ఆర్కే ఉపాధ్యాయ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.


మారుమూలకూ 4జీ సేవలు: సత్యకుమార్‌

‘‘మారుమూల ప్రాంతాలకు నిరంతరాయంగా టెలికం సేవలు అందడానికి 4జీ సేవలను తీసుకురావడానికి ప్రధాని మోదీ చేసిన ప్రయత్నం మంచి ఫలితాలను ఇచ్చింది. 2014 నాటికి 27 కోట్ల ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 97 కోట్లకు చేరింది. మొబైల్‌ కనెక్షన్లు 112 కోట్లు ఉండగా, వాటిలో 97 కోట్ల వరకు స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. 2014లో ఒక జీబీ డేటా రూ.325 ఉండేది. ఇప్పుడు దాని ఖరీదు రూ.9.34. ఒక్కో జీబీపై రూ.298.64 తగ్గించారు’’ అని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 04:57 AM