MANSAS Trust Land Donation: పూసపాటి.. దానంలో మేటి!
ABN , Publish Date - Dec 21 , 2025 | 04:18 AM
రాజులు లేరు.. రాజ్యాలు లేవు.. కానీ విజయనగరం పూసపాటి రాజవంశీయులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు చేపడతున్నారు.
1000 కోట్ల విలువైన భూమి దానం
ఏవియేషన్ ఎడ్యుసిటీకి 136 ఎకరాలు.. మాన్సాస్ ట్రస్టు తరఫున అందించిన పూసపాటి రాజవంశం
ముందుకొచ్చిన అదితి గజపతిరాజు.. నాడు అశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు
ఇప్పుడు దేశంలోనే తొలి సంస్థకు శ్రీకారం
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
రాజులు లేరు.. రాజ్యాలు లేవు.. కానీ విజయనగరం పూసపాటి రాజవంశీయులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు చేపడతున్నారు. ఇప్పటికే విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజల కోసం రూ.వేల కోట్ల ఆస్తులను వదులుకున్నారు. ఇప్పుడు సుమారు రూ.1000 కోట్లు విలువైన భూమిని భావితరాల భవితకు, ఏవియేషన్ ఎడ్యుసిటీ కోసం దానం చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలిమండలం అన్నవరం వద్ద మాన్సాస్ ట్రస్టుకు చెందిన 136.63 ఎకరాలను ఏవియేషన్ ప్రాజెక్టుకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మాణం దాదాపు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పౌరవిమానయాన రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా ప్రపంచంలో పౌరవిమానయానానికి సంబంధించిన యూనివర్సిటీ బ్రాంచ్‌లను ఒకచోటకు తెచ్చేందుకు ఏపీ మంత్రి నారా లోకేశ్ సంకల్పించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు సమీపంలోని ప్రభుత్వ భూముల్లో కానీ.. రైతుల నుంచి సేకరించిన భూముల్లో కానీ ఏవియేషన్ ప్రాజెక్టు నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం చేపడుతున్న జీఎంఆర్ సంస్థ ఇందుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం మాన్సాస్ ట్రస్ట్ తరఫున రూ.1000 కోట్ల విలువైన 136.63 ఎకరాల భూమిని ఇచ్చేందుకు పూసపాటి రాజవంశీయురాలు, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ముందుకు వచ్చారు. ఈ ప్రాజెక్టుకు తమ రాజవంశీయుడైన అలక్ మహారాజా గజపతి పేరు పెట్టాలని కోరారు.
అప్పట్లోనే పూసపాటి రాజవంశీయులకు రెండు సొంత విమానాలు ఉండేవి. విమానాశ్రయాలను సైతం సొంతంగా నిర్మించారట. అశోక్ గజపతిరాజు సైతం పైలట్ కావాలనుకున్నారు కానీ అది సాకారం కాలేదు. పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీలో పూసపాటి కుటుంబానికి భాగస్వామ్యం దక్కింది. ఇటీవల విశాఖలో ఒప్పందం జరగగా.. ఏవియేషన్ ఎడ్యుసిటీకి 136.63 ఎకరాలు భూములు కేటాయించేలా దేవదాయశాఖ అనుమతులిచ్చేందుకు సమ్మతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పౌరవిమానయాన అభివృద్ధికి ఊతం
దేశంలో విమానయానం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికుల రాకపోకలు ఏటా పెరుగుతున్నాయి. ఇందుకు తగ్గట్టు పౌరవిమానయాన శాఖలో మానవ వనరులు అందించేందుకు మన దేశంలో ఎడ్యుకేషన్ సంస్థలు లేవు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాపంగా ఏవియేషన్ రంగంలో ఉన్న యూనివర్సిటీల బ్రాంచ్‌లను ఇక్కడికి రప్పించేలా మంత్రి లొకేశ్ ఏర్పాట్లు చేశారు. జీఎంఆర్‌తో పాటు మాన్సాస్ ముందుకు రావడంతో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
ఆనందంగా ఉంది
ప్రతి ఒక్కరూ చదవాలనే ఆకాంక్షతో పూర్వం నుంచి మా తాతగారైన పీవీజీ రాజు ఏన్నో విద్యాసంస్థలను స్థాపించారు. వాటి ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యను అందించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో మాన్సాస్ తరఫున ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టుకు భూములు ఇస్తున్నాం. మా పూర్వీకులకు పౌరవిమానయానంపై ప్రత్యేక దృష్టి ఉంది. మా తాత అలక్‌నంద మహారాజా గజపతి పేరుతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు అవుతుండడం శుభ పరిణామం. ప్రజల శ్రేయస్సు పూసపాటి వంశీయుల లక్ష్యం.
- పూసపాటి అదితి గజపతిరాజు,
విజయనగరం ఎమ్మెల్యే