Share News

విజయవాడ-విశాఖ మధ్య క్వాడ్రా లైన్‌!

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:49 AM

విజయవాడ-విశాఖపట్నం మధ్య క్వాడ్రా లైన్‌ కోసం సర్వే ముమ్మరంగా జరుగుతోంది. త్వరలోనే పూర్తి చేసి రైల్వే బోర్డుకు నివేదిక ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న డబుల్‌ లైన్‌తో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వందేభారత వెళ్లాలంటే మిగిలిన రైళ్లను రద్దు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. క్వాడ్రాలైన్‌ ఏర్పాటుతో ఈ సమస్యలకు పరిష్కారం లభించనుంది.

విజయవాడ-విశాఖ మధ్య క్వాడ్రా లైన్‌!

-ముమ్మరంగా సాగుతున్న సర్వే పనులు

- ప్రస్తుతం ఉన్న డబుల్‌ లైన్‌ ద్వారానే రాకపోకలు

- రెండు ప్రాంతాల నడుమ 120 రైళ్లు .. అత్యంత రద్దీగా సెక్షన్‌

- పాత ట్రాక్‌ల కారణంగా వేగ నియంత్రణ పాటించాల్సిన పరిస్థితి

- వందేభారత వెళ్లాలంటే మిగిలిన రైళ్లను రద్దు చేయాల్సి దుస్థితి

- క్వాడ్రాలైన్‌ కోసం రైల్వేబోర్డుకు డీపీఆర్‌ పంపిన అధికారులు

విజయవాడ-విశాఖపట్నం మధ్య క్వాడ్రా లైన్‌ కోసం సర్వే ముమ్మరంగా జరుగుతోంది. త్వరలోనే పూర్తి చేసి రైల్వే బోర్డుకు నివేదిక ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న డబుల్‌ లైన్‌తో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వందేభారత వెళ్లాలంటే మిగిలిన రైళ్లను రద్దు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. క్వాడ్రాలైన్‌ ఏర్పాటుతో ఈ సమస్యలకు పరిష్కారం లభించనుంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

విజయవాడ - విశాఖ మధ్యన ప్రస్తుతం డబుల్‌ లైన్‌ ఉంది. దీనికి అదనంగా మరో డబుల్‌ లైన్‌ను అభివృద్ధి చెయ్యాలని విజయవాడ డివిజనల్‌ రైల్వే అధికారులు దక్షిణ మధ్య రైల్వేకు గతంలో ప్రతిపాదించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను కూడా తయారు చేసి దక్షిణ మధ్య రైల్వేకు సమర్పించారు. దక్షిణ మధ్య రైల్వే ఈ డీపీఆర్‌ను రైల్వే బోర్డుకు పంపడంతో సర్వేకు ఆదేశించింది. సర్వే ప్రకారం ఫిజిబిలిటీ నివేదికతో పాటు ఈ ప్రాజెక్టుకు ఎంతమేర భూసేకరణ అవసరం అవుతుంది? ఎంత వ్యయం అవుతుందన్న దానిపై మరింత స్పష్టత వస్తుంది. ప్రస్తుతం రైల్వేబోర్డు ఆదేశాల మేరకు విజయవాడ - విశాఖపట్నం మధ్యన క్వాడ్రా లైన్‌కు ముమ్మరంగా సర్వే జరుగుతోంది. అదనంగా మరో రెండు లైన్ల నిర్మాణానికి ఎంత భూములు అవసరమవుతాయి ? ప్రస్తుత డబుల్‌ లైన్‌ వెంబడి ఉన్న ప్రాంతాలలో అధ్యయనం చేయటం జరుగుతోంది. కొత్త సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నాటికి సర్వేను పూర్తి చేసి రైల్వేబోర్డుకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది.

క్వాడ్రాలైన్‌ ఎందుకంటే!

విజయవాడ - విశాఖ మధ్యన ప్రస్తుతం రోజుకు 120పైగా రైళ్లు నడుస్తున్నాయి. పాసింగ్‌ త్రూ రైళ్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి. విజయవాడ - విశాఖ మధ్యన రద్దీ విపరీతంగా ఉంది. ఇలా రిజర్వేషన్‌ తెరవగానే.. అలా సీట్లు బుక్‌ అయిపోతున్నాయి. చాంతాడంత వెయిటింగ్‌ లిస్టులు ఉంటున్నాయి. సీట్ల లభ్యత అనేది కష్టంగా ఉంటోంది. పాత ట్రాకుల కారణంగా రైళ్లు కూడా వేగంగా వెళ్లలేకపోతున్నాయి. వేగపరిమితిని నియంత్రించాల్సి వస్తోంది. కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలన్నా ఇబ్బందిగా ఉంటోంది. వందే భారత రైలు వేగంగా ప్రయాణించే విషయంలో ఈ మార్గంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్యన ఉన్న డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవటానికి వీలుగా అదనంగా మరో రెండు లైన్లను ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులు ప్రతిపాదించారు. క్వాడ్రాలైన్‌ కారణంగా ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సంఖ్యను రెట్టింపు చేయవచ్చు. ప్రస్తుతం 120 నుంచి 240 వరకు రైళ్లను నడపటానికి అవకాశం ఉంటుంది. అదనంగా వేసే రెండు లైన్ల కారణంగా రైళ్లను మరింత వేగంగా నడపటానికి దోహదపడుతుంది. కొత్త ట్రాక్స్‌, ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ కారణంగా రైళ్లను గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తించటానికి అవకాశం ఉంటుంది.

మరిన్ని వందేభారతలు నడపటానికి దోహదం

విజయవాడ - విశాఖపట్నం మార్గంలో ప్రస్తుతం ఒకే ఒక్క వందే భారత రైలు నడుస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు వెళ్తోంది. వందేభారత రైలును వేగంగా నడిపించటం కోసం ఈ మార్గంలో అనేక ఇతర రైళ్లను రద్దు చేయాల్సి వస్తోంది. అదనంగా మరో రెండు లైన్లను ఏర్పాటు చేయటం వల్ల మరిన్ని వందే భారత రైళ్లను ఈ మార్గంలో నడిపించటానికి అవకాశం ఏర్పడుతుంది. మిగిలిన రైళ్లను రద్దు చేసే అవసరం కూడా ఉండదు.

బడ్జెట్‌ కేటాయింపుల తర్వాతే..

ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ ప్రాజెక్టు సర్వే పూర్తికానుంది. రైల్వే బోర్డుకు నివేదించాక.. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యలో అనేక దశలు ఉంటాయి. 2026వ సంవత్సరం మార్చిలో కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేయగలిగితే ఈ ప్రాజెక్టును త్వరగా కార్యరూపంలోకి తీసుకురావటానికి అవకాశం ఉంటుంది. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించటానికి ఎంత లేదన్నా.. వచ్చే ఏడాది డిసెంబరు వరకు సమయం పట్టే అవకాశం ఉంది.

Updated Date - Nov 14 , 2025 | 12:49 AM