Political Analysis : క్వాంటమ్, గూగుల్ వచ్చిన వేళ..
ABN , Publish Date - Oct 17 , 2025 | 05:38 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి ఐబీఎం క్వాంటమ్ కంప్యూటింగ్‌ను, విశాఖకు అది పెద్ద గూగుల్ డేటా సెంటరును తెచ్చారు. ఏపీ బ్రాండ్‌ను అనతికాలంలోనే పునరుద్ధరించారు. పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చి..
తెరపైకి ‘జగన్ చేపల మార్కెట్’
పులివెందులకు ఫిష్ మార్కెట్‌పై నాటి మాటలతో జగన్ నవ్వులపాలు
నాడు అభివృద్ధి అంటే మాంసం కొట్లు.. పచ్చళ్ల తయారీ
మామిడి తాండ్ర, అప్పడాల తయారీ సంస్థలవే పెట్టుబడులు
సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రోల్
(అమరావతి, ఆంధ్రజ్యోతి)
ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి ఐబీఎం క్వాంటమ్ కంప్యూటింగ్‌ను, విశాఖకు అది పెద్ద గూగుల్ డేటా సెంటరును తెచ్చారు. ఏపీ బ్రాండ్‌ను అనతికాలంలోనే పునరుద్ధరించారు. పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చి.. టీసీఎస్, కాగ్నిజెంట్, మిట్టల్ స్టీల్ ప్లాంటును ఏపీకి తెచ్చారు. ఇదం తా ఏడాదిన్నరలోనే సాధించారు. మరి.. ఐదేళ్లు పాలించిన జగన్ పెట్టుబడుల రంగంలో సాధించింది ఏమిటని అడుగుతుంటే వైసీపీ నేతలు ఇబ్బంది పడిపోతున్నారు. జగన్ అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధి అంతా చేపల మార్కెట్లు, మాంసం కొట్లు, పచ్చళ్ల తయారీ, మామిడి తాండ్ర, అప్పడాల తయారీ సంస్థల్లోనే కనిపించేది. పులివెందులలో అట్టహాసంగా ఆనాడు భారీ బహిరంగ సభను జగన్ ఏర్పాటుచేశారు. ‘‘పులివెందులకు ఫిష్ మార్కెట్ వస్తుందని ఎప్పుడైనా ఊహించామా?’’ అంటూ ఆ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. పులివెందులలో చేపల మార్కెట్‌ను తీసుకురావడమే ఘనమన్నట్టు కన్ను ఆర్పకుండా .. గర్వంగా జగన్ చెప్పుకొనేవారు. పులివెందుల ఉదంతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో .. వైసీపీ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది.
‘కోడి గుడ్డు పెడుతుంది.. పిల్లను పెట్టదు’
జగన్ జమానాలో గుడివాడ అమర్నాథ్ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. పెట్టుబడుల రంగం గురించి ఆయన అసెంబ్లీలోనూ.. పెట్టుబడుల సదస్సుల్లోనూ నాడు ‘ఆణిముత్యాల’వంటి మాటలు సెలవిచ్చారు. ‘కోడి గుడ్డు పెడుతుంది. పిల్లను పెట్టదుకదా? పిల్లలను పొదిగేందుకు సమయం పడుతుంది’’ అని తెలిపారు. అప్పడాల తయారీ, మామిడితాండ్ర తయారీ, మసాలా తయారీ పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ఒప్పందాలను చేసుకున్నామంటూ అమర్నాథ్ అసెంబ్లీలో గొప్పగా ప్రకటించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోల్‌కు గురవుతున్నాయి.
ఇక్కడి కంపెనీలతో అక్కడ ఒప్పందాలు
జగన్ బృందం ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు 2022 మే నెలలో దావోస్ వెళ్లింది. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి జగన్ తీసుకువచ్చిన పెట్టుబడులను చూస్తే, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులేవీ రాలేదు. దేశీయంగా అదానీ, షిర్డిసాయి వంటి సంస్థలతో పునరుద్పాదక విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై అవగాహన ఒప్పందాలను చేసుకుని వెనుదిరిగారు. 2023లో విశాఖలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు జరిగింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో తయారయ్యే మామిడితాండ్ర, అప్పడాలు, మసాలా దినుసుల తయారీ ఒప్పందాలు చేసుకున్నారు. వైసీపీ సోషల్‌మీడియా కార్యకర్తలు సూట్లు, బూట్లు వేసుకుని పారిశ్రామికవేత్తల్లా ఆ సదస్సులో హడావుడి చేయడం మరోసారి ఇప్పుడు తెరపైకి వస్తోంది.
ఇదీ అదానీ కథ!
విశాఖలో డేటా సెంటర్ పెడతామంటూ 2014-19 మధ్య గౌతమ్ అదానీ ప్రతిపాదించగా, అప్పటి సీఎం చంద్రబాబు ఆమోదించారు. సెంటరు కోసం శంకుస్థాపన కూడా జరిగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చాక.. చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులు, పరిశ్రమలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది. ఇందులో అదానీ డేటా సెంటర్ కూడా ఒకటి. గంగవరం పోర్టును అదానీ పరం చేస్తున్న తరణంలో, జగన్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా డేటా సెంటర్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. సోలార్ విద్యుత్ కొనుగోళ్ల కోసమే జగన్‌ను అదానీ కలిశారంటూ అప్పట్లో విమర్శలు వచ్చారు. దీనిపై అదానీ స్పందిస్తూ... గంగవరం పోర్టు, విశాఖ డేటా సెంటర్ అంశాలపై జగన్‌తో చర్చించానని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్.. వరదలో కొట్టుకుపోతున్నవాడికి గడ్డిపరక చేతికి అందినట్లుగా వైసీపీ చేతికి అందింది. తమ హయాంలోనే అదానీ డేటా సెంటరు వచ్చిందని ప్రచారం మొదలుపెట్టారు. కానీ, నాడు విశాఖలో రెండోసారి అదానీ డేటా సెంటర్‌కు జగన్ టెంకాయి మాత్రమే కొట్టారు. సెంటరు నిర్మాణ పనులేవీ ముందుకెళ్లలేదు.