Kurnool: పునర్వికకు పునర్జన్మనివ్వరూ..
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:56 AM
ఆ చిన్నారి పుట్టినప్పుడు 3.5 కిలోల బరువు ఉంది. ఆరు నెలలైనా శరీరం కదిలించపోవడంతో వైద్యులకు చూపించారు.
రూ.16 కోట్ల ఇంజెక్షన్‌తో బతికే అవకాశం
కర్నూలు జిల్లాలో చిన్నారికి అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వ్యాధి
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
వెల్దుర్తి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆ చిన్నారి పుట్టినప్పుడు 3.5 కిలోల బరువు ఉంది. ఆరు నెలలైనా శరీరం కదిలించపోవడంతో వైద్యులకు చూపించారు. ఆమెకు జన్యుపరమైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్‌ఎంఏ) వ్యాధి సోకిందని, చికిత్సలో భాగంగా రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ చేయించాలని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనైంది. సాధారణ వైద్య ఖర్చులనే భరించలేని ఆ నిరుపేదలకు తమ కుమార్తెను ఎలా బతికించుకోవాలో అర్థం కావడం లేదు. దీంతో దాతల సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన జంపాల మంగలి సురేశ్‌కుమార్, పుష్పావతిది మేనరిక వివాహం. వారికి కుమారుడు, కూతురు ఇద్దరు సంతానం. కుమార్తె పేరు పునర్వికశ్రీ.. 2025 మే 12న జన్మించింది. పుట్టినప్పుడు 3.5 బరువు ఉంది. ఆరు నెలలైనా శరీరాన్ని కదిలించలేకపోవడంతో కర్నూలులోని ప్రైవేటు వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఆమెకు అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ సోకిందని చెప్పారు. ఇదొక జన్యుపరమైన వ్యాది. వెన్నెముకలోని కణాలను దెబ్బతీసి కండరాల బలహీనత, క్షీణతకు దారితీస్తుంది. దీనివల్ల నడవడం కష్టమవుతుంది. ఈ వ్యాధి చికిత్సకు ఒకే ఒక్కసారి ఇచ్చే జోల్‌జెన్‌స్మా ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు ఉంటుంది.
దాతల సాయం కోసం ఎదురుచూపు..
పునర్వికశ్రీ తండ్రి సురేశ్ వెల్దుర్తి కొత్తబస్టాండ్ సమీపంలో చిన్న బంకులో క్షవర వృత్తి చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కనీస వైద్య ఖర్చులు కూడా పెట్టుకోలేని దుర్భర పరిస్థితి ఆ పేద తల్లిదండ్రులది. ప్రపంచలోనే అత్యంత ఖరీదైన రూ.16 కోట్ల ఇంజక్షన్‌ను కొనుగోలు చేయడం వారి వల్ల కాదు. ఈ నేపథ్యంలో వెన్నెముక కండరాల క్షీణత వ్యాధి గతంలో చాలా మందికి వచ్చి, దాతల సహాయంతో, ఇంజక్షన్ కంపెనీ వారి లక్కీడ్రా ద్వారానో, క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా సహాయం పొందవచ్చని తెలుసుకున్న సురేశ్... ‘ఇంపాక్ట్‌గురు క్రౌడ్ ఫండింగ్’ సంస్థను ఆశ్రయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు సాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డే క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కూడా తన కూతురి పరిస్థితిని వివరిస్తూ సురేశ్ సాయం అర్థించాడు. సాయం చేయదలచిన వారు సురేశ్ ఫోన్‌పే నంబర్ 7799279441 లేదా సెల్ నంబర్ 9052635529లో సంప్రదించవచ్చు. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ఇంపాక్ట్‌గురు.కామ్ ద్వారా స్కాన్‌చేసి ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమేజాన్ లేదా యూపీఐ కోడ్ (supportpunarv@yesbank) ద్వారా సాయం చేయవచ్చు.